సినిమా రివ్యూ: బ్రోచేవారెవరురా

సమీక్ష: బ్రోచేవారెవరురా
రేటింగ్‌: 3/5
బ్యానర్‌:
మాన్యం ప్రొడక్షన్స్‌
తారాగణం: శ్రీవిష్ణు, నివేథా థామస్‌, సత్యదేవ్‌, నివేథా పేతురాజ్‌, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, శివాజి రాజా, అజయ్‌ ఘోష్‌, హర్షవర్ధన్‌, కెఎస్‌ అయ్యంగార్‌ తదితరులు
సంగీతం: వివేక్‌ సాగర్‌
కూర్పు: రవితేజ గిరిజాల
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌
నిర్మాత: విజయ్‌ కుమార్‌ మాన్యం
రచన, దర్శకత్వం: వివేక్‌ ఆత్రేయ
విడుదల తేదీ: జూన్‌ 28, 2019

గత వారం తెరపై 'సాయి శ్రీనివాస ఆత్రేయ' అలరిస్తే, ఈవారం వివేక్‌ ఆత్రేయ తెర వెనుక విజృంభించాడు. సెల్ఫ్‌ కిడ్నాప్‌ ప్లాట్‌ చేసుకోవడం, సినిమా కథ నెరేట్‌ చేస్తుండగా ఆ పాత్రలు జీవం పోసుకోవడం లాంటి పాయింట్స్‌ ఇంతకుముందు పలుమార్లు పలు చిత్రాల్లో చూపించారు. కానీ వివేక్‌ ఆత్రేయ అవే పాయింట్స్‌కి సరికొత్త ట్రీట్‌మెంట్‌ రాసుకున్నాడు. 'చలనమే చిత్రము - చిత్రమే చలనము' అనే ట్యాగ్‌లైన్‌ క్యాచీగా వుందని పెట్టింది కాదు. ఈ చిత్ర కథనం మొత్తం ఈ రెండు లైన్లలోనే వుంటుంది కానీ వ్యూయింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ స్పాయిల్‌ చేయడం ఇష్టం లేదు కనుక ఆ డీటెయిల్స్‌లోకి వెళ్లడం లేదు. 

దర్శకుడిగా బ్రేక్‌ కోసం చూస్తోన్న విశాల్‌ (సత్యదేవ్‌) ఓ నటి అపాయింట్‌మెంట్‌ కోసం చూస్తుంటాడు. షాలిని (పేతురాజ్‌) అతని కథ వినడానికి సరేనంటుంది. ఓపెన్‌ చేస్తే... రాహుల్‌ (శ్రీవిష్ణు), రాకీ (ప్రియదర్శి), రాంబో (రాహుల్‌ రామకృష్ణ) ముగ్గురు దోస్తులు. ఇంటర్మీడియట్‌ పాస్‌ కాలేక డక్కామొక్కీలు తింటూ వుండే ఈ బ్యాచ్‌కి కొత్తగా కాలేజ్‌లో చేరిన మిత్ర (థామస్‌) ఫ్రెండ్‌ అవుతుంది. విపరీతమైన క్రమశిక్షణతో కూతురి ఇష్టాలని కూడా లెక్క చేయని తండ్రితో వుండలేక ఇంటి నుంచి వెళ్లిపోదామని అనుకుంటుంది. ఆమె బయటకి వచ్చేస్తే బతకడానికి డబ్బులు కావాలి కనుక అందరూ కలిసి కిడ్నాప్‌ డ్రామా ఆడతారు. ఆమె తండ్రి నుంచి డబ్బులు రాబడతారు. కట్‌ చేస్తే... విశాల్‌ తండ్రికి యాక్సిడెంట్‌ అయి పది లక్షలు అవసరమవుతాయి. ఆ డబ్బు తీసుకుని విశాల్‌, షాలిని కారులో బయల్దేరతారు. అప్పుడే అనుకోని ఓ సంఘటన జరుగుతుంది. అదేమిటి? మిగతా కథ ఎటు మలుపులు తిరుగుతుంది అనేది వెండితెరపైనే చూడాలి.

వివేక్‌ ఆత్రేయ పకడ్బందీ కథనం రాసుకున్నాడు. మొదట్లో చూసినపుడు మామూలుగా అనిపించిన సంభాషణలు కూడా తర్వాత కథలో కీలక పాత్ర పోషిస్తాయి. ఓ సన్నివేశంలో చాలా సాధారణంగా కనిపించిన ఓ సంఘటన అటుపై కథలో మలుపుకి కారణమవుతుంది. ఇలాంటి కథలు చాలానే తెరకెక్కాయనేది వివేక్‌ ఆత్రేయకి తెలుసు. అందుకే కథ కంటే దానిని చెప్పడం మీదే దృష్టి పెట్టాడు. తెలిసిన కథనే ఎలా చెబితే ప్రేక్షకులు సర్‌ప్రైజ్‌ అవుతారనేది పక్కాగా ఆలోచించుకుని వివిధ త్రెడ్స్‌ని కలుపుతూ ఆ కథని స్ట్రెయిట్‌గా, రివర్స్‌గా అన్ని రకాలుగా మైండ్‌లో ప్లే చేసుకుని బెస్ట్‌ పాజిబుల్‌ స్క్రీన్‌ప్లే రెడీ చేసుకున్నాడు. 

ఆరంభంలో కేవలం పాత్రల పరిచయాలకి, వారి నేపథ్యాలకి చాలా సమయం తీసుకున్నా కానీ క్యారెక్టర్స్‌ ఎస్టాబ్లిష్‌ అవుతోన్న టైమ్‌ని ఎంటర్‌టైన్‌మెంట్‌కి భేషుగ్గా వాడుకున్నారు. క్లాస్‌ రూమ్‌ సీన్స్‌, పేరెంట్స్‌, లెక్చరర్లతో ఇంటరాక్షన్స్‌తో బాగా నవ్వించారు. కిడ్నాప్‌ డ్రామా అంతా తెలిసిన వ్యవహారంలానే నడుస్తున్నా కానీ ఇంటర్వెల్‌ ముందు ఒక ఊహించిన మలుపు, ఒక ఊహించని మలుపుతో 'చలన చిత్రాన్ని' రసపట్టుకి చేరుస్తారు. అంతవరకు కథని ఒక విధమైన భ్రమలో వుంచి నడిపిస్తే, అటుపై కొన్ని పాత్రల దారులు క్రాస్‌ అయిన తర్వాత కథని మల్టిపుల్‌ లేయర్స్‌ని ఒకదానిని మరొకటి డిస్టర్బ్‌ చేయకుండా, ఒకదానికి మరొకటి అడ్డుపడి కన్‌ఫ్యూజ్‌ కానివ్వకుండా జాగ్రత్తగా డీల్‌ చేసారు. 

సిట్యువేషన్స్‌ సీరియస్‌ అయి, స్క్రీన్‌ప్లే వేగం పుంజుకున్నా కానీ కామెడీ పండించడానికి వున్న స్కోప్‌ని సెర్చ్‌ చేయడం మానలేదు. కథలోకి లేట్‌ ఎంట్రీ ఇచ్చే పాత్రలు పూర్తి ఇన్‌ఫర్మేషన్‌ లేక చేసే కామెడీ రామ్‌గోపాల్‌వర్మ చిత్రాల్లోని కామెడీని గుర్తు చేస్తుంది. ఎదురుగా క్లూస్‌ అన్నీ కనిపిస్తున్నా వేరే యాంగిల్‌లో ఆలోచించే పోలీస్‌గా హర్షవర్ధన్‌ పాత్రని, కీలక సమయాల్లో ఎంట్రీ ఇచ్చి మలుపులకి కారణమయ్యే బిత్తిరి సత్తి పాత్రని హాస్యానికి ఉపయోగించుకున్న తీరు మెప్పిస్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో టెన్షన్‌ని బిల్డ్‌ చేసి... రెండు వైపులా మంచి పాత్రలే వున్నపుడు మోరల్‌గా ఎవరివైపు మొగ్గాలి, ఎవరికి రూట్‌ చేయాలి అనే మీమాంసకి గురి చేస్తూ ఆ ట్యాంగిల్‌లోకి ఆడియన్స్‌ని పుల్‌ చేసిన తీరు భలేగా వుంది. అన్ని త్రెడ్స్‌కి ముడి వేస్తూ, లూజ్‌ ఎండ్స్‌ అన్నీ క్లోజ్‌ చేస్తూ... చివరకు ఓ చక్కని సందేశాన్ని ఇటు పిల్లలకి, అటు తల్లితండ్రులకి కూడా ఇచ్చి ముగించిన తీరు విశేషంగా మెప్పిస్తుంది. 

అయితే అన్ని త్రెడ్స్‌ని ప్యారలల్‌గా నడిపిస్తున్నపుడు సహజంగానే నిడివి పెరిగిన భావన కలుగుతుంది. తండ్రికీ, కూతురికీ మధ్య వున్న డిస్టెన్స్‌ని మాటలలో చూపించకుండా సన్నివేశాలకి ప్రాధాన్యమిచ్చి వుంటే బాగుండేది. ఈ కథలో కీలకమైన అంశం కనుక దీనిపై మరింత డ్రామా పండించినట్టయితే తర్వాత ఆయా పాత్రలకి వచ్చే పరివర్తన ఇంకా హైలైట్‌ అయ్యేది. అలాగే కథ చెప్పడానికి వచ్చిన దర్శకుడిపై ఒక సక్సెస్‌ఫుల్‌ సినీ నటి మనసు పారేసుకోవడం కూడా కన్విన్సింగ్‌గా అనిపించదు. వారిమధ్య అంత స్ట్రాంగ్‌ బాండింగ్‌ ఏర్పడిన సందర్భమూ కనిపించదు. 

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ ఇంటర్మీడియట్‌ స్టూడెంట్స్‌ అంటే నమ్మశక్యంగా అనిపించదు కానీ ఒకసారి దానిని ఓవర్‌లుక్‌ చేసాక దాని వల్ల పెద్ద ఇబ్బందేమీ వుండదు. ముగ్గురూ తమ పాత్రలని చాలా బాగా పోషించారు. నివేథా థామస్‌ మంచి నటి అనేది తెలిసినదే. మళ్లీ ఆమెకి గుర్తుండిపోయే పాత్ర లభించింది. సత్యదేవ్‌ పర్‌ఫార్మెన్స్‌ కన్విన్సింగ్‌గా వుంది. నివేథా పేతురాజ్‌ కూడా తన పరిధిలో బాగానే చేసింది. శివాజీ రాజా నటన సహజంగా వుంది. హర్షవర్ధన్‌ ఎప్పటిలానే ఎఫర్ట్‌ లేకుండా 'సమ్‌థింగ్‌ ఈజ్‌ ఫిషీ' అంటూ కామెడీ పండించిన విధానం మరింత నవ్విస్తుంది. 

పాటలు నేపథ్యానికే పరిమితమయ్యాయి కానీ వగలాడి పాట మాత్రం ఉనికిని నిలుపుకుంది. నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం, ప్రొడక్షన్‌ డిజైన్‌, ఎడిటింగ్‌ అన్నీ చక్కగా కుదిరాయి. మొదటి సినిమాలో ఎక్కువ ఫిలాసఫీ చూపించిన దర్శకుడు ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్‌ అస్సలు మిస్‌ అవకుండా చూసుకుని స్క్రీన్‌ప్లేతో సగం సక్సెస్‌ సాధించేసాడని చెప్పాలి. 

క్రైమ్‌ కామెడీలని ఇష్టపడే వాళ్లనే కాకుండా, వైవిధ్యభరిత వినోదాన్ని ఆశించే ప్రేక్షకులకి కూడా సరిపడా స్టఫ్‌ ఇందులో వుంది. కేవలం కామెడీతో కాలక్షేపమే కాకుండా చిన్న చిన్న సర్‌ప్రైజ్‌లతో ఒక శాటిస్‌ఫయింగ్‌ మూవీ వ్యూయింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. 

బాటమ్‌ లైన్‌: దోచేవారు వీరురా!

గణేష్‌ రావూరి