బ్రేకింగ్.. మై 'త్రీ' ఇక మై'టూ' మాత్రమే

మైత్రీ మూవీమేకర్స్... టాలీవుడ్ లోకి సర్రున దూసుకువచ్చిన నిర్మాణ సంస్థ. శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, రంగస్థలం లాంటి బ్యాక్ టు బ్యాక్ మూడు బ్లాక్ బస్టర్లతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన సంస్థ ఇది. అంతేకాదు. ఇండస్ట్రీలో చాలామంది పెద్ద హీరోలకు, దర్శకులకు అడ్వాన్స్ లు ఇవ్వడం, అలాగే వరుసగా ఒకేసారి అరడజను సినిమాలు ప్లాన్ చేసి, ముందుకు నడిపించడం వంటి పనులతో నిర్మాణ సంస్థల్లో హీరో అయిపోయింది.

మైత్రీమూవీస్.. పేరులో మై..త్రీ అని వున్నందుకు నవీన్, రవిశంకర్, మోహన్ సివివి అనే ముగ్గురు భాగస్వాములు దీనికి. వీరి ముగ్గురు ఒకే ప్రాంతానికి చెందినవారు. స్నేహితులు. అందుకే మైత్రీ అంటూ రెండు విదాల అర్థంవచ్చేలా బ్యానర్ పెట్టుకున్నారు.

కానీ ఇప్పుడు ఈ బంధం విడిపోతోంది. ఇక ఇద్దరే భాగస్వాములు మిగలబోతున్నారు. మోహన్ సివివి ఈ నిర్మాణ సంస్థ నుంచి తప్పుకుంటున్నారు. నవీన్, రవి మాత్రమే మిగలబోతున్నారు. దీనివెనుక ఒకటికి మించిన కారణాలే వున్నట్లు తెలుస్తోంది,

ఇండస్ట్రీలో చాలామందికి తెలియని కీలక విషయం ఒకటివుంది. పెరుకు ముగ్గురు భాగస్వాములు కానీ, ఇద్దరే పెట్టుబడి పెట్టే భాగస్వాములు. రవిశంకర్ ది నిర్వహణ భాగస్వామ్యం. ఇప్పుడు ఆయన కూడా పెట్టుబడి భాగస్వామిగా మారాలనుకుంటున్నారు. ఇంతమంది అవసరమా? అన్న ఆలోచన రావడం మోహన్ సివివి తప్పుకోవడానికి ఒక కారణం అని వినిపిస్తోంది.

కానీ ఇది ఒకటే కారణం కాదని, తరచు అమెరికా నుంచి ఇక్కడకు వచ్చి వ్యవహారాలు చూసుకోలేకపోవడం, మైత్రీ చకచకా ప్లాన్ చేస్తున్న సినిమాల లైనప్ కూడా మోహన్ కు అంతగా నచ్చడంలేదని తెలుస్తోంది. అదీ కాక, సుకుమార్-మహేష్ బాబు మధ్య తేడా రావడం, సుకుమార్ ను తీసుకెళ్లి బన్నీతో అర్జెంట్ గా సినిమా ప్రకటించడం వంటి వ్యవహారాలు మోహన్ కు అంతగా నచ్చలేదని తెలుస్తోంది.

అప్పట్లో మోహన్ నే స్వయంగా మహేష్ తో మాట్లాడి, చెన్నయ్ కు సుకుమార్ ను పంపి, సారీ చెప్పించి ప్యాచప్ కు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచే తప్పుకోవాలనే ఆలోచనలో వున్న మోహన్ ఇప్పటికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి నిర్మాణంలో వున్న సినిమాలు పూర్తయి, లెక్కలు తేలిన తరువాత నుంచి మైత్రీమూవీస్ లో ఇద్దరు భాగస్వాములే వుంటారు. అంటే మై'త్రీ'.. అప్పటి నుంచి మై'టూ'గా మిగులుతుందన్నమాట.

జగన్‌ మొహంలో చిరునవ్వు మార్పు కనబడుతోంది

Show comments