వలసల్నే నమ్ముకుంటే నట్టేట మునుగుతారు!

ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది సామెత! కానీ ఇంట ఓడిపోయినా... రచ్చగెలిచినందుకు, ఇంట్లో పండగ చేసుకునే వెరైటీ బాపతు కథా కమామీషూ కేవలం కమలదళానికే చెల్లుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీకి కేవలం ఒక్కటంటే ఒక్కశాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినా సరే... వారు రాష్ట్రంలో ప్రధాన ప్రత్యామ్నయంగా ఎదుగుతాం.. అధికారం లక్ష్యంగా పార్టీని విస్తరిస్తాం అని డాంబికాలు పలకగలుగుతున్నారంటే కేంద్రంలో అధికారంలోకి రావడం మాత్రమే కారణం. అయితే, పార్టీని బలోపేతం చేయడానికి వారు కేవలం వలసల్నే నమ్ముకుంటే మాత్రం నట్టేట మునుగుతారని తెలుసుకోవాలి.

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలకు పరిమితం కాగానే... సెకండ్ ప్లేస్ మీద భాజపాకు కన్నుపడింది. అందులో తప్పేంలేదు. కాసింత మెరుగైన ప్రజాదరణ కావాలని ఏ పార్టీ అయినా కలగంటుంది. భాజపా కూడా ప్రస్తుతం అదే ఆశలతో ఉంది. అయితే తమాషా ఏంటంటే.. రాష్ట్రంలో పార్టీని బలపరచుకునే ప్రయత్నాలు చేయకుండా, కేవలం తెలుగుదేశం నుంచి వచ్చే వలసల మీద మాత్రమేవారు ఆధారపడుతుండడమే!

భాజపాకు  రాష్ట్రం మీద నిజంగానే ఫోకస్ ఉంటే గనుక, ఈ రాష్ట్రంలో గెలవాలని నిజంగా కోరుకుంటే గనుక... చేయాల్సిన తరీకా ఇది కాదు. బడ్జెట్ లో వారు ఏపీకి నామమాత్రపు కేటాయింపులు కూడా చేయలేదు. ప్రస్తుతం పార్టీ సభ్యత్వ నమోదు ప్రహసనం మొదలుపెట్టి నడిపిస్తున్నారు. నిజానికి సభ్యత్వ నమోదు పెద్ద ఫార్సు. వేలమంది సభ్యులు ఉన్నప్పటికీ.. అందులో పదోవంతు కూడా వారికి ఓట్లు పడడంలేదు. ఏదో బలవంతాన సభ్యత్వాలు మమ అనిపిస్తున్నారు. రాష్ట్రానికి మేలుచేస్తే తప్ప... భాజపాను ఏపీ ప్రజలు ప్రేమించరు.

ఆ సంగతి వదిలేసి.. సభ్యత్వ నమోదు కోసం వచ్చిన మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్... తెలుగుదేశం నుంచి వలసలు ఇంకా కొనసాగుతాయని అంటున్నారు. అదే తమకు బలం అవుతుందని వారు భ్రమపడితే మునుగుతారు. అక్కడ చెల్లని సరుకును వీరేం చేసుకుంటారు. అందుకే కమల నాయకులు కేవలం వలసలకై ఎగబడకుండా.. ప్రజలకోసం, ప్రత్యేకించి ఏపీ కోసం కేంద్రంనుంచి ఏదైనా చేస్తే తప్ప వారికి మనుగడ అసాధ్యం.

ప్రత్యర్థులు ఏకమై సుధీర్ విజయాన్ని ఆపలేకపోయారు

Show comments