భాజపాకు ఏమిటీ మిడిమేలపు ఆత్రం!

‘ఆత్రగాడికి ఆకులో వడ్డించొచ్చు గానీ.. నాకు మాత్రం నేలమీదనే పెట్టెయ్యమన్నాడట వెనకటికి ఓ ప్రబుద్ధుడు. ఇప్పుడు తెలుగు రాష్టాల్లో పార్టీని బలోపేతం చేసుకోవాలని.. అర్జంటుగా నెంబర్ టూ పొజిషన్ కు వచ్చేయాలని ఉబలాటపడుతున్న భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న తీరు కూడా అంతకంటె భిన్నంగా ఎంతమాత్రమూ లేదు. అర్జంటుగా బలహీనంగా ఉన్న ఇతర పార్టీల్లోని నాయకుల్ని తమలో కలిపేసుకుని.. తమ బలం అమాంతం పెంచేసుకోవాలని వారు ఉత్సాహపడుతున్నారు. అదే క్రమంలోనే ప్రస్తుతం.. తెలంగాణలో కొండా సురేఖ- మురళి దంపతులకు కూడా గేలం వేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఏ పార్టీ అయినా సరే... తమకు బలం లేనిచోట బలపడాలని కోరుకోవడం సహజం. కానీ అందుకు సహజమైన మార్గాలు ఏం ఉండాలి? ఈ రాష్ట్రాలకు మేలు చేయడమూ.. తద్వారా ప్రజల్లో తమ గురించి ఒక సానుకూల అభిప్రాయాన్ని  ఏర్పాటుచేసుకోవడం తొలుత జరగాలి. ప్రజల్లో తమ పార్టీకి ఆదరణ పెంచుకోవాలి. ఆ తర్వాత.. తమ పార్టీ సిద్ధాంతాలకు సమీపంగా ఉండే నాయకులను ఆహ్వానించి చేర్చుకోవాలి. తమ పార్టీకి ఉన్న ‘ప్రజా’బలాన్ని గుర్తించి వారు కూడా వచ్చిచేరాలి. అప్పుడు ఆ పార్టీ నిలకడగా.. బలపడుతుంది.

కానీ భాజపాకు అంత ఓపికలేదు. పార్టీకి సొంత ప్రజాబలం ఉండాలనే కోరిక వారికిలేదు. తమ వద్ద ఇప్పుడు అధికార బలం ఉంది. ధనబలానికి కూడా తక్కువలేదు. ఇవి చూసి.. ‘సొంత’బలం ఉన్న నాయకులు ఎగబడి తమ వద్దకు వచ్చేయాలని వారు ఆశిస్తున్నారు. చెప్పుకోడానికి పార్టీకి నాయకుల జాబితా పెద్దదిగా తయారు కాగానే, పార్టీ బలపడిపోయినట్లే అనే భ్రమల్లో ఉన్నారు.

అందుకే తెలంగాణలో, ఆంధ్రలో ఇప్పటికే కూడా ఇప్పటికే ఇతర పార్టీల నుంచి ఎడా పెడా నాయకుల్ని చేర్చుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను మరింత బలహీన పరచడానికి కొండాసురేఖ- మురళిల కోసం కూడా ఎగబడుతున్నారు. ఎటొచ్చీ.. కోమటిరెడ్డి సోదరులు కమలబాటలోనే ఆలోచనలు సాగిస్తున్నారు. ఇలా జిల్లాల వారీగా... బలమైన నాయకుల్ని పెంచుకునే ప్రయత్నంలో భాజపా ఉంది.

ఆ నాయకులకు కొంత బలం ఉంటుంది. అది ఎక్కువైతే వాళ్లే గెలిచి ఉండేవాళ్లు కదా..! తమ పార్టీకి ఉన్న బలానికి వారి బలం తోడవుతుందని భాజపా ఆశ. కానీ.. మరో బూర్జువా పార్టీలైతే పట్టించుకోనక్కర్లేదు. తమది సిద్ధాంతాల పార్టీ అని చెప్పుకునే భాజపా కూడా.. ఇలా ఫిరాయింపు బలాల మీదే బతికిపోవాలనుకోవడమే చిత్రంగా కనిపిస్తుంది.

ఏపీ రాజధానిని వైఎస్ జగన్ మారుస్తారా?