పవన్ పొత్తుకంటే తరలింపు ప్రకటనే ముందు!!

పవన్ కల్యాణ్ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. విలీనం అనే లాంఛనం జరగలేదు గానీ.. ఇక జనసేన భాజపా రెండు పార్టీలు కలసికట్టుగా మాత్రమే పనిచేస్తాయి. అన్ని ఎన్నికల్లోనూ కలసికట్టుగా పోటీ చేస్తాయి. ఆయన భాజపా పార్టీ రాష్ట్ర ఇన్చార్జి నడ్డాతో భేటీ అయి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారికంంగా ప్రకటించడానికి మాత్రం ఇంకా సంకోచిస్తున్నారు. చూడబోతే ఇంకా అధికారిక ప్రకటన చేయకపోవడం అనేది భాజపా వ్యూహంగా కనిపిస్తోంది.

మరో కోణంలోంచి చూసినప్పుడు.. అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించే క్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి సహకరించడానికే భాజపా కేంద్ర నాయకత్వం అధికారికంగా పొత్తు ప్రకటన చేయలేదా? అనే అనుమానం కూడా కలుగుతోంది. ముఖ్యమంత్రి రాజధాని తరలింపు గురించి అధికారిక ప్రకటన చేసిన తర్వాతనే… భాజపా-జనసేన పొత్తుకు సంబంధించి అధికారిక ప్రకటన రావొచ్చు.

పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజధాని తరలింపును తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. అదే మాదిరిగా భాజపాలోని ఒక వర్గం నాయకులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భాజపా కేంద్ర నాయకత్వం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు పవన్ తో పొత్తును అధికారికంగా ప్రకటిస్తే గనుక… ఆ వెంటనే జనసేన-భాజపాలు రాజధాని తరలింపు వ్యతిరేక పోరాటాల్లో పాల్గొనాల్సి వస్తుంది. కేంద్రంలోని భాజపాకు బహుశా ఆ విషయంలో పెద్ద శ్రద్ధ లేకపోవచ్చు. పైగా జగన్మోహన రెడ్డి మరో వారం రోజుల్లోగా రాజధాని తరలింపు విషయాన్ని తేల్చేస్తారనే పుకార్లు కూడా వినవస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో పండగ తర్వాత పొత్తు అధికారిక ప్రకటన అంటూ కాలయాపన చేస్తే.. జగన్ రాజధాని తరలింపు గురించి అధికారిక ప్రకటన చేసిన తర్వాతే.. కమలదళంతో పవన్ పొత్తు ప్రకటన ఉంటుందనే విశ్లేషణలు ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఈలోగా.. భాజపా వర్గాలు.. తమ పార్టీ స్థానిక నాయకులతో మంతనాలు కూడా పూర్తిచేసి, పవన్ కు, ఆయన పార్టీకి  ఇవ్వగలిగే ప్రాధాన్యం ఏమిటనే విషయంలోనూ ఓ నిర్ణయానికి వస్తారని వినిపిస్తోంది.

Show comments