ఎన్నికలకు ముందు ఇది సమ్మోహక అస్త్రం!

ఎన్నికలకు ముందు ప్రజలను ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు రకరకాల గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలను ప్రదర్శిస్తూ ఉంటాయి. మాయలు చేస్తుంటాయి. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో ఉంటాయి. మెజారిటీ వర్గాల ఆదరణ చూరగొనడానికి చేసే ప్రయత్నాలు, ప్రకటనలు, నిర్ణయాలు కొన్నయితే.. సమూలంగా మొత్తం ప్రజలందరినీ కూడా ప్రభావితం చేసే, వారిని ఆకట్టుకోవడానికి యత్నించే నిర్ణయాలు కొన్ని చేస్తుంటారు.

ఇప్పుడు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కూడా ఇంచుమించుగా మొత్తం దేశ ప్రజలందరినీ బుట్టలో పడేయడానికి సమ్మోహకాస్త్రం వంటి ఒక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోలు డీజిలు ధరలు రూ.2 వంతున తగ్గిస్తున్నట్టు చమురు కంపెనీలు ప్రకటించాయి. సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనుకుంటున్న రెండు మూడు రోజుల ముందు ఈ నిర్ణయం వచ్చింది.

మోడీ సర్కారు పగ్గాలు చేపట్టిన తర్వాత.. పెట్రోలు డీజిలు ధరలు విపరీతంగా పెరిగిపోయాయనే విమర్శ ప్రబలంగా ఉంది. ఈ విషయంలో మోడీ సర్కారు తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంది. మధ్యలో రాష్ట్రప్రభుత్వాలు సెస్సులు తగ్గించుకోవాలంటూ కేంద్రం ఒక పిలుపు ఇచ్చింది. భాజపా పాలిత రాష్ట్రాలు మాత్రం తగ్గించాయి. మిగిలిన వారు పట్టించుకోలేదు. ఆ విషయాన్ని కూడా బిజెపి తమ ప్రచారానికి వాడుకుంది. తీరా ఇప్పుడు లీటరుపై రెండు రూపాయలు తగ్గిస్తూ ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది.

భారతీయ జనతా పార్టీ వరుసగా జనాకర్షక వ్యూహాలతోనే ఎన్నికలకు సిద్ధం అవుతున్నదనే సంగతి ఇక్కడ గమనించాల్సి ఉంది. దేశవ్యాప్తంగా హిందూ ఓటు బ్యాంకును గంపగుత్తగా తమ ఖాతాలోకి వేసుకోవడమే లక్ష్యం అన్నట్టుగా.. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవాన్ని నరేంద్రమోడీ వన్ మేన్ షోలాగా నడిపించారు. ఆలయ నిర్మాణం ఇంకా సగం కూడా పూర్తికాకుండానే ఎన్నికల కోసం ప్రారంభించేశారంటూ విమర్శలను ఎదుర్కొన్నారు. అది హిందూ ఓటర్ల మీద పాశుపతాస్త్రం అనుకోవచ్చు.

నాలుగేళ్ల కిందటే ఉభయ సభల్లో ఆమోదం పొందిన సీఏఏ చట్టాన్ని తాజాగా అమల్లోకి తెచ్చారు. ముస్లిం విద్వేషంతో రగిలిపోతూ ఉండే హిందువుల్లోని ఒక వర్గం ఓటర్ల మీద ఆ నిర్ణయాన్ని బ్రహ్మాస్త్రంగానే అభివర్ణించాలి. ఈ రెండు అస్త్రాలు కూడా కేవలం హిందూ ఓటు బ్యాంకు మీద పనిచేసేవి.

అదే క్రమంలో ఇప్పుడు పెట్రోలియం ధరలు తగ్గించారు. ఇది యావత్ దేశం మీద పనిచేస్తుందని బిజెపి ఆశపడుతుండవచ్చు. అయితే.. కేవలం పెట్రోలు డీజిలు ధరలు తగ్గితే సరిపోదు. తదనుగుణంగా పెరిగిన ప్రతిసారీ రవాణా చార్జీల భారం అంటూ పెరిగే నిత్యావసరాల ధరలు కూడా మార్కెట్లో తగ్గితేనే ఆ ఘనత ప్రభుత్వానికి దక్కుతుంది.

Show comments