బీజేపీ దర్శకత్వంలో పవన్ పొలిటికల్ సినిమా

2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన పాపం ఏపీలో కాంగ్రెస్ ను ఎలా మట్టి కరిపించిందో, 2019లో ప్రత్యేకహోదా శాపం బీజేపీని అలాగే పుట్టిముంచబోతోంది. ఇది ఫిక్స్. ఈ విషయం తెలిసి కూడా కొంతమంది ఆశావహులు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. జనసేనపై ఇష్టంలేక, టీడీపీ, వైసీపీలో టికెట్ రాక కొంతమంది బడా పారిశ్రామికవేత్తలు ఇటీవల బీజేపీ అధినాయకత్వాన్ని సంప్రదించారు.

జాతీయ పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచామన్న సంతృప్తి ప్రస్తుతానికి వీరికి చాలు, ఆ తర్వాత నామినేటెడ్ పోస్టుల్ని డబ్బులిచ్చి కొనుగోలు చేసే సత్తా వీరికి ఎటూ ఉంది. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. వీరికి బీజేపీ అధినాయకత్వం నుంచి ఓ షాకింగ్ మెసేజ్ వచ్చింది. ప్రస్తుతానికి జనసేనలో చేరిపోండి, మిగతా విషయాలు తర్వాత చూసుకుందాం అని స్వయంగా అమిత్ షానే ఈ బిజినెస్ టైకూన్స్ కి సెలవిచ్చాడట.

ఆ భరోసాతోనే ఇటీవల కోస్తా జిల్లాల్లో కొంతమంది ప్రముఖులు జనసేనలో చేరారు. గత కొంతకాలంగా అన్ని పార్టీల్లోకి నేతలు వలస వెళ్తున్నారు కానీ, బీజేపీలో మాత్రం ప్రముఖులెవరూ చేరకపోవడానికి అసలు కారణం ఇదే. కాషాయ దళంలో చేరాలనుకున్న ఆశక్తి ఉన్నవారందర్నీ తెలివిగా జనసేన వైపు మళ్లిస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియాలంటే ఎన్నికలు ముగిసేవరకు ఆగాల్సిందే.

ప్రస్తుతానికైతే జనసేనకు, తెరవెనక నుంచి బీజేపీ నేతలు, మద్దతుదారులు ఫండింగ్ అందిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పుడు అందుతున్న ఈ ఆర్థిక భరోసా కార్యక్రమం, భవిష్యత్తులో ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి. ప్రస్తుతానికైతే మోడీపై ఓ మోస్తరుగా, చంద్రబాబు-జగన్ పై తీవ్రస్థాయిలో పవన్ విమర్శల వాన కురుస్తోంది.

నిజం చెప్పాలంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకి కూడా ఈ దఫా తమ పార్టీ టికెట్ పై పోటీచేసే ధైర్యంలేదు. మిగతా నేతలు కూడా పార్టీలో ఉన్నారంటే ఉన్నారు కానీ, రాష్ట్ర ప్రజల్లో బీజేపీపై ఉన్న వ్యతిరేకత చూస్తుంటే వీరికి భయమేస్తోంది.

ఎన్నికల సమయంలో వీరిలో సగానికి పైగా జనసేనలోకి జంప్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు, అది కూడా కమలాభీష్టం మేరకే. 

కమ్మ, రెడ్డి కలుస్తారా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments