కాంగ్రెస్ దారిలోకి వెళ్తున్న బీజేపీ..?

వరసగా రెండోసారి భారీ మెజారిటీతో అధికారాన్ని దక్కించుకున్న భారతీయ జనతా పార్టీ క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీ తీరున తయారవుతోందనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. అధికారం చేతిలో ఉండటంతో భారతీయజనతా పార్టీ అధిష్టానం గతంలో కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిన తీరున వ్యవహరిస్తోందని అంటున్నారు పరిశీలకులు. తమకు తిరుగులేదనుకున్న సమయాల్లో కాంగ్రెస్ అధినేతలు వ్యవహరించిన తీరున బీజేపీ కూడా ఇప్పుడు వ్యవహరిస్తోందని అంటున్నారు.

ఇప్పటికే ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారాల్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ను మించిపోయింది. కాంగ్రెస్ వాళ్లు అధికారంలో ఉన్న వేళ కూడా వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కోల్పోయారు. అయితే బీజేపీవాళ్లు మాత్రం ఏ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేను అయినా తమ వాడిని చేసుకుంటూ ఉన్నారు. ఫిరాయింపు రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ తీరుపై విమర్శలు వస్తున్నా బీజేపీవాళ్లు ఏమాత్రం లెక్కచేయడం లేదు.

ఆఖరికి భారత ప్రజాస్వామ్యంలో పెద్దల సభగా పేరున్న రాజ్యసభలోనే బీజేపీ అలాంటి పనిచేస్తూ ఉంది. అయితే లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ వచ్చేసరికి తామేం చేసినా నడిచిపోతుందనే తీరున తయారయ్యారు కమలనాథులు. ఆ సంగతలా ఉంటే.. ఇక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మంత్రివర్గం విషయంలో కూడా సీల్డ్ కవర్ నిర్ణయాలు మొదలైనట్టుగా ఉన్నాయి.

ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించడం లేదు. మోడీనే సీఎం క్యాండిడేట్ అన్నట్టుగా ప్రచారాన్ని సాగిస్తూ ఉన్నారు. ఇక ఎన్నికలే లేకుండా కొన్నిచోట్ల అధికారాన్ని సొంతం చేసుకుంటున్నారు. అది కర్ణాటకలో ఇటీవలే జరిగింది.

అక్కడ యడియూరప్పను అయితే సీఎం సీట్లో కూర్చోబెట్టారు కానీ, ఇప్పటి వరకూ కేబినెట్ ఏర్పాటులేదు. దీనిపైనా విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామాల్లో ఎవరెవరు యడియూరప్ప కేబినెట్లో ఉండాలనే అంశం గురించి ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ వస్తోందట.

కేబినెట్ ఏర్పాటు గురించి సీఎం ఏదో లిస్టు ఇవ్వగా, దాన్ని పక్కనపెట్టి తను ఒక లిస్టు పంపబోతున్నట్టుగా చెప్పారట అమిత్ షా. వారిచేత ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పారట. ఈ పరిణామాలు గతంలో కాంగ్రెస్ అధిష్టానం సాగించిన వ్యవహారాలను గుర్తు చేస్తున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

సాహోపై అంచనాలు ఏ స్థాయిలో వున్నాయంటే..

Show comments