బిగ్ బాస్.. నాగార్జున.. ఓ వివాదం

షో కాన్సెప్ట్ వేరు. షో హోస్ట్ చేయడం వేరు. బిగ్ బాస్ షోకు వ్యతిరేకంగా ఉద్యమించడం వరకు ఓకె. కొంతమంది తమకు నచ్చని దానిని వ్యతిరేకించడం తప్పుకాదు. ఆ హక్కు ఎప్పుడూ వుంటుంది. అయితే ఆ ఉద్యమం బిగ్ బాస్ ను తయారుచేసి, ప్రసారం చేసే స్టార్ మాకు వ్యతిరేకంగా కావాలి కానీ, దాన్నిహోస్ట్ చేసే నాగ్ కు వ్యతిరేకంగా ఎందుకు?

అసలు నాగ్ ఆ షో నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఏముంది? డబుల్ మీనింగ్ సినిమాల్లో నటిస్తున్నారు, అందువల్ల ఆ లెక్కన రేపు సినిమాల నుంచే తప్పుకోమంటారు. అన్నపూర్ణ స్టూడియోలో తీసే సినిమాల వల్ల నష్టం జరుగుతోంది కనుక అన్నపూర్ణ స్టూడియోను మూసేయమనే నినాదం మరొకళ్లు అందుకోవచ్చు.

బిగ్ బాస్ అనేది ఓ గేమ్ షో. ఆ గేమ్ షో సరిగ్గా లేకపోతే, దానిపై నిరసన వ్యక్తం చేయవచ్చు. ఆపమని డిమాండ్ చేయవచ్చు. అంతవరకు ఓకె. కానీ ఉరిమి ఉరిమి ఎవరిమీదో పడినట్లు, నాగ్ మీద పడడం ఏమిటి? మీలో ఎవరు కోటీశ్వరుడు లాంటి క్విజ్ కార్యక్రమం చేసినపుడు నాగ్ మంచివాడు, బిగ్ బాస్ షో వరకు వచ్చేసరికి చెడ్డవాడు ఎలా అయిపోతాడు?

మొదటి రెండు బిగ్ బాస్ సెషన్ల మీద ఎటువంటి ఆరోపణలు రాలేదు. కంటెస్టెంట్ ల మధ్య వ్యవహారాలు తప్పించి మచ్చ పడలేదు. ఈసారి కూడా బిగ్ బాస్ షోలో అక్రమాలు జరుగుతున్నాయని ఎవరూ అనడం లేదు. ఆ షో ఎంపికను ఆశపెట్టి, అమ్మాయిలను వాడుకునే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. అది కూడా ఇద్దరు కిందిస్థాయి ఉద్యోగుల మీద, ఎంపిక జాబితాలో వున్న ఇద్దరు ప్రాపబుల్స్ ఆరోపించారు.

అసలు ఈ ఆరోపణలు నిజమో? కాదో? తేలకుండా? మొత్తం షోను, హోస్ట్ ను ఎలా ముద్దాయిలను చేసేస్తారు? ఆరోపణలు నిజం అని తేలితే అప్పుడు ఆ ఇద్దరు ఉద్యోగులది తప్పు అవుతుంది. ఆ తరువాత ఆ ఉద్యోగుల వెనుక ఎవరు వున్నారు? అన్నది చర్చకు వస్తుంది. అప్పుడు కూడా షోది తప్పుకాదు. హోస్ట్ ది తప్పుకాదు.

ఒక పెద్ద సంస్థ వుంటుంది. అందులో హెచ్ ఆర్ వుంటారు. ఉద్యోగం ఇస్తానని ఆ హెచ్ ఆర్ ఎవరినో ప్రలోభ పెడితే సంస్థను మూసేయాలని అనడం ఎంతవరకు సబబు అనిపించుకుంటుంది. ఈ సంగతి అలా వుంచితే బిగ్ బాస్ షోల మీద వివాదం కొత్త కాదు, అన్ని భాషల్లో ఏదో ఒక వివాదం వస్తూనే వుంటుంది. కోర్టు మెట్లు ఎక్కుతూనే వుంది. కానీ షో కొనసాగుతూనే వుంది.

తెలుగులో ఇప్పటికి పాతికమంది వరకు షోలో పాల్గోని వచ్చారు. ఎవ్వరు కూడా షోలో ఇలా జరుగుతోందని ఆరోపించిన, లేదా విమర్శించిన వైనం లేదు. అందువల్ల షోను తప్పు పట్టడానికి అవకాశం తక్కువ. దాని పేరు చెప్పుకుని ఎవరైనా తప్పుడు పనులు చేస్తే వారిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టడం తప్పుకాదు.

అంతే తప్ప, షోను, హోస్ట్ ను తప్పుపట్టడం అంత సరికాదేమో? ఇప్పటికైనా ముందుగా చేయాల్సింది, డిమాండ్ చేయాల్సింది, ఇద్దరు ప్రాపబుల్స్ చేసిన ఆరోపణల నిజాల నిగ్గుతేల్చాలి అని. పోలీసులు చురుగ్గా వ్యవహరించి, సాక్ష్యాధారాలు తీసుకుని, ప్రైమాపసీ లేదా కనీస సాక్ష్యాలు వుంటే ఆ విధంగా ముందుకు వెళ్లాలి. అప్పుడు మరోసారి ఇలాంటివి జరగకుండా వుంటాయి. అంతే తప్ప, ఎవరో అసిస్టెంట్ నో, అసోసియేట్ నో తప్పు చేసాడని, సీరియళ్లను, ఇంకెవరో తప్పు చేసారని మరో దానినో ఏకంగా బ్యాన్ చేయమని కోరడం అంత కరెక్ట్ కాదేమో?

బిస్ బాస్ షోలో బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కొన్నివారాల పాటు కొంతమందిని ఓ ఇంట్లో వుంచుతున్నారు. వాళ్లలో వాళ్లే మాట్లాడుకుంటూ బతకాలి. తిండి తిప్పలకు లోటు వుండదు. సదుపాయాలకు లోటు వుండదు. లేనిదల్లా ఒక్కటే బయట ప్రపంచంతో సంబంధం. పోనీ లోపల ఏమైనా దారుణాలు జరిగిపోతున్నాయి అని అనాలంటే కూడా వీలులేకుండా ఎక్కడిక్కడ కెమేరాలు పెట్టి రికార్డ్ చేస్తారు. అదే ఎడిట్ చేసి ప్రసారం చేస్తారు. ఇష్టంలేని వాళ్లు అగ్రిమెంట్ రూల్స్ పాటించి బయటకు వెళ్లిపోవచ్చు.

మరి ఇందులో మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ వున్నట్లు? వుందీ అనుకుంటే హక్కుల కమిషన్ ద్వారా విషయం తేల్చేపని చేయవచ్చు. ఇటు పోలీసుల ద్వారా అయినా. కోర్టుల ద్వారా అయినా, లేదా హక్కుల కమిషన్ ద్వారా అయినా వ్యవహారం తేల్చుకునే అవకాశం వున్నపుడు, నాగ్ మీద వత్తిడి ఎందుకు అన్నదే అనుమానం.

అయితే ఇంతవరకు వచ్చింది కనుక, ఇక నాగ్ కూడా పెదవి విప్పాల్సిన అవసరం వుంది. ఇద్దరు మహిళలు చేసిన ఆరోపణలపై నాగ్ తన స్పందన తెలియచేయాల్సి వుంది. మామూలుగా అయితే అక్కరలేదు. కానీ ఆ షోని హోస్ట్ చేస్తున్నారు కాబట్టి తన అభిప్రాయం చెప్పాలి. అలాగే తను తప్పుకోవాలంటూ వస్తున్న డిమాండ్ ల మీద కూడా స్పందించి సరైన సమాధానం ఇవ్వాల్సి వుంది.

మౌనం ప్రతిసారీ అంగీకారం అనిపించుకోదు. 

ఆమెను ఆమెగా ప్రేమించేవాడే కావాలట..!

ఎన్ని సినిమాలు పోయినా తీస్తూనే ఉంటా..