ఎన్టీఆర్ 'అరవింద' ఫైట్ సీన్ లీక్

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న అరవింద సమేత సినిమాకు లీకులు కొత్తకాదు. ఇప్పటికే ఇది పైరసీ బారిన పడింది. ఎన్టీఆర్, నాగబాబు కలిసి నటించిన కొన్ని స్టిల్స్ లీక్ అయ్యాయి. ఎన్టీఆర్-పూజా హెగ్డే కాంబోలో కూడా కొన్ని స్టిల్స్ లీక్ అయ్యాయి. అయితే ఈసారి అంతకు మించి. 

అరవింద సమేత చిత్రానికి సంబంధించి ఏకంగా రెండున్నర నిమిషాల ఫైట్ సీన్ లీక్ అయింది. అది కూడా సినిమాలో అత్యంత కీలకమైన ఫైట్. గ్రాఫిక్స్ కోసం ఇచ్చిన రిఫరెన్స్ ఫైల్ అది. మొత్తం 20 నిమిషాల ఫుటేజ్ ను పంపిస్తే, అందులోంచి కీలకమైన 2.30 నిమిషాల ఫైట్ సీన్ లీక్ అయింది. 

ఎన్టీఆర్, నాగబాబు కలిసి తమ అనుచరులతో కారులో వస్తుంటే.. ఓ కల్వర్టు వద్ద బాంబ్ పేల్చి వాళ్లను చంపాలని చూస్తారు. ఆ క్రమంలో నాగబాబు చనిపోతాడు. చాలా ఎమోషనల్ గా, అత్యంత భయానకంగా ఉంది ఈ ఫైట్ సీక్వెన్స్. కాకపోతే సీజీ వర్క్ పూర్తికాకుండానే లీక్ అయింది. 

తాజా లీకులతో అరవింద సమేత యూనిట్ కు మరిన్ని తలనొప్పులు పెరిగాయి. ఇప్పటికే సకాలంలో షూటింగ్ పూర్తికాక, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో పడి యూనిట్ చాలా ఇబ్బంది పడుతోంది. ఇలాంటి టైమ్ లో ఈ లీకులు యూనిట్ ను మరింత టెన్షన్ కు గురిచేస్తున్నాయి. 

గీతగోవిందం సినిమా విడుదలకు ముందు లీకుల గురించి అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించి ఎలాగైతే కీలక సన్నివేశాలైన లిప్ కిస్ సీన్లు లీక్ అయ్యాయో, అరవింద సమేత చిత్రానికి సంబంధించి కూడా అలాంటి కీలకమైన సీన్లే లీక్ అవ్వడం విచిత్రం.

Show comments