భీమవరంలో గ్లాసు ఎందుకు పగిలింది?

అన్నయ్యను ఓడించిన జిల్లాలో విజయం సాధించి కొణిదెల కుటుంబ పరువు నిలబెట్టాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన ప్రయత్నం ఘోరంగా దెబ్బతిన్నది. భవిష్యత్ లో – అనగా 2024లో కొణిదెల కుటుంబ పరువు కోసం జబర్దస్త్ నాగబాబును తీసుకొచ్చి పోటీచేయించే శ్రమ తీసుకోకుండా ఈ దఫాయే నరసాపురం ఎంపీ అభ్యర్థి రూపంలో పరాజయ పర్వాన్ని పూర్తిచేశారు. కాపులు ఎక్కువగా ఉంటారు... తన సన్నిహితులున్న ప్రాంతం అని ఎంచుకున్న భీమవరంలో పవన్ కల్యాణ్ పరాజయం స్వయంకృతాపరాధమే.

ఈ జిల్లాలోనే పనిచేసిన పోస్ట్ మేన్ మనవడిని, కానిస్టేబుల్ కొడుకుని, భీమవరంలో పరీక్షలు రాశాను అంటూ ప్రజలకు తన ప్రవర వినిపించిన పవనుడుని ఈ జిల్లావాళ్లు ఇసుమంతైనా నమ్మలేదు. అసలు ఈ జిల్లాతో, భీమవరంతో తనకున్న బంధాన్ని తవ్విపోసుకొంటే జనం నవ్వుకున్నారు. చిరంజీవినే తిరస్కరించిన పశ్చిమ గోదావరి ఓటరు ఇక అతని తమ్ముళ్ళని ఎందుకు ఆదరిస్తారు. ‘కాలి గోళ్ళ నాడే తెలిసింది కాపురం చేసే కళ’ అన్నట్లు భీమవరంలో పవన్ గెలవడు అని నామినేషన్ వేసిన ముహూర్తంలోనే అక్కడి ఓటర్లు చెప్పారు.

భీమవరం, నరసాపురం, పాలకొల్లు ప్రాంతాల్లో మెగా, అల్లు కుటుంబాలపై ఎవరికీ సానుకూలత లేదు. ఆ కుటుంబాలు ఎన్నడూ ఈ ప్రాంత అభివృద్ధికి స్వచ్ఛందంగా ముందుకురాలేదు అనే భావనే ఉంది. చిరంజీవి, అల్లు అరవింద్ నీడ లేకుండా, ఆ కుటుంబాల ప్రమేయం లేకుండా రాజకీయం చేస్తాడు అనే ఫీలింగ్‌ని పవన్ పార్టీ పెట్టిన మొదట్లో కల్పించారు. అయితే ఎన్నికల సమయంలో జనసేనను డ్రైవ్ చేసేది చిరు, అరవింద్ లే అని పసిగట్టరు. అరవింద్ అనుచరుడు బన్నీ వాసు ఎన్నికలకు ముందు నుంచి జనసేనలో యాక్టివ్ గా తిరగడం మొదలుపెట్టాడు. అతనే భీమవరం ఎన్నికల బాధ్యతలు తీసుకోవడం, నాగబాబుని పోటీకి తేవడం, చివరిరోజు అల్లు అర్జున్ ప్రచారం చేయడం చూసి- అసలు సినిమా ఏమిటో జనానికి అర్థమైంది.

ఎన్నికలకు సిద్ధమయ్యే క్రమంలో పవన్ జిల్లాలో చేసిన యాత్రల్లో ఆయన చాలారోజులు భీమవరంలో క్యాంపు వేశారు. ఆ సమయంలో రోజూ తాను బస చేసిన దగ్గర జనం పోగుపడటం, వివిధ సంఘాలవాళ్లు తమ సమస్యలు చెప్పుకోవడం చూసి ఈ ప్రాంత ఉద్ధారకుడిని అని భ్రమించారు. సినిమా షూటింగ్ కి ఔట్ డోర్ కి వెళ్లినప్పుడు హీరో హీరోయిన్ లను చూసేందుకు ఆ తారలున్న హోటల్స్ ముందు, గెస్ట్ హౌస్ ల ముందు జనం నిలబడతారు... ఆ గోల చూసి అబ్బో మనకు ఇక్కడ చాలా బలం ఉంది అనుకొంటే ఎలా? ఇక ఏ నాయకుడు వెళ్ళినా సంఘాలతో విజ్ఞాపనలు ఇప్పించే షో ఒకటి స్థానిక నాయకులు చేస్తుంటారు. దీన్ని కూడా సేనాని పసిగట్టలేదు.

నిజంగా భీమవరం ప్రాంతంలో ఉన్న ఎన్నో సమస్యలపై ఆ నాయకుడు నిజాయతీగా స్పందించలేదు. ఇందులో ప్రధానమైనది ఆక్వా ఫుడ్ పార్క్. ఆనంద గ్రూప్ వాళ్ళు పెడుతున్న ఈ ఫుడ్ పార్క్ మూలంగా తీవ్ర కాలుష్యంతోపాటు భూములు దెబ్బతినడం, ప్రజలు రోగాల పాలవడం, ఊళ్ళకు ఊళ్లే ఖాళీ అయ్యే ప్రమాదం వచ్చింది. దీన్ని వ్యతిరేకించిన వాళ్ళని భీమవరం, పాలకొల్లు ఎమ్మెల్యేలు కలిసి బెదిరించి కేసులు పెట్టించారు. ఆడామగా తేడా లేకుండా జైళ్ళలో పడ్డారు... కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సమస్యపై పవన్ దగ్గరకు ఓ బృందం వెళ్తే సముదాయించి.. నేనొచ్చి పోరాటం చేస్తాను అని హామీ ఇచ్చి పంపారు. ఆయన వస్తారు అనుకొంటే ఓ టీంను పంపి ఊరుకొన్నారు.

భీమవరం వచ్చినప్పుడు ఆక్వా బాధితులు కలిసి బాధలు చెప్పుకొనే ప్రయత్నం చేస్తే – జనసేన నాయకులే పడనీయలేదు. పైగా మీటింగుల్లో – అభివృద్ది అవసరం, పర్యావరణాన్ని కాపాడేలా ఆక్వా రంగం ఎదగాలి, ఇప్పుడు ఫుడ్ పార్కుని ఆపేస్తే ఉద్యోగాలు రావు అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. అక్కడే సేనానిలోని నిబద్దత ఏమిటో జనానికి బోధపడింది. ఈ విధంగా రైతులకు, బాధిత వర్గాలకు దూరమయ్యారు. మ‌రోవైపు, ఫుడ్ పార్కునీ, ఆక్వానీ వ్యతిరేకిస్తాడు అనే ఉద్దేశంతో క్షత్రియ వర్గాలు పవన్ ను పట్టించుకోలేదు.

ఇక క్షత్రియుల విషయంలో పవన్ అనుసరించిన తీరు కూడా ఆ వర్గంలో అసంతృప్తి రేపింది. ఏ పార్టీ అయినా ఉభయ గోదావరి జిల్లాల నుంచి బలమైన క్షత్రియ నాయకుడిని తీర్చిదిద్దుకుంటాయి. 2014 నుంచి కూడా జనసేనలో అలాంటి ప్రయత్నం ఏదీ చేయలేదు. ఎన్నికల సమయంలో ఒక వ్యక్తిని తెచ్చుకున్నా – అతనికి భీమవరం, ఉండి ప్రాంతాల్లో ఏ మాత్రం పట్టులేదు. పైగా భీమవరం ఎన్నికల బాధ్యత తీసుకున్న బృందంలో అతనో కీలక నాయకుడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కచోట కూడా క్షత్రియులకు సీటు ఇవ్వలేదు. అలాగే నరసాపురం నుంచి విష్ణు కాలేజ్ అధినేతను పోటీ చేయిస్తామ‌ని జనసైనికుల ద్వారా ప్రచారం చేయించారు. చివరకు అన్నగారిని తీసుకొచ్చి నిలబెట్టారు.

భీమవరంలో రాజుల ఓట్లు సుమారు పాతికవేలు ఉన్నాయి. అలాగే వారు ప్రభావితం చేయదగ్గ ఓట్లు మరో పాతిక వేలు ఉంటాయి. ఇలా 50 వేల ఓట్లకు చేతులారా గండి కొట్టుకున్నారు. భీమవరంలో భారీగా అల్లూరి సీతారామరాజు విగ్రహం పెడతాను అనే మాటని కూడా నమ్మలేదు. కాపుల ఓట్ల సంగతి చూస్తే మూడు పార్టీల నుంచి నిలబడింది కాపులే. వైసీపీ అభ్యర్థికి స్థానికంగా ఆ వర్గంతోపాటు బీసీల్లో పట్టు ఉంది. అలాగే టిడిపి అభ్యర్థికి కూడా తన కులం నుంచి కొంత శాతం ఓట్లు వస్తాయి. పవన్ కు స్థానికంగా పట్టు లేదు... ఫాన్స్ తప్ప ఎవరూ లేరు. భీమవరంలో ఎలక్షనీరింగ్ కోసం పెట్టుకొన్న టీంలోని కాపు నాయకులకీ భీమవరం ఏరియా జనాల్లో పోజిటివ్ ఇమేజ్ లేకపోవడం పవన్ పాలిట శాపంగా మారింది. అక్కడి ఫ్యాన్స్ తీరు కూడా సామాన్య ఓటర్లలో పవన్ పై నెగెటివ్ ఇమేజ్ తెచ్చింది.

ఎస్సీ వర్గంలో జనసేనకు ఏ మాత్రం పట్టులేదు. కనీస ఓట్ కూడా ఎస్సీ వర్గం నుంచి రాలేదు. ఉండి నియోజకవర్గంలో దళితులపై అగ్రవర్ణాల వేధింపులు, సాంఘిక బహిష్కరణ చేస్తే పవన్ పెదవి విప్పలేదు. వేదికలెక్కితే అంబేడ్కర్, కాన్షీరామ్ అనడం, బిఎస్పీతో పొత్తు పెట్టుకొన్నాను అని అరిచి గీపెట్టినా ఎస్సీ ఓటర్ కరుణించలేదు. భీమవరం ఎస్సీ ఓటర్లు పవన్ ని ఓ అభ్యర్థిగానే పరిగణించలేదు. గాజువాకలో ఇల్లు తీసుకున్న వార్త ప్రచారంలోకి రావడంతో ఇక్కడ గెలిచినా గాజువాకే వెళ్ళిపోతాడు... భీమవరాన్ని వదిలేస్తాడు అనేమాట బలంగా వెళ్లిపోయింది.

ఇక్కడి నుంచి వెళ్లిపోయేవాడిని ఎందుకు గెలిపించాలి అని ఓడించి వదిలారు. ఎక్కడ పోటీచేసినా విశ్వసనీయత అనేది ముఖ్యం. మెగా కుటుంబానికి భీమవరం బెల్ట్ లో ఆ విశ్వసనీయత అనేదే లేదు. ఇక గెలుస్తాము అనుకోవడం కల్ల. అదే జరిగింది.
(నెక్స్ట్: ఆయుధం లేకుండా పోరాడిన సేనాని)

పదేళ్ల రాజకీయ ప్రస్థానం అద్భుత మలుపు