కోలీవుడ్ ఎంట్రీపై వెనక్కి తగ్గాడు

రారండోయ్ వేడుక చూద్దాం మూవీతో కెరీర్ లోనే మంచి ఓపెనింగ్స్ సాధించాడు నాగచైతన్య. తెలుగులో ఇప్పుడిప్పుడే మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నాడు, కెరీర్ గ్రాఫ్ కూడా నిలకడగా సాగుతోంది. ఇలాంటి టైమ్ లో రెండు పడవల ప్రయాణం ఎందుకని భావిస్తున్నాడు చైతూ. అందుకే కోలీవుడ్ లో ఇప్పట్లో సినిమా చేయనని ప్రకటించాడు.

లెక్కప్రకారం ఈ ఏడాదిలోనే నాగచైతన్య కోలీవుడ్ ఎంట్రీ జరగాలి. కుదిరితే 2017లో ఓ తమిళ సినిమా చేస్తానని, ప్రేమమ్ సినిమా ప్రమోషన్ టైమ్ లోనే ప్రకటించాడు చైతూ. కానీ రారండోయ్ వేడుక చూద్దాం సినిమా విజయంతో తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. ఫస్ట్ టాలీవుడ్ లో బేస్ పెంచుకున్న తర్వాత, తమిళ సినిమాల గురించి ఆలోచించాలని ఫిక్స్ అయ్యాడు.

ప్రస్తుతం నాగచైతన్య చేతిలో 2 సినిమాలున్నాయి. కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో చేస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని 50 శాతానికి పైగా పూర్తిచేశాడు. త్వరలోనే చందు మొండేటి దర్శకత్వంలో మరో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాల్ని ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నాడు నాగచైతన్య.

Show comments