సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన బాలయ్య

ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంలో కొన్ని సరదా సంఘటనలు జరిగాయి. ఒకరి పేరు పిలిస్తే మరొకరు ముందుకొచ్చారు. ప్రమాణ స్వీకారంలో పదాలను పలకడంలో కొందరు తడబడ్డారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి.. ఆరాధ్య నాయకుడు జగన్ సాక్షిగా అంటూ ప్రమాణ స్వీకారం చేసి చివర్లో మరో దఫా ప్రమాణం చేశారు.

ఇన్ని జరిగినా.. చాలామంది దేనికోసమో ఎదురు చూశారు. అదే నందమూరి బాలకృష్ణ ప్రమాణ స్వీకారం. ఆయన ప్రమాణం విని సంభ్రమాశ్చర్యాలకు లోను కావాలని అనుకున్నారు. కానీ ఆ అవకాశం ఎవరికీ దక్కలేదు. పద్ధతిగా ఒక్కో పదాన్ని కూడబలుక్కుని, తప్పుల్లేకుండా ప్రమాణం చేసి అందరికీ షాకిచ్చారు బాలయ్య.

బాలయ్య మాట్లాడితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎక్కడో స్టార్ట్ చేసి, అప్పట్లో నాన్నగారు అంటూ ఏదేదో మాట్లాడి చివరికి ఎక్కడో ముగించడం బాలయ్య స్టయిల్. ఇలా బాలకృష్ణ మాట్లాడితే అంతా దబిడ దిబిడే. స్వాతంత్ర దినోత్సవాల్లో, సినిమా ఫంక్షన్లలో చాలాసార్లు తన భాషా ప్రావీణ్యం చూపించాలనుకుని నవ్వులపాలయ్యారు బాలయ్య. అంతెందుకు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో "హే బుల్ బుల్" పాట ఎంత వైరల్ అయిందో అంతా చూశాం.

ఈసారి కూడా బాలయ్య నోటి నుంచి అలాంటి ఆణిముత్యాలు దొర్లుతాయని అంతా ఎదురుచూశారు. కానీ బాలయ్య తన సొంత పాండిత్యం చూపించలేదు. కాగితంలో ఉన్నది ఉన్నట్టు చదివారు. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారంలో ఒత్తులు, పొల్లులు అన్నీ సరిగ్గా ఉచ్ఛరించి నిజంగానే అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. 

గాజువాకలో అయితే బొత్తిగా తృతీయస్థానం