ఇందుకే.. బాలయ్య ప్రచారం వద్దన్నది..!

ఇలా చేస్తాడు.. తడబడతాడు, తప్పు తప్పుగా మాట్లాడతాడు.. నోరు జారతాడు.. నవ్వుల పాలవుతాడు.. అనేది అందరికీ తెలిసిన సంగతే. నందమూరి నటసింహం తెలంగాణలో ప్రచారం చేస్తాడు అన్నప్పుడే చాలా మంది ఇవే అభిప్రాయాలను వ్యక్తంచేశారు. బాలయ్య ప్రచారానికా.. తెలుగుదేశం పార్టీకి కాస్తో కూస్తో ఉన్న అవకాశాలను కూడా బాలయ్య దెబ్బ తీస్తాడనే అభిప్రాయాలను వ్యక్తంచేశారు.

బాలయ్య ప్రచారం తెలుగుదేశం అభ్యర్థుల గెలుపుకు, మహాకూటమి విజయానికి ఉపయోగపడటం మాటేమిటో కానీ.. తెలంగాణ ఎన్నికల వేడిలో కాస్త వినోదానికి మాత్రం బాగానే ఉపయోగపడింది. ఎన్నికల ప్రచారం అంటే.. అంతా సీరియస్ గానే ఉండాలా, కామెడీ చేయకూడదా, ప్రసంగాలతో నవ్వించకూడదా.. అందుకే ఆ బాధ్యతనే బాలయ్య తీసుకున్నాడు.

అలా మాట్లాడగలగడం బాలయ్యకే సాధ్యం. చంద్రబాబు నచ్చలేదంటే.. శంషాబాద్ ఎయిర్ పోర్టును మూసేయాలని, ఫ్లై ఓవర్లను పడగొట్టాలని, ఔటర్ రింగ్ రోడ్డు మూసేయాలని.. అని ఎవరైనా అనగలరా బాలయ్య తప్ప! అవి చంద్రబాబు నాయుడే దగ్గరుండి కట్టించినట్టుగా, హెరిటేజ్ లాభాలతో కట్టినట్టుగా మాట్లాడాడు బాలయ్య. అలా మాట్లాడి వీలైనంతగా నవ్వించాడు.

ఇక సారేజహాసే అచ్చ.. అంటూ పాడబోయి.. బుల్ బుల్ దగ్గర ఆగిపోవడం మాస్టర్ పీస్. మరో ఐదారేళ్లు సోషల్ మీడియాలో బాలయ్య పాడిన సారేజహాసే అచ్చ.. వైరల్ కావడం గ్యారెంటీ. ఇప్పటి వరకూ ఇలాంటి వైరల్ వీడియోస్ లో లోకేష్ ప్రసంగాలే ముందుండేవి. బాలయ్య వీడియోలు కూడా వైరల్లో ఉంటాయి కానీ, ఈసారి మరింత గట్టిపోటీకి వచ్చాడు నటసింహం.

ఇక బాలయ్య ఐటీ ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలు.. తెలంగాణ వారికి చంద్రబాబు నాయుడే ఐటీకి స్పెల్లింగ్ నేర్పించడాని అనడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా వెళ్లింది. ప్రచారం చేసుకో కానీ.. ఇలాంటి పనికిమాలిన మాటలేంటి అని ఐటీ ఉద్యోగుల సంఘం ఒకటి ఈసీ వద్దకు వెళ్లింది.

దీనిపై బాలయ్య వివరణ ఇస్తాడేమో చూడాలి. తెలంగాణ ఎన్నికల ప్రచారానికి నేడే ఆఖరు. ఈరోజు బాలయ్య ఎలా నవ్వులు పండిస్తాడో చూడాలి. బాలయ్య ప్రచారం పట్ల ఇప్పటికే తెలుగుదేశం వాళ్లు తలపట్టుకున్నారు.

ఇందుకే బాలయ్య ప్రచారం వద్దన్నది అని వారు వాపోతున్నారు. వారు బాధపడినా.. బాలయ్య ప్రచారం కడుపుబ్బా నవ్వించడంతో సామాన్యులు మాత్రం హ్యాపీ! 

అది లోకేష్ కెరీర్ కు మరింత మైనస్ కాదా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments