నిజం చెప్పినందుకు శిక్ష పడాలా?

మీడియా ఎప్పుడూ ప్రభుత్వాన్నే టార్గెట్‌ చేయాలి. అది దాని ధర్మం. ప్రభుత్వ విధానాల్లోని లొసుగులను, లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపాలి. పాలకులు ప్రజా వ్యతిరేక చర్యలను చీల్చి చెండాడాలి. ఎవ్వరూ కాదనరు. తాను ఈ పనులన్నీ చేస్తున్నందుకే తన మీద పాలకులు కక్ష సాధిస్తున్నారని చెప్పుకుంటున్న 'సాక్షి' పత్రిక మరో సంచలనానికి తెర తీసింది. నిజానికి ఇది ఆ పత్రిక సృష్టించిన సంచలనం కాదు. సంచలనం అవునో కాదో కూడా తెలియదు. కాని వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా గమ్మున కూర్చున్న స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌పై రాయి విసిరేందుకు అవకాశం దొరికింది. 

ఆయన చెప్పిన మాటలనే ఆసరాగా చేసకొని 'పాపం చేశాడు' అని తీర్మానించింది. ప్రస్తుతం వైసీపీ నాయకులు కోడెల మీద విరుచుకుపడుతున్నారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. న్యాయవాదులు కూడా కోడెల శిక్షార్హుడే అని చెబుతున్నారట.  కోడెల కావాలని చెప్పారో, అనుకోకుండా చెప్పారో తెలియదుగాని ఒక నిజం చెప్పారు. అది కూడా ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో. ఏమని? గత ఎన్నికల్లో తాను 11.50 కోట్లు ఖర్చు చేశానని. దీన్ని సాక్షి దొరకపుచ్చుకుంది. 'దొరికావు బిడ్డా' అనుకుంది. వెంటనే బ్యానర్‌ వార్త ప్రచురించింది. 

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల్లో అభ్యర్థి 28 లక్షలకు మించి ఖర్చు చేయకూడదట. కాని కోడెల తాను పదకొండున్నర కోట్లు ఖర్చు చేశానని చెప్పారు. తాను నేరం చేసినట్లు ఆయనే అంగీకరించారు కాబట్టి ఆయనకు శిక్ష పడుతుందని సాక్షి చెబుతోంది. వైసీసీ నాయకులు కోడెల ఇంటర్వ్యూ క్లిప్పింగులను ఎన్నికల సంఘానికి పంపుతారా? ఎన్నికల ధన ప్రవాహం, ప్రభావం గురించి చెబుతూ 1983 ఎన్నికల్లో తనకు 30 వేలు ఖర్చుయితే, మొన్నటి ఎన్నికల్లో పదకొండున్నర కోట్లు ఖర్చు చేశానన్నారు. ఇదొక ఉదాహరణగా చెప్పారు. కాని సాక్షి దాన్ని తన మెడకు చుడుతుందని అనుకోలేదు. 

మరి ఎన్నికల సంఘం దీన్ని సీరియస్‌గా తీసుకొని విచారణ జరుపుతుందా? చెప్పలేం. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయని కోడెలపై ఉద్యమించడానికి వైసీపీకి ఒక అవకాశం దొరికిందని చెప్పుకోవచ్చు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు తమ ఖర్చును ఎన్నికల సంఘం అధికారులకు సమర్పించాల్సివుంటుంది. అప్పుడు అందరూ చేసే పని దొంగ లెక్కలు చూపించడమే. వాస్తవ ఖర్చు ఎవ్వరూ చెప్పరు కదా. కోడెలైనా, చంద్రబాబైనా, జగనైనా ఈ విషయంలో అందరూ ఒకటే. అభ్యర్థులు ఇచ్చే అఫిడవిట్లన్నీ అవాస్తవాలే. దాంట్లో పేర్కొన్న ఆస్తులకు, వాస్తవ ఆస్తులకు పొంతన ఉండదు. ఈ విషయం ఎన్నికల సంఘానికీ తెలుసు. అయినా అంతా పకడ్బందీగా ఉంటుంది కాబట్టి ఏం చేయలేరు.

రాజ్యాంగాన్నే తుంగలో తొక్కుతుంటే ఎన్నికల నిబంధనలను అతిక్రమించడం పెద్ద కష్టం కాదు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు పెళ్లయిన విషయాన్ని దశాబ్దాలుగా దాచిపెట్టారు. ఏ ఎన్నికల అఫిడవిట్లోనూ ఆ విషయం చెప్పలేదు. దీంతో అంతా ఆయన్ని బ్రహ్మచారి అనుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన వివాహితుడు అనే విషయం బయటపడేవరకూ ఆయన్ని బ్రహ్మచారిగానే ట్రీట్‌ చేశారు. అఫిడవిట్‌ అంటే ప్రమాణపత్రం. మామూలు భాషలో చెప్పాలంటే ఒట్టేసి చెప్పడమన్నమాట. అంత ఒట్టేసి తనకు పెళ్లి కాలేదని చెప్పిన మోదీని ఎవ్వరేం చేశారు? 

కారు లేని నాయకుడు ఎవరైనా ఉంటాడా? ఒక్కో నాయకుడికి లేదా నాయకురాలికి ఐదారు కార్లయినా ఉంటాయి. కాని అఫిడవిట్‌లో 'సొంత కారు లేదు' అని రాస్తారు. అది అబద్ధమే అయినా చర్యలు తీసుకుంటారా? కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతల విషయం రచ్చ రచ్చ అయింది. కాని మంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు కదా. ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘన జరుగుతూనే ఉంటుంది. ఇలా ఎంతైనా చెప్పుకోవచ్చు. కోడెలను రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నవారు సరిగ్గా ఎన్నికల నిబంధనల ప్రకారమే నడుచుకున్నారా? అది జరగే పని కాదు. ఒక అభ్యర్థికి 28 లక్షలు ఏ మూలకూ రావు. సరిగ్గా అంత మొత్తమే ఖర్చు చేస్తే గెలిచే అవకాశమే లేదు. కాబట్టి కోడెల నిజాయితీగా నిజం చెప్పారు. అందుకు మెచ్చుకోవాలి. నిజం చెప్పినా శిక్షిస్తారా? 

Show comments