ఎమ్బీయస్‌: బాబు లాంగ్‌ యూటర్న్‌

హోదా అంశంపై టిడిపి పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొంటూ మోదీ 'ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ కావాలన్న బాబు జగన్‌ జాలంలో పడి, యు టర్న్‌ తీసుకున్నారు. మేం మాత్రం అప్పుడూ యిప్పుడూ ఒకే మాటపై ఉన్నాం. ఫైనాన్స్‌ కమిషన్‌ హోదా వద్దంది కాబట్టి, ఆంధ్రకు ప్యాకేజీ యిస్తామన్నాం, యిస్తున్నాం, యింకా యివ్వబోతున్నాం' అని ప్రకటించారు. దీనితో బాబుకి కోపం వచ్చి 'నేను యూ టర్న్‌ తీసుకోలేదు, రైట్‌ (కుడి అని కాదు, సరైన అనే అర్థంలో) టర్న్‌ తీసుకున్నాను' అని జవాబిచ్చారు.

దీనితో బాటు కెసియార్‌ చాలా విజ్ఞత, సంయమనం పాటిస్తూండగా బాబు పరిణతితో వ్యవహరించటం లేదన్న అర్థంలో  మోదీ మాట్లాడడంతో బాబుకి మరీ మండిపోయింది.

'నాకు మెచ్యూరిటీ లేదంటాడా? నేను మోదీ, కెసియార్‌ల కంటె రాజకీయాల్లో సీనియర్ని' అని విరుచుకు పడ్డారు. సీనియారిటీకి, మెచ్యూరిటీకి లింకు ఉందని నాకు తెలియదు. నా కంటె వయసులో, రచనావ్యాసంగంలో చాలా జూనియర్లయిన వారు కూడా నాకు మతి, పరిణతి, అవగాహన ఏమీ లేవని, అసలు నేను వ్యాసాలు రాయడానికే పనికిరానని వ్యాఖ్యలు రాస్తూంటారు. బాబు గారి లాజిక్‌తో వాళ్లకు సమాధానం చెప్పవచ్చన్నమాట!

సరే సీనియారిటీ గోల వదిలేద్దాం. అడ్వాణీ వంటి బిజెపి పార్టీ సీనియర్లకే దిక్కు లేదు, బాబుగారి సీనియారిటీని మోదీ లెక్కిస్తాడా?

హోదా గురించి తను యిప్పుడు తీసుకున్న పోరాటపంథా 'రైట్‌ టర్న్‌' అని అన్నందుకు బాబును అభినందించాలి. ఎందుకంటే హోదా అజాగళస్తనమని, ఆ స్తన్యాన్ని తాగినవాళ్లెవరూ బాగుపడలేదని బాబు మనకి ఊదరగొడుతూండగా హోదాపై కోటి సంతకాల సేకరణ అంటూ కాంగ్రెసు ఉద్యమం నడిపింది, జగన్‌ అయితే చెప్పనక్కరలేదు, హోదా పాట వదలనే లేదు.

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా 'వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అయ్యాక బిజెపి-టిడిపిల మధ్య అనుసంధానకర్త లేకుండా పోయారు, అదే సమయంలో ప్రత్యేక హోదా సెంటిమెంటు బలపడింది' అని ఒప్పుకోవలసి వచ్చింది. ఆ సెంటిమెంటును బలపడేట్లా చేసిన ఘనత మాత్రం మన నిరంతర పాదయాత్రిదే ననాలి.

తన ''సాక్షి'' ద్వారా కూడా హోదా ఉన్న రాష్ట్రాలు ఏ మేరకు బాగుపడ్డాయో ఊదరగొట్టేశాడు. హోదా మాట ఎత్తితే జైల్లో పెడతానని హెచ్చరించిన బాబు హోదాయే సంజీవని అని, అది లేకపోతే బిజెపి ఏం యిచ్చినా శుద్ధ వేస్టు అనేట్లా చేశాడు. మోదీ, కెసియార్‌ల లాగానే జగన్‌ కూడా బాబు కంటె జూనియర్‌. అయినా తన మార్గానికి రప్పించుకోగలిగాడు.

ఈ యుటర్న్‌ను మనం హోదా విషయంలో మాత్రమే అన్వయించుకుంటున్నాం కానీ యీలోగా బాబు చాలా పెద్ద య..ూ టర్న్‌ తీసుకున్నారు. కాంగ్రెసు లోంచి విడివడి తెలుగుదేశంలోకి ప్రవేశించి, పార్టీ వ్యవస్థాపకుడికే చుక్కలు చూపించి, కాళ్ల కింద తివాచీ లాగేసి, పార్టీని సొంతం చేసుకున్న 23 ఏళ్ల తర్వాత, యిప్పుడు వచ్చిన బాటనే 35 ఏళ్లు వెనక్కి నడిచి కాంగ్రెసుతో సఖ్యం మొదలుపెట్టారు. ఆయన ఓ సందర్భంలో తనలో 70% కాంగ్రెసు రక్తం, 30% తెదేపా రక్తం ఉన్నాయని చెప్పుకున్నారు. అవి పార్టీలో చేరిన కొత్త రోజులు. పోనుపోను కాంగ్రెసు రక్తం వాటా తగ్గుతూ వచ్చింది. అయినా బొడ్డు తాడు పట్టి లాగింది. రక్తపాశం పలవరించింది.

ఏ మాట కా మాట చెప్పాలంటే గత 35 ఏళ్లలో ఆయన జట్టు కట్టని పార్టీ కాంగ్రెసు ఒక్కటే. బాబు కన్వీనర్‌గా ఉన్న యునైటెడ్‌ ఫ్రంట్‌ తరఫున గుజ్రాల్‌, దేవెగౌడ ప్రధానులైనప్పుడు వాళ్ల పల్లకిని కాంగ్రెసు వాళ్లు అటువైపు నుంచి కొన్నాళ్లు మోసి, కింద పడేశారు. కాంగ్రెసు తన స్వార్థం కోసమే యునైటెడ్‌ ఫ్రంట్‌ నాయకులను సమర్థించింది, తన స్వార్థం కోసమే కూలదోసింది. అప్పుడు కూడా బాబు కాంగ్రెసుతో కుమ్మక్కయ్యాడని ఎవరూ అనలేదు. రాష్ట్రంలో కాంగ్రెసు పట్ల బద్ధవైరమే కొనసాగించారు.

ఆయన ఓసారి కమ్యూనిస్టులతో, మరోసారి బిజెపితో అంటకాగారు. ఓ సారి తెరాసతో పొత్తు కట్టారు, మరోసారి కత్తి దూశారు. కానీ కాంగ్రెసుతో బాహాటంగా మాత్రం ఎప్పుడూ జట్టు కట్టలేదు.

బాహాటంగా అని ఎందుంటున్నానంటే జగన్‌ వైసిపి పెట్టి కాంగ్రెసు నుంచి కొందరు ఎమ్మెల్యేలను ఫిరాయింప చేసుకుని, కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడదామని చూసినప్పుడు, బాబు కిరణ్‌కు కొమ్ము కాసి, ప్రభుత్వం పడిపోకుండా చూశారు. కానీ అలా చేసినది, ఆత్మరక్షణ కోసం తప్ప కాంగ్రెసు మీదో, కిరణ్‌ మీదో ప్రేమ చేత కాదు. ఎందుకంటే అప్పుడు జగన్‌కు ఉన్న పాప్యులారిటీ చూస్తే కాంగ్రెసు ప్రభుత్వం పడిపోయి, ఎన్నికలు వచ్చే పక్షంలో జగన్‌ తప్పకుండా పెద్ద లీడరుగా అవతరించేవాడని పించేది. బాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి కిరణ్‌ను నిలబెట్టడంతో జగన్‌ బలం నానాటికి తగ్గుతూ వచ్చింది. రాష్ట్రవిభజనతో తెలంగాణలో పార్టీ యూనిట్‌ దాదాపు మూతపడింది. ఇప్పడక్కడ దాని గురించి ఎవరూ పెద్దగా చర్చించుకోవటం లేదు. ఆంధ్రలో టిడిపి తర్వాత ద్వితీయస్థానంలోనే నిలబడింది.

జగన్‌ ప్రాభవం తగ్గించిన తర్వాత బాబు మళ్లీ కాంగ్రెసుతో సఖ్యత పాటించలేదు. 2014 ఎన్నికలలో అయితే రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించినందుకు కాంగ్రెసును దుమ్మెత్తి పోశారు. ఆ పాపంలో పాలు పంచుకున్న బిజెపిని పల్లెత్తుమాట అనలేదు. పార్లమెంటు గలభాలో చురుకైన పాత్ర పోషించి ఆంధ్ర కౌంటర్‌పార్టులను చావగొట్టిన తెలంగాణ టిడిపి నాయకులనూ మందలించలేదు. తెలంగాణ కావాలని అందరి కంటె ముందు తనే లేఖ యిచ్చానన్న సంగతి ఆంధ్రలో చెప్పకుండా మొత్తమంతా కాంగ్రెసు మీదే నెట్టేసి, దాన్ని ఆంధ్రలో భూస్థాపితం చేసేసి, తను అధికారంలోకి వచ్చేశారు.

మరి యిప్పుడు బాబు అలాటి కాంగ్రెసుకు చేరువౌతున్నారు. కర్ణాటకలో రాహుల్‌ భుజం తట్టారని ''సాక్షి'' నానా యాగీ చేస్తే 'ఏదో మర్యాదకు పలకరిస్తే అంత కథ అల్లేయాలా?' అని ఫీలయ్యాను. కానీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల సమయంలో కాంగ్రెసు సమర్థించిన అభ్యర్థికి కాదు, సాక్షాత్తూ కాంగ్రెసు అభ్యర్థికే టిడిపి ఓటేసింది. కావాలనుకుంటే తటస్థంగా ఉండవచ్చు. కానీ లేరు. బాబు వ్యవహారాల గురించి క్షుణ్ణంగా తెలిసినట్లు కనిపించే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, కాంగ్రెసు పక్షాన బాబు దేశంలో అన్ని పార్టీలనూ కూడగడుతున్నారని, కాంగ్రెసేతర, బిజెపియేతర కూటమి కడదామనుకున్న మమతా బెనర్జీ వంటి వారికి 'కాంగ్రెసు లేకుండా బిజెపి వ్యతిరేక కూటమి సాధ్యం కాదు సుమీ అని నచ్చచెప్పారనీ రాశారు.

కూటమి ఆలోచనలతో కెసియార్‌ కలకత్తా వెళ్లినపుడే మమత 'కాంగ్రెసును కలుపుకోకపోతే లాభం లేద'ని చెప్పారని, దానితో కెసియార్‌ నిరాశ చెందారని వార్తలు వచ్చాయి. ఇప్పుడీయన బాబు చెప్పడం బట్టి మమత మనసు మారిందంటున్నారు. కావచ్చు. ఏది ఏమైనా అండర్‌లైను చేయవలసిన పాయింటేమిటంటే - బిజిపియేతర ఫ్రంటు నాయకత్వాన్ని కాంగ్రెసుకు అప్పగించడానికి బాబు శ్రమిస్తున్నారు.

ఒకప్పుడు టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు యావద్దేశంలో కాంగ్రెసేతర ఫ్రంటు ఏర్పరచడానికి శ్రమించారు. ఇప్పుడీయన దానికి పూర్తిగా వ్యతిరేక దిశలో కదులుతున్నాడు. రాజకీయాలనేవి డైనమిక్‌. ఎమర్జన్సీని విధించిన పార్టీలు, దాన్ని వ్యతిరేకించిన పార్టీలు చేతులు కలుపుతున్నాయి అని మోదీ వెక్కిరించారు కానీ, తిరిగి చూసుకుంటే అలాటి విన్యాసాలు బిజెపి కూడా చేసిందని గుర్తుకు వస్తుంది. అప్పుడు ఆంధ్రలో కాంగ్రెసు బలంగా ఉంది, దాన్ని ఎదిరించాలంటే తక్కినవాళ్లను పోగేయాలి. ఇప్పుడు ఆంధ్రలో కాంగ్రెసు చేవచచ్చి ఉంది. దానిలోంచి పుట్టుకుని వచ్చిన వైసిపి దాని స్థానంలో ప్రధాన శత్రువు అయింది. దాన్ని కొట్టాలంటే కాంగ్రెసును కలుపుకోవాలి. జాతీయస్థాయిలో బిజెపిని నిలవరించాలంటే కాంగ్రెసు మాత్రమే దిక్కు, ఎంత రాహుల్‌ గాంధీ చేతిలో ఉన్నా, దేశమంతా తెలిసిన పేరు కాంగ్రెసుది.

దేశస్థాయిలో పొత్తు పెట్టుకున్నా రాష్ట్రస్థాయిలో పొత్తు పెట్టుకుని, వాళ్లకు కొన్ని సీట్లు కేటాయిస్తుందా లేదా అన్నది ఆంధ్రలో యిప్పటికీ ప్రశ్నార్థకమే. తెలంగాణలో సాధ్యమంటున్నారు. ఒకప్పుడు తెరాసతో పొత్తు పెట్టుకుని కాంగ్రెసుతో పోరాడినట్లే, యిప్పుడు కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుని తెరాసను ఎదిరించాలని టిడిపి ప్లానట. తెలంగాణ టిడిపి, కాంగ్రెసు నాయకులిద్దరూ సుముఖంగా ఉన్నారట. కాదంటే తెలంగాణ టిడిపి నాయకులు అటూయిటూ జారిపోతారన్న భయంతోనైనా ఒప్పుకోవాలి. అయితే అంతటితో ఆగుతుందా? కాంగ్రెసుతో తెలంగాణలో పొత్తు పెట్టుకుని, ఆంధ్రలో పెట్టుకోనంటే జాతీయ కాంగ్రెసు ఒప్పుకుంటుందా? 2014లో బిజెపితో ఇలాటి సంకటమే వచ్చింది.

ఆంధ్రలో బిజెపికి బలం లేదు కాబట్టి అక్కడ పొత్తు లేదు, తెలంగాణలో ఉంది అని బాబు అంటే ఠాఠ్‌ అంది బిజెపి కేంద్రనాయకత్వం. ఇప్పుడా మాట కాంగ్రెసు అనవచ్చు. కాంగ్రెసుతో పొత్తును బాబు ఎలా సమర్థించుకుంటారో చూడాలి. తాను నంది అంటే నంది, పంది అంటే పంది అని తెలుగు మీడియా ప్రజల్ని నమ్మిస్తుందని, ప్రజలు కూడా నమ్ముతారనీ, బాబుకి విశ్వసిస్తూ ఉండవచ్చు. విశ్వసిస్తున్నారో లేదో ఉపయెన్నికలు జరుగుతూ ఉంటే తెలిసేది. ప్రత్యేక హోదాపై కాంగ్రెసు హామీ యిచ్చింది కాబట్టి వాళ్లతో వెళుతున్నా అని బాబు చెప్పుకోవచ్చంటున్నారు.

అసలు హోదా అడగవలసిన అవసరం కల్పించిందే కాంగ్రెసు. హైదరాబాదు మొత్తంగా తెలంగాణకు కట్టబెట్టేసి, ఆంధ్రకు మొండిచెయ్యి చూపించింది కాబట్టే హోదా కోసం దేవిరించవలసి వచ్చింది. ఇప్పుడు వైజాగ్‌ జోన్‌ లేదు, కడప స్టీలు ఫ్యాక్టరీ లేదు అంటే దానికి కారణం ఎవరు? కాంగ్రెసు కాదా? వాళ్లేగా 'పరిశీలిస్తాం, పరిశీలిస్తాం' అంటూ బిల్లులో రాసినది. ఒక్కటైనా తప్పకుండా యిస్తామని రాశారా? అన్నీ గాల్లో వదిలేశారు. అది చూపించే యిప్పుడు బిజెపి 'పరిశీలించాం, యివ్వక్కరలేదనే నిర్ణయానికి వచ్చాం' అంటోంది. ఎందుకంటే కాంగ్రెసు తప్పులను అది సవరించేస్తే ఆంధ్రులకు కాంగ్రెసుపై ద్వేషం కరిగిపోతుంది. కాంగ్రెసును ఎన్నటికీ క్షమించకూడదంటే ఆ ముల్లు వాళ్లకు నిరంతరం గుచ్చుకుంటూనే ఉండాలి. విభజన జరిగిన తీరు గురించి మోదీ పార్లమెంటు ఉపన్యాసం వింటే ఆ ఉద్దేశం తేటతెల్లమౌతుంది.

ఆంధ్రకు సంబంధించినంత వరకు బిజెపి ద్రోహి అయితే, కాంగ్రెసు పరమద్రోహి. ఈ విషయం తెలియకుండానే 'అడ్డగోలుగా చీల్చారు' అంటూ బాబు కాంగ్రెసుపై 2014లో నిప్పులు చెరిగారా? ఆనాటి ఆగ్రహాన్ని ఈ రోజు బిజెపిపై తిప్పి మనల్ని కాంగ్రెసు ద్రోహాన్ని మర్చిపోమంటే ఎలా? ప్రజలకు కావలసినది ప్రత్యేక హోదా. బాబుకి కావలసినది ప్రత్యేక ప్యాకేజి. హోదా యిస్తే పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు, ప్రజలకు లాభం. ప్యాకేజీ యిస్తే ప్రభుత్వానికి నిధుల పంట. అందుకని బాబు హోదాను అటకెక్కించి ప్యాకేజీ పల్లవి అందుకున్నారు.

బిజెపి ప్యాకేజీ తాయిలం చూపించి ఔననిపించి, ఆ తర్వాత మేం ఏ ప్రాజెక్టుకి యిస్తే దానికే ఖర్చు పెట్టాలి అనే మెలిక పెట్టారు. డబ్బంటూ వస్తే మళ్లించి పాత అప్పులు తీర్చేసి, తక్కినది పప్పుబెల్లాల కింద, తాయిలాల కింద పంచేసి, మళ్లీ గెలవవచ్చని అనుకున్న బాబు కంగు తిన్నారు. పిడి ఖాతాల విషయంలో చూశాంగా - నిధుల నిర్వాకం ఎలా ఉంటోందో! ఐస్‌ఫ్రూట్‌ చూపించి, పుల్ల మాత్రమే చేతికిచ్చినవాడిపై చిన్నపిల్లవాడికి ఎంత ఉక్రోషం ఉంటుందో, బాబుకి బిజెపిపై అంత ఉంది.

ఎవరితోనూ పని లేదు, సొంతంగా పోటీ చేసి గెలిస్తే గెలుస్తా, ఓడితే ఓడుతా అనే జగన్‌ టైపు మొండిధైర్యం బాబుకి లేదు. ఆయనకెప్పుడూ ఎవరో ఒకరి ఆసరా కావాలి. ఆ తర్వాత నా వల్లే వాళ్లు గెలిచారు అని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి కాంగ్రెసును వాటేసుకుంటున్నారు. కానీ ఆయన వాటేసుకునే సమయం అంత సజావుగా కనబడటం లేదు. గతంలో అయితే 'మన్‌మోహన్‌ను చూసి కాంగ్రెసు పక్షాన చేరా' లేదా 'సోనియాను చూసి..' అని చెప్పుకునే వీలుండేది. ఇప్పుడు 'రాహుల్‌ నాయకత్వం చూసి, మురిసి ఆయన్ను ఎలాగైనా ప్రధానిని చేయాలని కంకణం కట్టుకుని..' అని చెప్తే కడుపు చెక్కలయ్యేలా నవ్వు వస్తుంది.

మనం పైకి నవ్వితే ఆయన చిన్నబుచ్చుకుని 'మా లోకేశ్‌తో బాటు రాహుల్‌కు కూడా తర్ఫీదు యిచ్చి నాయకుడిగా నిలబెడతా' అనవచ్చు. తర్ఫీదు యిస్తే మంచిదే. మనకు వీళ్లే ప్రాప్తం అయినప్పుడు వాళ్లు కాస్త మెరుగ్గా ఉంటే సంతోషిస్తాం.

ఇంతకీ కాంగ్రెసు ప్రత్యేక హోదా యిస్తుందా? మొన్న అదే అంశంపై టిడిపి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినపుడు రాహుల్‌ యిచ్చిన ఉపన్యాసంలో ఆ హామీ ఏమీ యివ్వలేదే! ఆంధ్రకు వచ్చినపుడు ఉపన్యాసాల్లో దంచే విషయాన్ని అసలైన సమయంలో వదిలేసేడేం? అమిత్‌ షా పరిభాషలో అది కూడా 'చునావీ జుమ్లా బాత్‌' యా? 'అసలే మన ఇస్టరీ అంతంత మాత్రం' అని రావు గోపాలరావు అన్నట్లు, విశ్వసనీయత విషయంలో కాంగ్రెసు రికార్డు కనాకష్టం, ఈ సారి మాత్రం మాట చెల్లించుకుంటారని బాబు ప్రజలకు నచ్చచెప్పడం బహుకష్టం.

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మరో పాయింటు కూడా రాశారు. జగన్‌ బిజెపితో అంటకాగుతున్నాడని బాబు ప్రచారం చేయడం వలన ముస్లిములు యిప్పటికే వైసిపికి దూరమయ్యేరట. బాబు కాంగ్రెసు పక్షాన బిజెపియేతర పార్టీలను సంఘటితం చేయడంతో ముస్లిములు బాబుకి మరింత దగ్గరగా, జగన్‌కు మరింత దూరంగా అవుతున్నారట.

ఆంధ్రవరకు చూస్తే ముస్లిములు విడిగా ఓటేస్తున్నారని తోచదు. జనమంతా ఎటుంటే వాళ్లూ అటే వేస్తున్నారు. గతంలో ఇందిరనూ, ఎన్టీయార్‌ను, బాబునూ, వైయస్సార్‌ను అలాగే నెగ్గిస్తూ వచ్చారు. బాబు బిజెపితో కాపురం చేసిన రోజుల్లో కూడా నిరసించి దూరం కాలేదు. 1999లో, 2014లో అందరూ బాబుకి ఓటేసినప్పుడు వాళ్లూ వేశారు. మొన్న నంద్యాలలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉండి కూడా అప్పటికి బిజెపితోనే ఊరేగుతున్న టిడిపిని ఘనంగా నెగ్గించారు. ఒకవేళ జగన్‌ బిజెపితో పొత్తు పెట్టుకున్నా అతనికి వేద్దామనుకున్నవాళ్లు వేస్తారు, అనుకోనివాళ్లు వెయ్యరు. అంతే తప్ప బిజెపితో పొత్తు ఒక ఫ్యాక్టర్‌ కాదు.

క్రైస్తవుల విషయంలోనైతే వాళ్లు జగన్‌నే ఆదరించవచ్చు - సాటి క్రైస్తవుడనే భావంతో! అతను బిజెపితో పొత్తు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా క్రైస్తవ నాయకులు చాలా తక్కువమంది వుంటారు కాబట్టి మనవాడికి ఎలాగైనా సరే ఓటేయాలి అనుకోవచ్చు.

రోజులు గడిచేకొద్దీ బాబు కాంగ్రెసుకు ఎంత దగ్గరవుతారో తెలుస్తుంది. ఈ లోగా ఎన్‌టిఆర్‌ బయోపిక్‌లో బాబు పాత్రను ఎలా చూపిస్తారా అన్న కుతూహలం నాకు పెరిగిపోతోంది. ఆ బయోపిక్‌ ఎక్కడితో ముగిస్తారో సరిగ్గా తెలియటం లేదు. రెండో వెన్నుపోటు కచ్చితంగా చూపించరు - ఆ పోటుదార్లలో బాలకృష్ణ, బాబు ఉన్నారు కాబట్టి! మొదటిది చూపించి రెండోది చూపించకపోతే ప్రశ్నలు వస్తాయి కాబట్టి, బాలయ్య 50 ప్లస్‌ వేషాలకు చోటు వదలాలి కాబట్టి సినీరంగంతోనే ఆపేస్తారని ఓ దశలో అన్నారు.

చంద్రబాబును చూపిస్తారట అంటే పెళ్లి మండపంలో పెళ్లి కొడుగ్గా చూపిస్తారా అనుకున్నాను. తీరా చూస్తే రానా ఆ వేషం వేస్తాడట, బాబుని కలిసి పాత్ర గురించి డిస్కస్‌ చేశాడట అనగానే అయితే మొదటి వెన్నుపోటు వరకు చూపించి ఆ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణకై బాబు తీసుకున్న చురుకైన పాత్రను చూపిస్తారు కాబోలు అనుకుంటున్నాను. కానీ టిడిపిలోకి బాబు ప్రవేశాన్ని ఎలా చూపిస్తారా అన్న సస్పెన్సు అలాగే మిగిలి వుంది.

'ఎన్టీయార్‌పైనే పోటీ చేసి ఓడిస్తా' అని బాబు తిరుపతిలో చేసిన శపథాన్ని చూపిస్తారా? కాంగ్రెసు మంత్రిగా ఉండి, ఒక సాధారణుడి చేతిలో ఓడిపోయి, శరణు శరణంటూ మావగారి పంచన చేరిన విధానం చూపిస్తారా?

అవి చూపిస్తే ఎన్టీయార్‌ వారసుడిగా బాబు యిమేజి దెబ్బ తింటుంది. అందువలన ఆయనే మావగారికి రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయమని పురికొల్పి, 'మీరు పార్టీ పెట్టినా వెంటనే వచ్చి చేరను, కాంగ్రెసులోనే కొనసాగుతూ, మీ కోవర్టుగా అక్కడ శల్యసారథ్యం చేస్తూ మీకు సాయపడతా. ఆ పార్టీ పుట్టి ముంచి అప్పుడు వచ్చి మీతో ఫ్రెష్‌గా చేరినట్లు బిల్డప్‌ యిస్తా' అని ఎన్టీయార్‌కు చెప్పినట్లు చూపాలి. ఇలాటి దానికి వ్యూహం, చతురత, చాణక్యం, కౌటిల్యం, నమ్మకద్రోహం.. యిలా మీ యిష్టమొచ్చిన పేరు - బాబు పట్ల మీకున్న వైఖరి బట్టి పెట్టవచ్చు.

ఇలా చూపిస్తూనే రాష్ట్రంలో కాంగ్రెసును మట్టికరిపించి తెలుగుదేశం వేళ్లూనుకునేలా చేసిన ఘనుడిగా ప్రొజెక్టు చేయవచ్చు. తక్కిన సమయాల్లో యిది ఓకేయే కానీ, బాబు కాంగ్రెసుతో స్నేహం నెరపబోతున్న సమయంలో యిది పొసగదు. 'వెన్నుపోటు ప్రాక్టీసు మన పార్టీతో మొదలుపెట్టి, మన నీ స్థితికి దిగజార్చిన బాబుతో సఖ్యతా?' అని స్థానిక కాంగ్రెసు నాయకులు తిరగబడవచ్చు, అధమం సణగవచ్చు.

ఎన్టీయార్‌ బయోపిక్‌లో రాజకీయాల పార్టు మొత్తంలో కాంగ్రెసే విలన్‌. చైతన్యరథయాత్రలో ఎన్టీయార్‌ నిప్పులు కురిపించినది కాంగ్రెసు పైనే. ఎన్టీయార్‌ను ఎలాగైనా నిలవరించాలని చూసినది, రంగులేసుకునేవాడికి రాజకీయాలేమిటని ఎద్దేవా చేసినది, ముందస్తు ఎన్నికలు తెచ్చి యిబ్బంది పెట్టాలని చూసినది, నాదెండ్ల ద్వారా తిరుగుబాటు చేయించినది, గవర్నరు రామ్‌లాల్‌ ద్వారా ఎన్టీయార్‌ను పదవీభ్రష్టుణ్ని చేయించినది, అరెస్టు చేయించినది, జయపాల్‌, వెంకయ్యనాయుడు, బాబు తదితరులు నిర్వహించిన ఎమ్మెల్యే క్యాంపులను భగ్నం చేయడానికి ప్రయత్నించినది - కాంగ్రెస్సే.

సినిమా పూర్తయ్యేసరికి కాంగ్రెసు మార్కు రాజకీయాలను అసహ్యించుకుంటూ బయటకు రావాలి ప్రేక్షకుడు. ఈ సినిమా ఎన్నికల తర్వాత వస్తే ఏమో కానీ, ముందు వస్తే మాత్రం ప్రేక్షకుడు కన్‌ఫ్యూజ్‌ అవుతాడు - 'నిత్యం ఎన్టీయార్‌ పేరు జపించే బాబు యిలాటి కాంగ్రెసుతో కలిసి ముందు కెళుతున్నాడెందుకు?' అని. అలా వెళ్లడంలో కూడా ఒక దేవరహస్యం, ప్రజాప్రయోజనం ఉందని తెలుగుమీడియా మనల్ని నమ్మించినా నమ్మించవచ్చు!

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2018)
mbsprasad@gmail.com

Show comments