బాబూ.. ఇంకా భ్రమల్లోనే బతుకు!

చంద్రబాబుని పూర్తిగా భ్రమల్లోకి నెట్టేసి, లేనిపోని ఓవర్ కాన్ఫిడెన్స్ నింపి, వాస్తవ పరిస్థితులు తెలియకుండా చేసి ఆయన ఓటమికి పరోక్ష కారణం అయ్యాయి తోక పత్రికలు. టీడీపీ ఘోర పరాభవం తర్వాత అయినా వీటి బుద్ధి మారుతుందేమో అనుకున్నారంతా. కానీ బాబుని భ్రమల లోకంలోకి నెట్టడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాయి ఆ పత్రికలు. దీనికి తాజా ఉదాహరణే.. ఉండవల్లిలో బాబుకి ఓదార్పు యాత్ర.

చంద్రబాబుని ఓదార్చడానికి వచ్చిన మహిళా లోకం.. మీ ఓటమి తట్టుకోలేకపోయామని ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఉపవాసం చేస్తున్నామని, తెలంగాణలో జరిగిన మోసమే ఇక్కడ కూడా జరిగిందని చెప్పారని రాసుకొచ్చింది ఆ పత్రిక. నిజంగా ఇదిచూస్తే మహిళలోకం అంతా చంద్రబాబుని ఇంకా అభిమానిస్తున్నట్టు అనిపిస్తుంది.

మరి రాష్ట్రంలో ఫలితాలెందుకు అలా వచ్చాయి? పసుపు-కుంకుమ ఈసారి చంద్రబాబుని గట్టెక్కిస్తుందని అనుకుంటే.. మహిళలంతా ఉప్పు-కారం కలిపి పెట్టారని సోషల్ మీడియాలో జోకులెందుకు పేలుతున్నాయి. అసలు మహిళలు చంద్రబాబుకి ఎందుకు అండగా నిలవలేకపోయారనే విషయాన్ని పోస్ట్ మార్టమ్ చేయకుండా.. మహిళలు ఇంకా చంద్రబాబు వెంటే ఉన్నారని చెప్పడానికి చేసే ఇలాంటి ప్రయత్నాలు మరింత వెగటు పుట్టిస్తున్నాయి.

పోనీ ఎన్నికల తర్వాత ఫలితాల ముందు ఈ డ్రామాలు నడిచాయంటే దానికో అర్థముంది. ఫలితాలొచ్చిన తర్వాత కూడా ఇంకా ఎందుకీ నాటకాలు? ఎవర్ని నమ్మించడానికి ఈ మోసాలు? ఈనెల 29న జరిగే టీడీపీ ఎమ్మెల్యేల సమీక్షా సమావేశంలో అయినా చంద్రబాబు నిజాలు మాట్లాడతారేమో చూడాలి.

వందకి వెయ్యిశాతం అంటూ భ్రమల్లో బతికి, టీడీపీ శ్రేణుల్ని కూడా మభ్యపెట్టిన బాబు.. ఈరోజు నిజం జీర్ణించుకోలేక, ప్రజల్లోకి రాలేక, మీడియా కంటపడలేక ఇంటికే పరిమితమయ్యారు. బాబుకి తోడు అనుకూల మీడియా కూడా ఇంకా అదే పద్ధతిని ఫాలో అవుతోంది. బాబు ఇలా భ్రమల్లోనే బతికేస్తారేమో!

పదేళ్ల రాజకీయ ప్రస్థానం అద్భుత మలుపు