ఉమ్మడి ఆస్తులు ఇప్పుడు గుర్తొచ్చాయా బాబూ!

ఐదేళ్లలో నాలుగేళ్లకు పైగా బీజేపీతో చక్కగా కాపురం చేశారు. ఆ టైమ్ లో ఒక్కసారి కూడా ఉమ్మడి ఆస్తుల గురించి మాట్లాడలేదు చంద్రబాబు. తిరిగి మళ్లీ బీజేపీతో తెగతెంపులు చేసుకున్నంత వరకు ఉమ్మడి ఆస్తులు, ప్రత్యేక హోదా అంశం బాబుకు గుర్తుకాలేదు. సరిగ్గా ఎన్నికలకు కొన్ని గంటల ముందు మాత్రం చంద్రబాబుకు ఈ ఆస్తులు గుర్తొచ్చాయి. చేసిందంతా చేసి ఇప్పుడు ఫ్రెష్ గా మనకు అన్యాయం జరిగిందంటూ బీద అరుపులు అరుస్తున్నారు బాబు.

వాస్తవంగా చూసుకుంటే.. విభజన జరిగి, ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఓ 2 నెలల పాటు చంద్రబాబు ప్రసంగాలు, రాజకీయాలన్నీ ఈ ఉమ్మడి ఆస్తుల చుట్టూనే తిరిగాయి. అప్పట్లో డిపార్ట్ మెంట్స్ వారీగా ఆయన ఆస్తుల విభజనపై అధికారుల్ని కూడా నియమించారు. తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు కూడా షురూ చేశారు. కానీ అంతలోనే ఆ అంశాన్ని గాలికొదిలేశారు బాబు. దీనికి కారణం ఓటుకు నోటు.

ఓటుకు నోటు కేసులో ఎప్పుడైతే అడ్డంగా బుక్ అయిపోయారో, అప్పుడే ఉమ్మడి ఆస్తుల అంశం నీరుగారిపోయింది. ఆఘమేఘాల మీద, రాత్రికి రాత్రి హైదరాబాద్ నుంచి బెజవాడ కరకట్టకు వచ్చేసిన చంద్రబాబు.. ఉమ్మడి ఆస్తులపై మాట్లాడ్డానికి భయపడ్డారు. రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి ఆస్తుల విభజన జరగాల్సిందే. కానీ ఆ టాపిక్ ఎత్తితే, ఎక్కడ కేసీఆర్ కు ఓటుకు నోటు కేసు గుర్తొస్తుందోనని బాబు భయం. అందుకే దాన్ని ఆయాచితంగా పక్కనపడేశారు.

"ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర అభివృద్ధి కోసం సింగపూర్, అమెరికాలాంటి దేశాల్లో చెప్పులు అరిగేలా తిరిగాను. పెట్టుబడులు తీసుకొచ్చాను. ఆ ఫలాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనుభవిస్తోంది. నాకు ఆనందమే. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు రావాల్సిన లక్ష కోట్లు ఇవ్వకుండా మనకు మోసం చేశారు."

సరిగ్గా ఎన్నికలకు ముందు చంద్రబాబుకు ఇలా బీద అరుపులు షురూ చేశారు. గడిచిన మూడేళ్లలో ఒక్కసారి కూడా ఈ అంశాన్ని టచ్ చేయడానికి ఇష్టపడని బాబు.. ఇప్పుడు విభజన సెంటిమెంట్ ను రగిల్చి ఓట్లు దండుకునే కుయుక్తిని అమలు చేస్తున్నారు. నిజానికి విభజన కారణంగా ఏపీకి రావాల్సిన ఉమ్మడి ఆస్తులు కచ్చితంగా వచ్చి తీరాల్సిందే. ఇందులో మరో అభిప్రాయానికి తావు లేదు. కాకపోతే దానికోసం చంద్రబాబు ఏ మేరకు కృషి చేశారనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న.

ఇన్నాళ్లూ అధికారాన్ని అనుభవించి, ఇప్పుడు విభజన హామీలంటూ బీద అరుపులు అరిస్తే దాని అర్థమేంటి..? ఉమ్మడి ఆస్తుల అంశం చంద్రబాబుకు ఇప్పుడే గుర్తుకు రావడానికి కారణం ఏంటి?  ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తే మంచిది.

చివరికి పవన్ కల్యాణ్ కథ ఇదీ!

Show comments