సైకిల్ పై నొక్కితే ఫ్యాన్ కు ఓటు.. సిగ్గుందా బాబూ!

ఆడలేక మద్దెలు ఓడు అన్నాడట వెనకటికి ఒకడు. ఇప్పుడు చంద్రబాబు వ్యవహారం కూడా అలానే ఉంది. రాబోయే ఫలితాలు ఎలా ఉంటాయో ప్రజానీకంతో పాటు చంద్రబాబుకు కూడా ఇప్పటికే ఓ అవగాహన వచ్చేసింది. ఫ్యాన్ గాలి గట్టిగా వీస్తోందనే విషయం టీడీపీ శ్రేణులకు ఆల్రెడీ అర్థమైపోయింది. దీంతో నెపాన్ని ఎవరిపై నెట్టాలో ఇప్పట్నుంచే నెట్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగా ఈవీఎంలపై ఏడుపు మొదలుపెట్టారు.

చాలా ప్రాంతాల్లో ఈవీఎంలు సరిగ్గా పనిచేయడం లేదంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు చంద్రబాబు. ఇక్కడి వరకు ఓకే. దాదాపు 30శాతం వరకు ఈవీఎంలు పనిచేయడం లేదన్నారు. ఇది కూడా ఓకే. కానీ అసలైన కామెడీ ఏంటంటే.. పనిచేస్తున్న మెషీన్లలో సైకిల్ గుర్తుపై నొక్కితే, ఆ ఓటు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై పడుతోందంట. ఇది బాబుగారి సిల్లీ కామెడీ.

40 ఏళ్ల ఇండస్ట్రీ.. హైటెక్ సిటీ నేనుకట్టాను.. టెక్నాలజీని నేనే పరిచయం చేశాను.. ఇండియాకు సెల్ ఫోన్లు నేనే తీసుకొచ్చానంటూ  ఇన్నాళ్లూ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబుకు.. సైకిల్ గుర్తుపై నొక్కితే ఫ్యాన్ కు ఓటు పడదనే విషయం తెలియనిది కాదు. కానీ త్వరలోనే రాబోతున్న ఓటమిని ఎదుర్కొనేందుకు బాబు ఇలా ముందుగానే సేఫ్ గేమ్ స్టార్ట్ చేసినట్టు కనిపిస్తోంది.

నిజానికి ఇలాంటి ఆరోపణల వల్లనే ప్రతి ఈవీఎం మెషీన్ కు వీవీ ప్యాట్లు అనుసంధానం చేశారు. వేసే ఓటు దేనికి పడిందో అందులో చూపిస్తుంది. అంతేకాదు ఆ మేరకు ఓ స్లిప్ కూడా ప్యాట్ లో జమ అవుతుంది. ఈ విషయాలు తెలిసి కూడా తన ఓటమిని ఎన్నికల సంఘంపై నెట్టేసే ప్రయత్నాన్ని దిగ్విజయంగా ప్రారంభించారు చంద్రబాబు.

ఇక్కడ గమ్మత్తయిన విషయం ఏంటంటే.. గతంలో ఇదే చంద్రబాబు ఈవీఎంలను మెచ్చుకున్నారు. టెక్నాలజీని స్వాగతించాలంటూ ఉపోద్ఘాతం అందుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. అక్కడితో ఆగకుండా ఒక అడుగు ముందుకేసి ఈవీఎంలను పెట్టాలని సూచించిన మొదటి వ్యక్తిని నేనే అంటూ గతంలో గొప్పలు కూడా చెప్పుకున్నారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు అవే మెషీన్లను అనుమానిస్తున్నారంటే ఏమనుకోవాలి?

అయితే చంద్రబాబు నాలుక సమయానుకూలంగా మడత పడుతుందనే విషయం అందరికీ తెలిసిందే కదా. మొన్నటివరకు ప్రత్యేకహోదాపై అష్టవంకర్లు తిరిగిన బాబు నాలుక, ఇప్పుడు ఈవీఎంలపై పలురకాలుగా మడతలు పడిపోతోంది. ఇదంతా బాబులో ఓటమి భయం. కాస్త అర్థం చేసుకొని సర్దుకుపోవాలంతే!

Show comments