బాబు నెక్ట్స్ స్కెచ్ : రాష్ట్రపతి, నేషనల్ మీడియా!

శాసనసభలో ఇక కాలు పెట్టే అవసరం లేదు. అమరావతిలో చేయదగినంత రాద్ధాంతం చేసేశారు. రావలసినంత మైలేజీ వచ్చేసింది. ఇక, అపర చాణక్యుడిగా పేరుపడిన నారా చంద్రబాబునాయుడుగారి నెక్ట్స్ స్టెప్ ఏమిటి? 

వైసీపీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేయడానికి, తర్వాతి కార్యచరణ ప్రణాళిక ఏమిటి? తెలుగుదేశం పార్టీలో ఈ విషయంపై మేథోమధనం జరుగుతోంది. అయితే చంద్రబాబునాయుడు ఇప్పటికే ఈ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం.

నిన్న అమరావతి వేదిక మీద కన్నీళ్ల పర్వాన్ని ఆయన చాలా బాగా రక్తి కట్టించారు. విలేకరులు కూడా స్పందించి.. ఊరుకోండి సార్ అంటూ ఆయనని ఊరడించే ప్రయత్నం చేసేంతగా రక్తి కట్టించారు. నెక్ట్స్ వేదిక ఢిల్లీలో పెట్టాలని ప్లాన్  చేస్తున్నట్టు సమాచారం. 

కుటుంబసభ్యుల మీద కూడా అసభ్యకరమైన ఆరోపణలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుక సభలోను, సభ వెలుపల మాట్లాడిన మాటలకు సంబంధించి రికార్డులను తెలుగుదేశం సేకరిస్తోంది. వీటన్నింటినీ ఇంగ్లిషులోకి కూడా అనువాదం చేయించాలని ఆలోచిస్తున్నారు. అవన్నీ సిద్ధం చేసుకుని కీలకమైన నాయకులను కొందరు ఎంపీలను వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్లాలని అనుకుంటున్నారు.

ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు మీద ఫిర్యాదు చేయాలనేది చంద్రబాబు ప్లాన్. అందుకోసం రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకోవాలని పార్టీ వారిని పురమాయించినట్లుగా కూడా తెలుస్తోంది. 

వైసీపీ ఎంత ఘోరంగా వ్యవహరిస్తోందో.. ప్రతిపక్షాల పట్ల ఎలా మాట్లాడుతోందో రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడంతో పాటు.. ఢిల్లీలోనే నేషనల్ మీడియా అందరినీ పిలిచి జగన్మోహనరెడ్డి సర్కారు మీద విమర్శలతో ఒక ప్రెస్ మీట్ పెట్టాలనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది.

అమరావతి ప్రెస్ మీట్ లో బాబు వెక్కి వెక్కి ఏడ్చి కన్నీళ్లు పెట్టుకున్న సంఘటనకు సంబంధించి నేషనల్ మీడియా చాలా విస్తృతమైన కవరేజీ ఇచ్చింది.నేషనల్ మీడియా మొత్తం చంద్రబాబు కన్నీళ్ల పట్ల జాలి, ఆయన అనుకూల కథనాలతో వెల్లువెత్తిపోయాయి. ఆ రకంగా నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షించడంలో విజయవంతం అయ్యారు.

తొలినుంచి కూడా నేషనల్ మీడియాను మేనేజ్ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఆయన పాలనకు గతంలోనూ రాష్ట్రంలో పచ్చమీడియాకంటె నేషనల్ మీడియాలోనే ఎక్కువ ప్రచారం దక్కేది. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో పూర్తిగా ఫెయిలయ్యారు కూడా. 

నేషనల్ మీడియాను మేనేజ్ చేయడంలో వైసీపీ ప్రభుత్వంలో ఇప్పటికీ చేతకావడం లేదు. ఈ ఎడ్వాంటేజీని వాడుకుంటూ.. ఏపీలో రాజకీయంగా అరాచకాలు జరిగిపోతున్నాయంటూ తన వాదన మొత్తం ఢిల్లీ మీడియా ముందు వెళ్లగక్కాలని చంద్రబాబు అనుకుంటున్నారు. 

పాపం.. అక్కడ కూడా మరోసారి కన్నీళ్లు పెట్టుకోవడానికి రెడీ అవుతున్నారా? ఏమో మరి వేచిచూడాలి.

Show comments