తెలంగాణ ఎన్నికలు: ఆ ముగ్గురి కథ కంచికి

ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ముగ్గురు సినీప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. దురదృష్టవశాత్తూ ముగ్గురూ ఓటమి పాలయ్యారు. వీళ్లలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి భవ్య ఆనంద ప్రసాద్. బాలయ్యతో పైసా వసూల్ తీసి, అతడి లాబీయింగ్ తో టీడీపీ తరఫున టిక్కెట్ పొందిన ఆనంద్ ప్రసాద్.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు.

నిజానికి శేరిలింగంపల్లి నియోజకవర్గం టీడీపీకి చాలా సేఫ్ పాయింట్. సెటిలర్లు ఎక్కువగా ఉండే ఆ స్థానంలో ఎవరు నిల్చున్నా గెలుపు ఖాయం అనుకున్నారంతా. భవ్య ఆనందప్రసాద్ కూడా అలానే సంబరపడ్డారు. గెలుపు ఖాయమని భావించి పార్టీ ఫండ్ కింద, రోజువారీ ఖర్చుల కింద, ప్రచారం కోసం దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చుచేశారు.

తీరా ఫలితాలు వచ్చిన తర్వాత ఆనందప్రసాద్ అంచనా తారుమారైంది. హైదరాబాద్ లో సెటిలర్లు కూడా టీఆర్ఎస్ కే ఓటేసిన వైనం స్పష్టంగా కనిపించింది. అటు కూకట్ పల్లిలో కూడా అదే ట్రెండ్ కొనసాగింది. దీంతో దాదాపు 16వేల ఓట్ల తేడాతో ఆనంద ప్రసాద్ ఓడిపోయారు.

ఇక మరో సినీప్రముఖుడు బాబుమోహన్ ది మరీ బాధాకరం. ఆందోల్ లో ఇతడు సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ ఈసారి కనీసం రెండో స్థానంలో కూడా నిలవలేకపోయారు. టీఆర్ఎస్ పొమ్మనడంతో, బీజేపీ కండువా కప్పుకొని బరిలో దిగిన బాబుమోహన్, మినిమం పోటీ కూడా ఇవ్వలేకపోయారు.

మరో 2 రౌండ్లు మిగిలి ఉండగా.. బాబుమోహన్ కు పట్టుమని 1100 ఓట్లు కూడా రాలేదంటే ఈయన పరిస్థితి అర్థంచేసుకోవచ్చు. అటు వైరా నుంచి బరిలో దిగిన హీరోయిన్ రేష్మ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. బీజేపీ నుంచి పోటీచేసిన రేష్మకు కనీసం వెయ్యి ఓట్లు కూడా రాలేదు.

పోటీలో ఆమె టాప్-5లో కూడా లేకపోవడం విచిత్రం. ఇలా తెలంగాణ ఎన్నికల్లో పోటీచేసిన ముగ్గురు సినీప్రముఖులకు చేదు అనుభవమే ఎదురైంది.

Show comments