తుపాను సాక్షిగా మొదలైన పొలిటికల్ గేమ్

సరిగ్గా ఎన్నికల సీజన్. ఈ టైమ్ లో వచ్చింది తిత్లీ తుపాన్. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో చాలా ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. సహాయక చర్యల విషయాన్ని పక్కనపెట్టి, ఈ తుపానును ఎలా తమ రాజకీయ లబ్దికి వాడుకోవాలనే అంశంపై పార్టీలన్నీ మల్లగుల్లాలు పడుతున్నాయి. మరీ ముఖ్యంగా బాబు, మోదీ మధ్య ఇప్పుడు తుపాను బాధితుల భవితవ్యం ఆధారపడి ఉంది.

ఒకప్పుడు వీళ్లిద్దరూ స్నేహితులు. కానీ ఇప్పుడు రాజకీయ శత్రువులు. ఏకంగా టీడీపీకి చెందిన కొంతమంది పారిశ్రామికవేత్తలపై ఐటీ దాడులు జరిగే రేంజ్ కు వెళ్లింది రాజకీయం. ఇలాంటి టైమ్ లో వచ్చిన తిత్లీ తుపానును మోడీ వైపు మళ్లించడానికి చంద్రబాబు ప్లాన్ వేశారు. 

తిత్లీ తుపాను బాధితుల తక్షణసాయంగా 1200 కోట్ల రూపాయలు ఇప్పించాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు బాబు. ప్రాథమిక అంచనా ప్రకారం 2800కోట్ల నష్టం కలిగిందని, తక్షణసాయంగా 1200కోట్లు విడుదల చేయాలని కోరారు.

ఒకవేళ చెప్పిన మొత్తాన్ని మోడీ రిలీజ్ చేస్తే, అది తమ ఘనతే అని చెప్పుకుంటుంది టీడీపీ సర్కార్. మోడీ స్పందించకపోతే, లేఖ రాసిన స్పందించని బీజేపీ అంటూ ఎన్నికల ప్రచారాస్త్రంగా దాన్ని వాడుకుంటుంది. ఇది చంద్రబాబు ఎత్తుగడ.

బంతి మోదీ కోర్టులో వేశారు బాబు. బాధితులను అడ్డం పెట్టుకుని పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారు. ప్రత్యేకహోదా ఇవ్వకుండా ఇప్పటికే రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్రం, ఐటీ దాడులతో టీడీపీ నాయకులపై కక్ష సాధిస్తున్న కేంద్రం, ఇప్పుడు తుపాను బాధితులను కూడా చిన్నచూపు చూస్తోందని చెప్పడానికి బాబుకి మంచి అవకాశం దొరికింది.

అయితే బాబు లేఖలకు ఎలా రియాక్ట్ కావాలో మోడీకి బాగా తెలుసు. తుపాను బాధితులకు తక్షణసాయం అంటూ రాష్ట్రం అడిగేలోపే హుద్ హుద్ సమయంలో వెయ్యి కోట్ల రూపాయలు ఉదారంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

ఆ తర్వాత వాటిని వివిధ రకాల పథకాల పేర్లతో మళ్లించి సగానికి సగం కోత వేసిందనుకోండి. ఆ నిధుల్ని కూడా రాష్ట్రం సరిగా వాడుకోలేదని బీజేపీ నేతలతో ప్రచారం చేయిస్తున్న మోదీ సర్కారు.. ఇప్పుడు తిత్లీ బాధితులకు కూడా ఎంతో కొంత విదిలిస్తుంది.

దీన్ని కూడా బాబు సరిగా వాడుకోలేదని ప్రచారం చేయిస్తారు. ఆ విదిలించిన సాయం కూడా నేతల జేబుల్లోకే వెళ్లిపోతుందనేది వేరే చెప్పాల్సిన పనిలేదు. బాధితులకు నిజంగా సాయం చేయాలనే ఆలోచన అటు కేంద్రానికి కానీ, ఇటు రాష్ట్రానికి కానీ లేదు.

ఎన్నికల టైమ్ లో తుపాను బారిన పడటం శ్రీకాకుళం, విజయనగరం జిల్లా వాసులు చేసుకున్న దురదృష్టం. పావలా సాయంచేసి రూపాయి ప్రచారం చేసుకోవాలని చూస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఎన్నికల టైమ్ లో వీరిని ఆదుకోరు, ఎన్నికల తర్వాత అసలు పట్టించుకోరు.

మొత్తానికి తుపాను చేసిన గాయం కంటే.. అటు మోదీ, ఇటు చంద్రబాబు చేస్తున్న మోసం శ్రీకాకుళం, విజయనగరం జిల్లా వాసులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది.

Show comments