బాబు సైలెంట్.. జగన్ పై ఎందుకంత మౌనం?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయంలో చంద్రబాబు డైలమాలో పడ్డారు. మామూలుగా అయితే ఈపాటికే బాబు తన నోటికి పనిచెప్పాలి, విమర్శలతో విరుచుకుపడాలి, తోకమీడియా అండతో ప్రెస్ మీట్లు పెట్టి మరీ జగన్ పై విమర్శల వాన కురిపించాలి. కానీ బాబు సంయమనం, సంయమనం అంటూ శాంతిమంత్రం జపిస్తున్నారు. కారణం ఒక్కటే.. జగన్ ఘన విజయం.

151 అసెంబ్లీ, 22 లోక్ సభ స్థానాల్లో గెలిచి రికార్డ్ సృష్టించిన జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టాలంటేనే చంద్రబాబు హడలిపోతున్నారు. ఆకాశంపై ఉమ్మేస్తే అది తిరిగి తనమీదే పడుతుందన్న సామెతను గుర్తు చేసుకుని, నోరు మూసుకున్నారు బాబు. ప్రారంభంకాని కాంట్రాక్ట్ పనుల రద్దు, క్రాంట్రాక్టర్ల అవినీతిపై ఎంక్వయిరీ, రాష్ట్రంలోకి తిరిగి సీబీఐని ఆహ్వానించడం, తెలంగాణకు భవనాల అప్పగింత.. ఇలాంటి వ్యవహారాలన్నీ చంద్రబాబుకి మింగుడు పడనివి.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల సమీక్ష సమావేశాల్లో కూడా పలువురు మాజీ ముఖ్యమంత్రి దగ్గర ఇవే అంశాలను ప్రస్తావిస్తూ వచ్చారు. జగన్ పై విమర్శలు ఎక్కుపెడతామని జబ్బలు చరిచారు. అయితే చంద్రబాబే వారందర్నీ వారించినట్టు సమాచారం. ఇది సరైన సమయం కాదని, జగన్ కు జనబలం ఉందని, ఇప్పుడు మనం విమర్శలు షురూ చేస్తే జనం చీకొడతారని సర్దిచెప్పారు. అందులోనూ జగన్ తీసుకున్న నిర్ణయాలు, టీడీపీకి తలనొప్పి కానీ, ప్రజలకు ఇబ్బందిలేనివి.

అందుకే బాబు ఈ విషయంలో సంయమనంతో ఉన్నారు. సమయం వచ్చినపుడు చూద్దాం అంటూ ఆ ఎపిసోడ్ ని వాయిదా వేశారు. మొత్తమ్మీద ఒకప్పుడు జగన్ అంటేనే పూనకం వచ్చినట్టు ఊగిపోయే చంద్రబాబుకి.. ఇప్పుడు జగన్ పేరు ఉచ్ఛరించాలంటేనే ముచ్చెమటలు పడుతున్నాయి. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గడగడలాడిపోతున్నారు. మొత్తమ్మీద జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు.. విమర్శకుల నోళ్లు కూడా తెరవనీయకుండా చేస్తున్నాయన్నమాట. 

జగన్ కేబినెట్లో సీమ మంత్రులు ఎవరెవరు?