బాబు పరువు ఒకరు తీయాలా.. తనకు తానే!

సీఎంగా ప్రమాణం చేసిన మహూర్త బలమో, లేక బాబు గ్రహ బలమో తెలియదు కానీ ఈ నాలుగున్నరేళ్లలో చంద్రబాబు ఏది ముట్టుకున్నా షాక్ గట్టిగానే కొడుతోంది. వయసు పైబడేకొద్దీ నిర్ణయాలు తీసుకోవడంలో తడబడుతూ, తప్పటడుగులు వేస్తూ తల బొప్పికట్టించుకుంటున్నారు. ఒకటా రెండా రాజధాని నిర్మాణం దగ్గర్నుంచి, తాజాగా ధర్మాబాద్ కోర్టులో పడ్డ అక్షింతల వరకు బాబు భవిష్యత్తును చెప్పకనే చెబుతున్నాయి.

చంద్రబాబు మొదటి విఫల ప్రయోగం రాజధాని నిర్మాణం. తాత్కాలిక సచివాలయం అంటూ వేసిన సినిమా సెట్టింగ్ లలోకి వాననీరు రావడం, సాక్షాత్తూ మంత్రుల ఛాంబర్లే తడవడంతో అసలు చంద్రబాబు ప్రజల సొమ్ముని ఎందుకిలా నీళ్లలా ఖర్చుపెడుతున్నారనే చర్చ మొదలైంది. ప్రత్యేకహోదాపై వేసిన కుప్పిగంతులు, కప్పదాట్లు ప్రజల్లో అసహ్యాన్ని మరింత పెంచాయి.

ఆనాడు ప్యాకేజీయే బెస్ట్ అని పలికిన నోరు ఈనాడు హోదాకి ప్రత్యామ్నాయం లేదని చెబుతుంటే జనం చీదరించుకున్నారు. పరువుపోవడం తప్ప మాట మార్చడం ద్వారా చంద్రబాబు బావుకున్నది ఏంటి..? రుణమాఫీ అనే హామీతో చంద్రబాబు అన్నివర్గాల దగ్గర మోసకారిగా ఎలాంటి ఇమేజ్ తెచ్చుకున్నాడో అందరికీ తెలుసు. ఇక బాబు-జాబు ప్రాజెక్ట్ ఎంత అట్టర్ ఫ్లాపయిందో చూశాం. కాపు రిజర్వేషన్ల వ్యవహారంతో బాబు వేషం పూర్తిగా బట్టబయలైంది.

తాజాగా ధర్మాబాద్ కోర్టు ధర్మాగ్రహానికి చంద్రబాబు బలయ్యారు. సీఎం అయితే మాకేంటి.. వారెంట్ ఇస్తే కోర్టు ముందు హాజరుకావాల్సిన బాధ్యత లేదా అంటూ మొట్టికాయలు పడేసరికి అక్టోబర్ 15న కోర్టుకు వెళ్లాల్సిన అగత్యం ఏర్పడింది. అదేదో ముందేచేస్తే ఆ కాస్త పరువన్నా మిగిలేదిగా చంద్రబాబూ..?

చేతల ద్వారానే కాదు, మాటల ద్వారా కూడా చంద్రబాబు ఈసారి తన పరువుని పూర్తిగా బజారున పెట్టుకున్నాడు. ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి రమ్మని సలహా ఇచ్చింది తానేనని, వాజ్ పేయిని ప్రధానిని చేసిన ఘనతా తనదేనని, ఏపీకి టెక్నాలజీ తెచ్చిన సూపర్ మ్యాన్ తానేనని.. నీళ్లు నిలబెట్టానని.. చివరాఖరికి బ్రిటిష్ వాళ్లు కూడా తనని చూసి భయపడుతున్నారని... ఇలా ఒకటేంటి చంద్రబాబు స్పీచ్ వస్తే కామెడీ కోసం వెయిట్ చేసే వాళ్లు చాలామంది.

ఇవన్నీ ఒకెత్తయితే, చంద్రబాబు పూర్తిగా పరువు పోగొట్టుకున్న అంశం కాంగ్రెస్ తో పొత్తు. ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే అప్పట్లో ఎన్టీఆర్, టీడీపీ స్థాపించారో అదే పార్టీతో ఇప్పుడు సంసారానికి బాబు రెడీ అవుతున్నారు. ఇంతకంటే పరువు తక్కువ వ్యవహారం ఇంకోటి ఉండదు.

ఇక బాబు పరువు తీసిన మరో దారుణమైన నిర్ణయం చినబాబు అరంగేట్రం. దొడ్డిదారిలో మంత్రిపదవి కట్టబెడితే చినబాబు తన తెలివితేటలన్నీ బైటపెట్టి 'పండిత పుత్ర' అనే నానుడిని అక్షరాలా నిజం చేస్తున్నారు. ఆ ప్రసంగాలేంటి, వెకిలి నవ్వులేంటి.. ముఖ్యమంత్రి కొడుకేనా, రాష్ట్రానికి మంత్రేనే ఆనిపించేట్లు ఉంటుంది అయ్యవారి వాలకం, వాచకం. టీడీపీని తరిమికొట్టాలంటాడు, జయంతికి వర్థంతికి తేడా ఏంటని అడుగుతాడు, చెప్పుకుంటూపోతే చినరాజవారి సంగతులు చాలా ఉన్నాయి.

మొత్తానికి చంద్రబాబు వేసిన మాస్టర్ ప్లాన్ లు, తీసుకున్న నిర్ణయాలు ఏవీ ఈ దఫా వర్కవుట్ కాలేదు. ప్రజల్లో సానుభూతి పొందాలని చేసిన ప్రతిపనీ బెడిసికొట్టింది. తనను దెబ్బకొట్టే అవకాశం ప్రతిపక్షానికి అస్సలు ఇవ్వలేదు చంద్రబాబు. తన గాలి తానే తీసుకున్నారు. తన పరువు తానే పోగొట్టుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే నారావారి ఫ్యూచర్ ఏంటో ఇట్టే అర్థమైపోతోంది. కాదంటారా..?