బాబుకు తెలిసి చేసారా? తెలియక చేసారా?

ఆంధ్రలో 2019 లో అధికారం ఏ పార్టీ చేపడుతుందన్నది ఇంకా కాస్త సస్పెన్స్ గానే వుంది. చాలా సర్వేలు వైకాపా వైపు వున్నాయి, కొన్ని సర్వేలు బాబు వైపు కూడా వున్నాయి. అందువల్ల ఆ డిస్కషన్ పక్కన పెడితే, కేంద్రలో మోడీ సర్కారు మళ్లీ అధికారంలోకి రాబోతోందన్న మాటను జాతీయ, ప్రాంతీయ సర్వేలు అన్నీ ముక్త కంఠంతో చెప్పాయి. అందులో అస్సలు సందేహమే లేదు. 

ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్నీ ఇసి నిబంధన మేరకు ఇప్పుడు వచ్చాయి. కానీ, దాదాపు ఫలితాలు ఎలా వుండబోతున్నాయన్నది వివిధ వర్గాల ద్వారా, మీడియాలోని తమ వర్గాల ద్వారా ప్రతిపక్షాలకు ఇప్పటికే తెలిసివుండాలి. తెలిసి వుంటుంది కూడా. 

ఇదిలా వుంటే, దాదాపు రెండు మూడు వారాలుగా యుపిఎ వైపు వున్న రీజనల్ పార్టీల జనాలు ఎవ్వరూ పెద్దగా హడావుడి చేయలేదు. చిన్న చిన్న రోజు వారీ ప్రకటనలు తప్పిస్తే, మోడీ మీద భయంకరంగా ధ్వజమెత్తిన దాఖలాలు లేవు. ఈ విషయంలో బెంగాల్ సిఎమ్ మమత బెనర్జీకి కాస్త మినహాయింపు. 

కానీ ఆంధ్ర సిఎమ్ చంద్రబాబు వైఖరే వేరు. ఆయన అందరికన్నా ఎక్కువ హైరానా పడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఆగం ఆగం అయిపోతున్నారు. ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం, మోడీపై భయంకరమైన విమర్శలు. మరి ఫలితాలు ఇలా వుండబోతున్నాయని బాబుకు ఏమాత్రం సమాచారం అందలేదా? అందినా ఇంకా హైరానా పడుతున్నారా?

ఇదంతా చూస్తుంటే బాబు మనసులో ఏదో తెలియని గుబులు వున్నట్లు తోస్తోంది. ఆంధ్రలో తను అధికారంలోకి వచ్చినా, జగన్ వచ్చినా, కేంద్రంలో మోడీ రాకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్న తీరుగా చంద్రబాబు ఆలోచనలు సాగుతున్నట్లు కనిపిస్తోంది. బాబు అధికారంలోకి వస్తే, మోడీ కేంద్రంలో వుంటే మళ్లీ ఇబ్బందులు అనే భావన వుండి వుండొచ్చు.

కానీ జగన్ వస్తే, కేంద్రంలో మోడీ వుండకూడదన్న భావన చంద్రబాబుకు ఎందుకు? అంటే కేంద్రంలో యుపిఎ వుంటే జగన్ కు ఇబ్బంది అవుతుందనే భావనా? మోడీనే మంచి చేసుకోగలిగిన జగన్ యుపిఏ ను చేసుకోలేడా? 

ఏమైనా చంద్రబాబు చేస్తున్నవన్నీ ఇటు తెలుగుదేశం జనాలకు మింగుడు పడడం లేదు. ఆ పార్టీ అభిమానులకు అర్థం కావడం లేదు. ఇప్పటికే మోడీని అనవసరంగా దూరం చేసుకున్నారు అని ఆ పార్టీ అభిమానులు బాబుపై అసంతృప్తిగా వున్నారు. మోడీతో వుండి వుంటే ఇప్పుడు ఇన్ని సమస్యలు వచ్చి వుండేవి కాదని, జగన్ ఈ రేంజ్ పోటీ ఇచ్చేవాడు కాదని వారి భావన.

మోడీని దూరం చేసుకుని బాబు సాధించింది ఏమీ లేదు. పోనీ అలా అని యుపిఎ లో వున్న భాగస్వాములు ఎవ్వరూ కూడా మోడీని ఇంతలా దూరం చేసుకోలేదు. ఒక్క మమత బెనర్జీ తప్ప. మిగిలిన వారంతా రేపు అవసరం అయితే ఎన్టీఎ పక్కకు వెళ్లడానికి ఓ తలుపు తెరిచే వుంచుకున్నారు. కానీ బాబు మాత్రం తలుపులు మూయడం కాదు, ఏకంగా గోడ కట్టేసారు. 

బాబు అదృష్టం బాగుండి ఆంధ్రలో అధికారం అందితే ఫరవాలేదు. ఏదో విధంగా నెట్టుకురావచ్చు. అలా కాకుండా మోడీకి ఎవ్వరి మద్దతు అవసరం లేకుండా, జగన్ ఆంధ్రలో అధికారంలోకి వస్తే బాబుగారిని నమ్ముకున్నవారి పరిస్థితి ఏమిటి? బాబుగారికి ఫరవాలేదు. కానీ ఆయనను నమ్ముకున్న అనేకానేక కాంట్రాక్టర్లు, లయిజినింగ్ జనాలు, ఇంకా, ఇంకా చాలా మందికి ఇబ్బందే. 

వీళ్లందరూ పైకి అనకున్నా, లోపల అనేది ఒకటే మాట. బాబుగారు ఇదంతా తెలిసే చేస్తున్నారా? తెలియక చేస్తున్నారా? అనే.

Show comments