బాబు, జగన్‌ తేల్చలేకపోతున్నారా..!

-తేలని అభ్యర్థుల ఎంపిక!
-బోలెడన్ని సందేహాల్లో ఇరు పార్టీల అధినేతలూ
-సర్వేలు, సమీకరణాల్లో నిమగ్నం!
-పవన్‌ కల్యాణ్‌ పనే హాయి!

ఒకవైపు ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మరో నెల రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్‌ వచ్చినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఫిబ్రవరి రెండోవారం పైన ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయ్యే అవకాశం ఉంది. కాస్త ముందుగా వస్తే.. ఏప్రిల్‌ నెలలోనే పోలింగ్‌ కూడా పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఎన్నికలు జరగాల్సింది మేనెలలో అయినా.. ఏప్రిల్‌లోనే ఈసారి తంతును పూర్తిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి రెండోవారం గడిచిపోతున్నా.. ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక అంశం ఇప్పటి వరకూ ఒక కొలిక్కి రాకపోవడం విశేషం!

ఒకరకంగా చూస్తే... అభ్యర్థుల ప్రకటన ఇంత ముందుగా చేయాల్సిన అంశం ఏమీకాదు. అయితే ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో కథ కాస్త మారింది. అసెంబ్లీ రద్దు ప్రకటన చేసిన వెంటనే కేసీఆర్‌ అభ్యర్థుల ప్రకటన చేశాడు. అసలు ఎన్నికలు వస్తాయా? అనే సందేహం ఉన్న దశలోనే అభ్యర్థుల ప్రకటన చేశాడు కేసీఆర్‌. అది కేసీఆర్‌కు ఎంత మేలు చేసిందో వేరే చెప్పనక్కర్లేదు. ముందస్తుగా అభ్యర్థుల ప్రకటన అనేది తెలంగాణ రాష్ట్ర సమితి విజయంలో కీలకపాత్ర పోషించిందని ఎన్నికల తర్వాతి విశ్లేషణల్లో బాగా వినిపించిన అభిప్రాయం.

అభ్యర్థులు ఎవరో కేసీఆర్‌ పోలింగ్‌కు దాదాపు రెండునెలల ముందే డిసైడ్‌ చేశాడని.. ఫలితంగా వారిలో స్పష్టత వచ్చేసిందని, కేసీఆర్‌ ఆమోదముద్ర లభించగానే వారంతా జనాల్లోకి వెళ్లిపోయారని.. ప్రచారపర్వాన్ని మొదలుపెట్టారని.. ప్రతి ఒక్కరికీ వీలైనంత సమయం దొరకడంతో.. పక్కా ప్రణాళికలు వేసుకుని.. అన్నిరకాల వ్యూహాలను సిద్ధంచేసి పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్నారనేది.. పోస్ట్‌పోల్‌ ఎనాలసిస్‌లో బాగా వినిపించిన విశ్లేషణ. ఇటీవల తెలంగాణ జనసమితి కన్వీనర్‌ కోదండరాం కూడా అదేమాటే చెప్పాడు.

కేసీఆర్‌ ముందస్తుగా అభ్యర్థులను నిర్ణయించడమే ఆయన విజయంలో కీలకమైన పార్ట్‌ అని ఆయన విశ్లేషించాడు. తను ఇదే విషయాన్ని కాంగ్రెస్‌, టీడీపీ నేతలకు చెప్పానని.. పోలింగ్‌కు కనీసం నెలరోజుల ముందు అయినా అభ్యర్థుల ప్రకటన చేయాలని తను పట్టుపట్టానని అయితే వారు తనను పట్టించుకోలేదని కోదండ వాపోయాడు. కేసీఆర్‌ను ఎదుర్కొనాలంటే.. ప్రచార పర్వానికి వీలైనంత సమయం కావాలని తను ఎంతచెప్పినా అభ్యర్థుల ప్రకటన లేట్‌ చేశారని.. ముందుగానే అభ్యర్థుల ప్రకటనను చేసుకున్న కేసీఆర్‌ ప్రచారంలో దూసుకుపోయాడని పక్కా ప్రణాళికతో ప్రచారం చేసి.. వారు విజయాన్ని పొందారని, అభ్యర్థుల ప్రకటనలో తర్జనభర్జనలు పడి తాము ఓడిపోయామని కోదండరాం విశ్లేషించారు.

కేసీఆర్‌ గెలుపుకు, మహాకూటమి ఓటమికి తేడా.. కేవలం అభ్యర్థుల ప్రకటనే కాకపోవచ్చు. అయితే ముందస్తుగా అభ్యర్థుల ప్రకటన చేయడం మాత్రం కేసీఆర్‌ విజయంలో కీలకం అని చెప్పవచ్చు.

ఏపీలో అలాంటి రాజకీయం ఉంటుందా?
తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఏపీలో కూడా అలాంటి రాజకీయం ఉంటుందా? అనేచర్చ మొదలైంది. అంటే.. ముందస్తుగానే అభ్యర్థుల ప్రకటన చేసుకుని.. ఏపీలోని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు రెడీ..ఢీ.. అని అంటాయా? అనే చర్చ ఎప్పటి నుంచో మొదలైంది. ముందుగా తెలుగుదేశం వాళ్లే దీన్ని అందుకున్నారు. కేసీఆర్‌లానే తాము కూడా సంక్షేమ పథకాలను అమలు చేశామని.. కాబట్టి తాము కూడా ముందుగానే అభ్యర్థులను ప్రకటన చేసి.. కేసీఆర్‌లాగే వెళ్లి గెలుస్తామని కొంతమంది టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఒకేసారి చంద్రబాబు నాయుడు వందకు పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేస్తాడని కూడా హడావుడి చేశారు. జనవరి మూడోవారంలో అందుకు ముహూర్తం కూడా పెట్టారు.

అయితే చంద్రబాబు నాయుడు తాజాగా ఆ అంశం మీద మాట్లాడుతూ.. అలాంటిదేమీ ఉండదని స్పష్టంచేశాడు. అభ్యర్థులను 'తగు సమయం'' చూసి ప్రకటిస్తాం తప్ప.. ముందుగానే, ముహూర్తాలను పెట్టి.. ఒకేసారి భారీ ఎత్తున అభ్యర్థులను ప్రకటించే ఉద్దేశం లేదని చంద్రబాబు నాయుడు స్పష్టంచేశాడు. అయితే ఆ తగుసమయం ఎప్పుడు? అనేది కూడా ఇంకా తెలుగుదేశం పార్టీలో స్పష్టత లేనట్టే. ఇక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపు నుంచి కూడా కొన్ని ఊహాగానాలు వినింపించాయి. పాదయాత్ర ముగింపు సభలో జగన్‌ మోహన్‌ రడ్డి వందకు పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తాడనే ఊహాగానం ఒకటి రేగింది. పాదయాత్ర ముగింపును అలా రాజకీయ సంచలనంగా జగన్‌ నిలుపుతాడనే విశ్లేషణలు వినిపించాయి.

అయితే ఆ విషయాన్ని పాదయాత్ర ముగింపుకు ముందే జగన్‌ ఖండించాడు. అభ్యర్థుల ప్రకటనను తాము సంచలనం చేయాలని అనుకోవడం లేదని.. పాదయాత్ర ముగింపు రోజున అభ్యర్థుల ప్రకటన ఏమీ ఉండదని జగన్‌ స్పస్టత ఇచ్చాడు. అందుకు తగ్గట్టుగానే.. అభ్యర్థుల ప్రకటన అంటూ ఏమీలేకుండా పాదయాత్రను పూర్తిచేశాడు వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి. ఈ విధంగా ఇరుపార్టీలూ.. ఇప్పుడప్పుడే సంచలనాత్మక రీతిలో అభ్యర్థుల ప్రకటన చేసేది లేదని స్పష్టం చేసినట్టుగా అయ్యింది.

తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది?!
చాలామంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చాలి.. అనేది చంద్రబాబు నాయుడు ఉద్దేశం. ఈ విషయాన్ని ఆయన రెండేళ్ల నుంచి చెబుతూనే ఉన్నాడు. చాలామంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదని.. వారిపై తన సర్వేల్లో నెగిటివ్‌ రిపోర్టులు వచ్చాయని.. అందుకని.. వారిని మార్చేస్తానని చంద్రబాబు నాయుడు తన పార్టీ సమీక్షల్లో చెబుతూ వచ్చాడు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు కసరత్తును చేస్తూ ఉన్నాడు. కసరత్తును కొనసాగిస్తూ ఉన్నాడు.

ఒక్కో నియోజకవర్గానికి చెందిన నేతలను పిలిపించుకోవడం.. మాట్లాడటం తన 'లెక్కల్లో'' అనుకూలత ఉన్న వాళ్లకు ఆమోదముద్ర వేయడం.. మరొకరికి నో అని చెప్పడం ఇదీ చంద్రబాబు నాయుడు ప్రస్తుతం చేస్తున్న పని. ఇలాంటి సమస్యాత్మక నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి చాలానే ఉన్నాయి. వాటిల్లో ఒక్కొక్కదాన్ని తేల్చడానికి కనీసం ఒకరోజు తీసుకున్నా.. ఇప్పడప్పుడే అభ్యర్థులు తేలడం సులభంగా కనిపించడం లేదు!

బాబును భయపెడుతున్న సిట్టింగులు!
ఒకరని కాదు.. చాలామంది సిట్టింగులు తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున చాలామంది అనూహ్య విజయాలను సాధించారు. బాబు పాలనతో ఎమ్మెల్యేల అవినీతి పతాక స్థాయికి చేరింది. కేవలం ఎమ్మెల్యేలు అని మాత్రమే కాకుండా.. వారి అనుచరగణం దందాలకు హద్దులేకుండా పోయింది. జన్మభూమి కమిటీలు అంటూ.. ఆఖరికి పల్లెల్లో కూడా పచ్చరాజ్యం కొనసాగుతూ ఉంది. గ్రామాల్లో జన్మభూమి కమిటీలు వంటివి తెలుగుదేశం పార్టీపై తీవ్రమైన వ్యతిరేకతను పెంచాయి.

తమ ఊళ్లోవాడు.. తమ విషయంలో ఒక నియంతలా మారితే.. ఎవరూ సహించరు. ఆ రోజులు పోయాయి. ఇలాంటి జన్మభూమి కమిటీల వ్యతిరేకత.. ఎమ్మెల్యేల వరకూ పాకింది. ఇది చంద్రబాబుకే ప్రమాదకరంగా మారింది. ఇలాంటి నేపథ్యంలో బాబు ఏంచేయాలో తెలియక.. సిట్టింగులను మార్చడం అని అంటున్నాడు. అయితే సిట్టింగులను మార్చినంత మాత్రాన.. ఊళ్లో తమ మీద జులుం చెలాయించిన జన్మభూమి కమిటీని, జన్మభూమి పార్టీని జనాలు క్షమించేస్తారా? అనేది శేష ప్రశ్న.

ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి సిట్టింగులను మారుస్తారు సరే.. తనకు టికెట్‌ దక్కకపోతే సదరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఊరికే ఉంటాడా? అనేది కూడా మరో కీలకమైన అంశం. ఐదేళ్లపాటు పదవిని మరిగినవాళ్లు ఎవరైనా సరే, మళ్లీ తమకే అవకాశం ఇవ్వాలని అంటారు. అందులోనూ పార్టీ అధికారంలో ఉండింది. దీంతో అందరూ ఆర్థికశక్తిని కూడా భారీగా పెంచుకున్నారు. ఫలితంగా టికెట్‌ మళ్లీ తమకే కావాలనే వాళ్లే వందకు వందశాతం ఉంటారు. 'ఔనా.. నాపై వ్యతిరేకత ఉందా. సరే పార్టీ కోసం నా సీటును త్యాగం చేస్తా.. టికెట్‌ వేరే వాళ్లకు ఇవ్వండి.. వారి విజయానికి సహకరిస్తా..'' అని చెప్పే రాజకీయ నేత ఎవరైనా ఉంటారా?

టికెట్‌ దక్కకపోతే వేరే పార్టీలోకి వెళ్తాం.. అక్కడా దొరకదు అనుకుంటే.. ఇండిపెండెంట్‌గా పోటీచేస్తాం.. అనేవాళ్లే నూటికి నూరుశాతం ఉంటారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలే ఫిరాయించేసి.. తమను గెలిపించిన పార్టీకి నామాలు పెట్టించే రాజకీయాన్ని నడుపుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఇలాంటి నేపథ్యంలో ఆయనకు నామాలు పెట్టడానికి ఎమ్మెల్యేలు ఎందుకు సంశంయిస్తారు? దాదాపు నలభైమంది సిట్టింగులను మార్చాలి అని చంద్రబాబు అనుకుంటున్నారట. దానికితోడు.. ఫిరాయింపుదార్లు ఉండనే ఉన్నారు. ఫిరాయింపుదార్ల నియోజకవర్గాల్లో పాతవాళ్లు ఉండనే ఉన్నారు.

బాబు ప్రస్తుత లెక్కల ప్రకారం.. దాదాపు సగానికి పైన ఫిరాయింపుదార్లకు టికెట్‌లు లభించే అవకాశాలు లేవని స్పష్టం అవుతోంది. రాయలసీమలో అయితే.. ఫిరాయింపుదార్లలో ఎవ్వరికీ బాబు టికెట్‌ ఇవ్వడని కూడా అంటున్నారు. పార్టీలో పనిచేసిన పాతవాళ్లకే అక్కడ బాబు ప్రాధాన్యతను ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఫిరాయింపుదార్ల విషయంలో బాబు వేరే ఫార్ములాను అమలు చేస్తున్నాడట. వారిని సదరు నియోజకవర్గంలో గాక మరో నియోజకవర్గానికి తోలడం.. అది కూడా అవకాశం, అవసరం ఉంటే.

జమ్మలమడుగు ఎమ్మెల్యేను కడప ఎంపీగా పోటీచేయించడం, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేను నంద్యాల ఎంపీగా పోటీచేయించడం.. నంద్యాల సిట్టింగ్‌ ఎంపీకి పంగనామాలే.. అలాగే కదిరి, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలోని ఇతర ఫిరాయింపుదారులు.. వీళ్లందరికీ బాబు పెద్దగా ప్రాధాన్యతను ఇచ్చే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. వీళ్లలో చాలా మందికి టికెట్‌లు దక్కవు, లేదా వారు కోరుతున్న వేరే నియోజకవర్గాల టికెట్లూ దక్కవు. వీరిలో ఎవరి మీదా చంద్రబాబుకు పెద్దగా ఆశలులేవని తెలుస్తోంది. మరి ఒకరా ఇద్దరా.. ఇరవై మందిపైగా ఫిరాయింపుదారులున్నారు. వారికి బాబు ప్రాధాన్యతను ఇవ్వకపోతే వారు ఊరికే ఉంటారా? అనేది శేష ప్రశ్న.

అటు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారన్న నలబైమంది సిట్టింగులు, ఇటు పదిహేనుమంది వరకూ ఫిరాయింపుదారులను.. ఇంతమంది ఎమ్మెల్యేలను బాబు పక్కనపెడితే.. వాళ్లలో మెజారిటీ మంది రెబల్స్‌గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ప్రకటనను ఇప్పుడప్పుడే చేపట్టడం లేదని.. తెలుగుదేశం వర్గాలు ఇస్తున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఇలాంటి రచ్చలున్న నియోజకవర్గాలు యాభై అరవై ఉన్నాయని అనుకున్నా.. మిగతా నియోజకవర్గాల జాబితాను అయినా విడుదల చేయొచ్చు కదా... అంటే, అలాచేస్తే పార్టీలో రభస రేగుతుందని అందుకే బాబు ఇప్పుడప్పుడే ఏ నియోజకవర్గం విషయంలో అయినా తేల్చేసేది ఏమీ ఉండదని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానించాయి.

జగన్‌ ఎందుకు తేల్చేయలేకపోతున్నాడు..?
పార్టీ ఇన్‌చార్జిల బలాబలాలను, వారి బలహీనతలను చాలాదగ్గర నుంచి గమనిస్తున్నాడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత. పాదయాత్రతో జగన్‌కు ఈ అవకాశం ఏర్పడింది. వందకు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కోదాంట్లో మూడు నాలుగురోజుల పాటు గడిపాడు జగన్‌ మోహన్‌ రెడ్డి. ఫలితంగా వాటిల్లోని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు, గత ఎన్నికల్లో ఓడినవారి పరిస్థితుల విషయంలో జగన్‌ ఒక అంచనాకు వచ్చాడు. వారి శక్తియుక్తులను పరిశీలించాడు. ఇలాంటి నేపథ్యంలో కొన్నిచోట్ల ఇన్‌చార్జిల మార్పుకు కూడా జగన్‌ మోహన్‌రెడ్డి వెనుకాడటం లేదు. ఈ మార్పుచేర్పులు వైసీపీలో గందరగోళానికి తావిస్తున్నాయి.

ముందుగా సిట్టింగుల విషయానికి వస్తే.. తనవైపు మిగిలన నలభై మందికిపైగా ఎమ్మెల్యేల్లో దాదాపు అందరికీ జగన్‌ టికెట్లు కేటాయించే అవకాశాలున్నాయి. సెంటిమెంటల్‌గా తీసుకోవచ్చు..వారిపై జగన్‌కు ప్రేమాప్యాయతలు అనుకోవచ్చు.. తనతో పాటు వాళ్లంతా ఇబ్బంది పడ్డారనే భావన కావొచ్చు.. వైసీపీలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేల మార్పు ఉండకపోవచ్చని తెలుస్తోంది. మరీ తనకు అతి సన్నిహితులైన వాళ్లను మరోచోటికి పంపించి.. మార్చడమే తప్ప.. కావాలని మార్చే సిట్టింగులు మాత్రం ఎవరూ ఉండరు.

ఇక చాలా నియోజకవర్గాల్లో వైసీపీకి కొత్త ఇన్‌చార్జిలు వచ్చారు, కొందరు కాంగ్రెస్‌ మాజీలు వచ్చిచేరారు, మరి కొన్నిచోట్ల గత ఎన్నికల్లో ఓడిన సిట్టింగులు ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున 2009 ఎన్నికల్లో నెగ్గి, 2014 సమయంలో వైసీపీలోకి వచ్చి.. ఓడిన వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. ఈ కేటగిరిలోని వారు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు... వీరు ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్చార్జిలుగా కొనసాగారు. వీరికీ జగన్‌ ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నాడు. వీరి వీరి నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతలు కూడా ఎవరూ ఎదగలేదు. ఫలితంగా ఇలాంటి వారికీ టికెట్‌లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే జగన్‌ కొన్ని అనూహ్య మార్పులూ చేస్తున్నాడు. ఈ దఫా తెలుగుదేశాన్ని ఎదుర్కొనాలంటే అభ్యర్థుల ఆర్థికశక్తి కూడా ప్రధానమే అనే విషయం స్పష్టం అవుతోంది. ప్రత్యేకించి కొన్ని నియోజకవర్గాల్లో ఆర్థికశక్తి ఉన్న వాళ్లకు కూడా జగన్‌ ప్రాధాన్యతను ఇస్తున్నాడని స్పష్టం అవుతోంది. అలాగని.. ఆర్థికశక్తి ఉందన్న వాళ్లకు టికెట్లు ఖాయం అనే పరిస్థితి కూడా వైసీపీలో కనిపించడం లేదు. అలాంటి పరిణామాలూ చోటు చేసుకుంటున్నాయి. ఒక జిల్లాలో ఒక నియోజకవర్గంలో ఆర్థికశక్తి బాగా ఉన్న ఒక మహిళకు జగన్‌ అనూహ్యంగా అభ్యర్థిత్వాన్ని ఇచ్చాడు. ఆ మార్పు బాగా చర్చనీయాంశంగా నిలిచింది కూడా.

ఇక మరో జిల్లాలో ఒక నియోజకవర్గంలో భారీగా ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉన్న ఎన్‌ఆర్‌ఐకి కూడా టికెట్‌ ఖాయం అనే భరోసాను జగన్‌ ఇవ్వడంలేదు. ఆ నియోజకవర్గాన్ని హోల్డ్‌లో పెట్టినట్టుగా తెలుస్తోంది. కేవలం ఆర్థికశక్తి ఉన్నవాళ్లకే టికెట్‌ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అని చెప్పేందుకు ఈ ఊదాహరణను పరిగణనలోకి తీసుకోవచ్చు. పాదయాత్రలో అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను జగన్‌ ఖరారు చేశాడు. కర్నూలుజిల్లా పత్తికొండ అభ్యర్థిని తన తొలి అభ్యర్థిగా జగన్‌ ప్రకటించాడు. ఆ తర్వాత రాజమండ్రి ఎంపీ అభ్యర్థిని కూడా ప్రకటించాడు.

విజయనగరం వైసీపీ అభ్యర్థిగా కొలగట్ల వీరభద్రస్వామిని జగన్‌ ప్రకటించాడు. కుప్పం అభ్యర్థిని ప్రకటించాడు. ఇలా కనీసం పదిసీట్ల వరకూ జగన్‌ అభ్యర్థులను దాదాపు ఖరారు చేశాడు. అయితే ఒకరిద్దరు ఇన్‌చార్జిలు ఉన్న నియోజకవర్గాలు, ఇప్పటివరకూ పనిచేసిన వారిని పక్కన పెట్టేస్తారు.. అనే ఊహాగానాలున్న నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. వాటి విషయంలో తేల్చేయడం మాత్రం జగన్‌కు కూడా ఇంకా సాధ్యం కావడంలేదు. సంక్రాంతి తర్వాత పక్షంరోజుల్లో జగన్‌ బస్సు యాత్రను చేపట్టనున్నాడు. ఆ సందర్భంగా కూడా జనం మధ్యన పలువురు అభ్యర్థుల పేర్లను జగన్‌ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జనసేన బిందాస్‌..!
అభ్యర్థుల ప్రకటన గురించి పవన్‌కల్యాణ్‌ పెద్దగా కసరత్తు చేస్తున్న దాఖలాలు ఏమీ కనిపించడం లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒక్కోజిల్లా వాళ్లనూ పవన్‌ పిలిపించుకుని మాట్లాడుతున్నాడు! ఆయా జిల్లాలకు వెళ్లే తీరిక పవన్‌లో కనిపించడం లేదు. ఇంకా పిలిపించుకుని మాట్లాడే దశల్లోనే ఉంది జనసేనపార్టీ. తెలుగుదేశం, వైఎస్సార్సీపీలు అభ్యర్థుల ప్రకటన చేశాకా... తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని పవన్‌ అనడం కూడా ప్రహసనమే. ఆ పార్టీల్లో టికెట్లు దక్కక అసంతప్తికి గురిఅయ్యే వారిని తెచ్చుకుని పోటీచేయిద్దామని పవన్‌ అనుకుంటున్నట్టుగా ఉన్నాడు. ఇప్పటివరకూ జనసేన ఎన్నికల కసరత్తును గమనిస్తే.. గోదావరి జిల్లాల ఆవల ఇది ఆటలో అరటిపండే అవుతుందనే పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

కేసీఆర్‌లా చంద్రబాబుకు చేయలేడా!
నలభైమంది టీడీపీ సిట్టింగులను మార్చాలి, ఫిరాయింపుదారులను ఏ మార్చాలి.. ఇదీ చంద్రబాబు నాయుడి ఎన్నికల ప్రణాళిక. ఒకవైపు తన పాలనపై ఎనభైశాతం మంది ప్రజలు హ్యాపీగా ఉన్నారని బాబు చెప్పుకొంటూ.. మరోవైపు ఇలా అభ్యర్థుల మార్పు గురించి కసరత్తు చేస్తున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని తెలిసి కూడా వారిని మార్చలేదు. ఎందుకంటే.. తన ప్రభుత్వంపై ఫీల్‌ గుడ్‌ ప్యాక్టర్‌ ఉందనేది కేసీఆర్‌ లెక్క. అభ్యర్థులను మార్చడం అంటే.. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ఒప్పుకోవడమే. అది లేదని చెప్పడానికే కేసీఆర్‌ సిట్టింగులందరినీ యథాతథంగా పోటీచేయించి గెలిచాడు. చంద్రబాబు మాత్రం తన పాలనపై వ్యతిరేకత లేదంటూనే.. సిట్టింగులను మార్చేసే యత్నంలో ఉన్నాడు. ఇదీ తేడా!
- బి.జీవన్‌రెడ్డి

ఎన్టీఆర్ బయోపిక్ః ఒకవైపే చూడు..!

Show comments