అవును ఐదేళ్లు నిద్రపోయాం.. ఒప్పుకున్న బాబు

అదేదో మల్టీనేషనల్ కంపెనీ అంట. అది కానీ రాష్ట్రంలోకి వస్తే నిరుద్యోగ సమస్యే ఉండేది కాదంట. దాని కోసం చంద్రబాబు ఐదేళ్లు కష్టపడి బతిమాలి, బామాలి, సంప్రదింపులు జరిపి ఒప్పించుకుని వస్తే, ఐదు నెలల్లో జగన్ సర్కారు దాన్ని తన్ని తరిమేసిందట. ఇదీ లూలూ అనే గ్రూప్ పేరు చెప్పుకుని టీడీపీ చేస్తున్న ప్రచారం. అంత మంచి కంపెనీ అయినప్పుడు చంద్రబాబు ఐదేళ్లుగా ఎక్కడ నిద్రపోతున్నారు. తన హయాంలోనే రాష్ట్రంలో ఆ సంస్థ కార్యకలాపాలు సాగించేలా చేయొచ్చు కదా. దానికి మాత్రం సమాధానం ఉండదు.

ఇక మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఆ వర్గాన్ని ఎస్టీల్లో చేర్చాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కనీసం ఇలా మాట్లాడ్డానికి మాజీ ముఖ్యమంత్రికి సిగ్గేయడం లేదేమో. ఐదేళ్లు అధికారం వెలగబెట్టి, ఇప్పుడు మత్స్యకారుల తరపున డిమాండ్ వినిపిస్తున్న చంద్రబాబును.. నువ్వేం చేశావని ఎవరైనా ప్రశ్నిస్తే మొహం ఎక్కడ పెట్టుకుంటారో..? ఇదే కాదు, పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారని అంటారు, అమరావతి సంగతేం చేశారని అడుగుతారు, ఐదేళ్లు తాను చేయలేని పనులన్నీ జగన్ సర్కారు ఐదు నెలల్లో పూర్తి చేయాలని, లేకపోతే అసమర్థులని ఒప్పుకోవాలని డిమాండ్ చేస్తుంటారు చంద్రబాబు.

మెదడు మోకాల్లోకి వచ్చినప్పుడు ఇలానే మాట్లాడుతుంటారు మేథావులు. సరిగ్గా ఇప్పుడు చంద్రబాబు అదే పని చేస్తున్నారు. ఐదేళ్లలో తాము ఏ పనీ చేయలేదని పరోక్షంగా ఒప్పుకుంటున్నారు. ఒకవేళ నిజంగానే చంద్రబాబు గత ఐదేళ్లలో పనిచేసి ఉంటే.. ఈ పాటికే పోలవరం పూర్తయ్యేది, అమరావతిలో నిర్మాణాలు(తాత్కాలికం కాదు శాశ్వత) సగం పూర్తయి ఉండేవి. రాష్ట్రంలో అసంపూర్తిగా మిగిలిన ప్రాజెక్ట్ లు, నిర్మాణాలు.. ఓ కొలిక్కి వచ్చి ఉండేవి.

ప్రజలకు ఆర్థిక సాయం చేసే విషయంలో చంద్రబాబు ఎంత జిడ్డో.. రైతు రుణమాఫీ విషయంలోనే తేలిపోయింది. రుణమాఫీ చేయడానికి చంద్రబాబుకి ఐదేళ్లు సరిపోలేదు, ఆఖరి విడత జగన్ పై నెట్టేసి తప్పించుకోవాలని చూశారు. ఇలా ఏ పనీ పూర్తి చేయకుండా.. కమీషన్లతో కాలం నెట్టుకొచ్చి, ఇప్పుడు జగన్ పై పడి ఏడిస్తే ఏం లాభం. ఐదేళ్ల తన అసమర్థతను చంద్రబాబు ఒక్కొక్కటిగా ఒప్పుకుంటున్నట్టేగా..! 

Show comments