చంద్రబాబు ఓటమి ఒప్పుకున్నట్టేనా..?

అధికారం ఇంకా తన చేతిలోనే ఉంది. ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే అధికారులూ చెప్పు చేతల్లోనే ఉన్నారు. అయినా సరే చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. మరీ మితిమీరి ప్రవర్తించిన చోట అధికారుల్ని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేస్తే అది కూడా నేరమైనట్టు నానా హంగామా చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ద్వివేదీతో చంద్రబాబు మాట్లాడిన తీరు చూస్తే ఆయన తన ఓటమిని అంగీకరించినట్టు తేటతెల్లమవుతోంది.

ఐటీదాడులు, అధికారుల బదిలీలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని వచ్చిన చంద్రబాబు.. అంతటితో ఆగలేదు. అంతా మీ ఇష్టారాజ్యం అయిపోయిందంటూ నిప్పులుతొక్కిన కోతిలా చిందులేశారు. చంద్రబాబులో ఫ్రస్టేషన్ పీక్ స్టేజ్ కి వెళ్లిపోయిందనడానికి ఇది తాజా ఉదాహరణ.

ఇప్పటికే ప్రీపోల్ సర్వేలన్నీ బాబుకి ఎదురుగాలి వీస్తోందని స్పష్టం చేశాయి. మరోవైపు శిఖండిలా అడ్డం పెట్టుకోవాలనుకున్న పవన్ కల్యాణ్ కూడా తేలిపోయారు. పవన్ కి ఓటేస్తే చంద్రబాబుకి మద్దతు తెలిపినట్టేనని వైసీపీ చేసిన ప్రచారం జనాలను ఆలోచింప చేస్తోంది. దీంతో వార్ వన్ సైడ్ అని అర్థమయ్యే సరికి చంద్రబాబులో ఉలికిపాటు ఎక్కువైంది. అందుకే ఎన్నికల కమిషనర్ ముందు ఆగ్రహంతో ఊగిపోయారు బాబు.

అసలు చంద్రబాబుకి ఉద్యోగులంటేనే చులకనభావం ఎక్కువ. కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు తన తాబేదారుల్లా పనిచేయాలని, వారికి జీతాలిచ్చి పోషిస్తోంది తానేననే భావం బాబులో కనపడుతుంది. అందుకే ఈసీపై కూడా తన జులుం ప్రదర్శించాలని చూశారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన బాబు-ఈసీ సంభాషణ వీడియో టీడీపీకి ఓట్లకు గణనీయంగా గండికొడుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

విద్యావంతులు, ఉద్యోగస్తులు చంద్రబాబు వైఖరిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఒకరకంగా బాబు ఓటమిని అంగీకరించారు, అదే సమయంలో తన గౌరవాన్ని తానే దిగజార్చుకున్నారు. 

Show comments