రాహుల్ సభకు చంద్రబాబు భరోసా

రాష్ట్రంలో రాజకీయ అవసరాల కోసం విడివిడిగా పోటీచేస్తాం, కేంద్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ తో జట్టుకడతాం.. ఢిల్లీ దీక్షలో చంద్రబాబు చెప్పిన మాటలివి. తెలంగాణ ఫలితాలతో తలబొప్పి కట్టడంతో కాంగ్రెస్ తో దోస్తీకి బాబు భయపడ్డారు. అదే సమయంలో కేంద్రంలో బీజేపీ వ్యతిరేక కూటమిని కూడగట్టడంలో భాగంగా కాంగ్రెస్ తో కలసి నడుస్తున్నారు.

రాష్ట్రంలో మాత్రం పొత్తులేదని చెబుతున్న చంద్రబాబు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడానికి కాంగ్రెస్ నాయకులను వాడుకోవాలనుకుంటున్నారు. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ నేతలకు ఎలక్షన్ ఫండ్ సర్దుబాటు చేస్తానని హామీలు కూడా ఇచ్చేశారు. అంతేకాదు, తాజాగా రాహుల్ గాంధీ సభకు చంద్రబాబే జనసమీకరణ చేస్తానని మాటిచ్చారట.

రేపు తిరుపతిలో రాహుల్ సభ జరగనుంది. దీనికోసం ఇప్పటికే చంద్రబాబు స్థానిక నాయకులకు చెప్పి ఏర్పాట్లు చూసుకోమన్నారు. టీడీపీ పేరు బయటకురాకుండా కాంగ్రెస్ సభకు జనాల్ని తరలించాలని ఆదేశించారు. ఈ సభకు ముందస్తుగా రాష్ట్రంలో ప్రత్యేకహోదా భరోసా యాత్ర చేపట్టారు కాంగ్రెస్ నేతలు. ఈ యాత్రకు కూడా చంద్రబాబు అండగా నిలిచారని సమాచారం.

ప్రత్యేకహోదా విషయంలో కేవలం బీజేపీని మాత్రమే దోషిగా చిత్రీకరించేందుకు బాబు ఇలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీకి తోడుగా వైసీపీ, టీఆర్ఎస్ కి కూడా హోదా మకిలి అంటగడుతున్నారు. అంతా చేస్తున్న చంద్రబాబు తాను మాత్రం రాష్ట్రాన్ని విభజించి ఏపీ ప్రజలకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ తో జట్టుకట్టడాన్ని సమర్థించుకుంటున్నారు.

2014 ఎన్నికల్లో రాష్ట్రంలో చచ్చిపోయిన కాంగ్రెస్ కి తిరిగి జీవం పోసేందుకు సాహసిస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ కి సపోర్ట్ చేసినట్టే చేసి, తన పబ్బం గడుపుకోవడమే చంద్రబాబు ప్లాన్. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడంతో పాటు, కేంద్రంలో తనకి అండగా ఉంటుందని కాంగ్రెస్ తో అంటకాగుతున్నారు.

అందుకే మొన్న మోడీ వచ్చినప్పుడు గో బ్యాక్ మోడీ అంటూ హోర్డింగ్ లు పెట్టించిన బాబు.. ఇప్పుడు అదే చేతితో జై కాంగ్రెస్ అంటూ రాహుల్ బ్యానర్లు తగిలిస్తున్నారు. బాబు రాజకీయం అంటే ఇదే!

రాయలసీమ రైతుల పుండుపై కారం

Show comments