ఢిల్లీ దీక్ష.. దటీజ్ చంద్రబాబు నాయుడు!

వారితో అవసరం లేదు అని అనుకుంటే.. వాళ్ల గురించి వక్రంగా మాట్లాడటం, వాళ్లతో అవసరం ఏర్పడితే ఇలా వ్యవహరించడం.. ఎవరి విషయంలో అయినా చంద్రబాబు నాయుడిది ఇదే తీరు అంటూ ఉంటారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ దగ్గర నుంచి ఎవరితో అయినా, ఏ విషయంలో అయినా తనకు అవసరం ఉంటే ఒకలా, తనకు అవసరం తీరితే మరోలా మాట్లాడటానికి చంద్రబాబు నాయుడు ఏమాత్రం వెనుకాడే వ్యక్తి కాదు అని ఆయన చరిత్రే చెబుతూ ఉంది.

ఇలాంటి పరంపరలో ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేపట్టిన దీక్షలో కూడా కొన్ని సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. అసలుకు ఈ దీక్షే పెద్ద జోక్. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అవసరం లేదు అని వాదించిన వ్యక్తి చంద్రబాబు. ఏ ఎల్లయ్యో.. పుల్లయ్యో అలా వాదించి ఇప్పుడు హోదా కావాలని అంటే అది వేరే. స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో కూర్చుని చంద్రబాబు నాయుడు అలా వాదించారు.

హోదా సంజీవని కాదు అని, హోదాతో ఏమీరాదని, హోదాకు మించి సాధించినట్టుగా, హోదా అనేవాళ్లకు ఏమీ తెలియదని, హోదా అంటే జైలుకే అని.. కూడా హెచ్చరించిన వ్యక్తి సీఎం చంద్రబాబు. మోడీతో అధికారాన్ని పంచుకున్నంతసేపూ బాబు అలా వాదించారు. ఇప్పుడు నాలుక మడతేశారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజలను మోసంచేసే మరో వ్యవహారాన్ని మొదలుపెట్టినట్టుగా ఉన్నారు. గత ఎన్నికల ముందుకు, ఎన్నికల తర్వాతకూ చంద్రబాబు మాటల్లోని తేడా అందరికీ తెలిసిందే. రేపు కూడా ఇదే జరగదనే నమ్మకాలు ఏమీలేవు కదా.

ఇక బాబుగారి దీక్షా శిబిరానికి కాంగ్రెస్ పార్టీ తమ తురుపుముక్కలను పంపించింది. వారిలో మన్మోహన్ కూడా ఒకరు. ఈయన ప్రధానిగా ఉండగానే ఏపీ విభజన జరిగింది. విభజన అసంబద్ధమని ఈ మేధావికి కూడా అప్పుడు అనిపించలేదు. ఆ సంగతలా ఉంటే.. బాబుగారు మన్మోహన్ పక్కన ఇలా పోజులు ఇస్తూఉంటే, గతంలో బాబు ఈయనను తిట్టిన తిట్లు గుర్తుకు వస్తున్నాయి.

మన్మోహన్ ను చాలా హీనంగా మాట్లాడారు చంద్రబాబు. ఆయన ప్రధాని హోదాలో ఉన్నారని కూడా చూసుకోకుండా..’ దొడ్డిదారిన ప్రధాని అయిన వ్యక్తి ఆయన.. ఆయన ప్రధానిగా ఉండగా.. పీఎంవోకు వెళ్లే ప్రసక్తి లేదు, మన్మోహన్ ను కలిసే ప్రసక్తిలేదు..’అని బాబు మన్మోహన్ దూషించారప్పట్లో.

రాజ్యసభ సభ్యత్వంతో మన్మోహన్ పీఎం కావడాన్ని బాబు అలా తప్పుపట్టాడు. ఆ తర్వాత ఈయనే తన కొడక్కు, పుట్టు మేధావి లోకేష్ కు ఎమ్మెల్సీగా మంత్రిపదవి ఇచ్చారనుకోండి. అప్పుడంతా మన్మోహన్ ను అంతలా కించపరిచే మాటలు మాట్లాడి, అది కూడా అర్థంలేని విమర్శలు ఆయన మీద చేసి.. ఇప్పుడు ఆయన రాగానే బాబు సాగిలా పడిపోయారు.

అతి వినయాన్ని కనబరిచారు. దటీజ్ చంద్రబాబు! అయినా ‘పనికిరానివాడు..’ అని తనే వ్యాఖ్యానించిన రాహుల్ కే శాలువాలు కప్పుతున్న బాబుకు మన్మోహన్ విషయంలో తన రూటు మార్చేయడం పెద్దకథేం కాదేమో!