బాబుగారికి.. అద్దెకు ఇల్లు కావలెను

కృష్ణానదీ తీరంలో అద్భుతమైన ఇల్లు. ప్రత్యేకంగా జెట్టీ. నేరుగా నదిలో విహారానికి వెళ్లొచ్చు. కానీ ఏం లాభం. అద్దె ఇల్లు. అద్దె చెల్లించేది ప్రభుత్వమే కావచ్చు. కానీ ఇప్పుడు దాన్ని ఖాళీ చేసి, వేరేగా అద్దె ఇంట్లోకి వెళ్లాల్సి వస్తోంది. కారణం అది కృష్ణానది కరకట్ట మీద కట్టిన అక్రమ కట్టడం కావడమే.

వాస్తవానికి బాబుగారు ఆ ఇంట్లోకి వెళ్లడానికి ముందు నుంచే అది అక్రమ కట్టడం అని గడబిడ వుంది. అలా వున్నపుడు ముఖ్యమంత్రి హోదాలో ఆ ఇంట్లోకి వెళ్లడం అన్నది ముమ్మాటికీ తప్పే. ప్రభుత్వమే అద్దెకు తీసుకుని, అద్దె చెల్లిస్తే, అక్రమ కట్టడం సక్రమం అయిపోయే పరిస్థితి వుంది.

ఇలాంటి నేపథ్యంలో బాబుగారి పార్టీ ఓడిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చింది. ముందస్తు చర్యగా ప్రజా వేదికను కూలగొట్టింది. ప్రజావేదిక అన్నది పైన పటారం లోన లోటారం అన్నట్లు. కేవలం అది ఓ అతి పెద్ద రేకుల షెడ్డు. దానికి బయట ఎలివేషన్. లోపల్ డెకరేషన్.

సరే ఆ సంగతి అలావుంచితే, ప్రజావేదిక తరువాతి టార్గెట్ బాబుగారి అద్దె ఇల్లే అని టాక్ వినిపిస్తోంది. కోర్టులో కాలయాపన అయితే జరుగుతుందేమో కానీ, అక్రమ కట్టడం సక్రమమని తీర్పు వచ్చే అవకాశం తక్కువ. ఇలాంటి నేపథ్యంలో ఇక ఆ ఇంట్లో వుండడం అంత మంచిది కాదు అన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

ఈ మేరకు పార్టీ కీలక నేతలు కొందరికీ ఈ పని అప్పగించినట్లు తెలుస్తోంది. గుంటూరు-అమరావతి ప్రాంతంలోని మాంచి లోకేషన్ లో ఇల్లు కావాలని, అవసరం అయినపుడు సులువుగా ఎయిర్ పోర్టుకు అమరావతికి సులువుగా వెళ్లడానికి వీలుగా వుండే లొకేషన్ అయితే బెటర్ అని సూచన ఇచ్చినట్లు బోగట్టా.

అన్నీ బాగానే వున్నాయి. అయిదేళ్ల పాలనా కాలంలో ఓ స్వంత ఇల్లు నిర్మించుకుని వుంటే ఇప్పుడు ఇబ్బంది వుండేది కాదు కదా? బాబుగారి ఫ్యామిలీకి వున్న ఆర్థిక స్తోమత లెక్కలో చూస్తే ఇల్లు అన్నది పెద్ద సమస్యే కాదు కూడా. కానీ బాబుగారు ఆ దిశగా ఎందుకు ఆలోచించలేదో? బహుశా తనే ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతానని అనుకుని ధీమాపడి వుంటారు.

తెలుగుదేశం కథ ముగిసిందా?.. బడాయికి పోతున్న బీజేపీ

Show comments