మళ్లీ బీజేపీకి కన్నుగీటుతున్న చంద్రబాబు!

అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు. ఆయన అనుకుంటే ఏమైనా చేయగలడు. ఒకవైపు జాతీయ మీడియా సర్వేలన్నీ.. మళ్లీ ఎన్డీయేదే రాజ్యం అని చెబుతున్నాయి. కొన్ని సీట్లు తక్కువ  పడొచ్చు గాక.. కమలం పార్టీనే మళ్లీ అధికారానికి దగ్గర అవుతుందని, ఎన్డీయేకు ఏవైనా ఒకటీ రెండు ప్రాంతీయ పార్టీలు సహకారం అందించినా.. మళ్లీ ఆ కూటమే అధికారం సాధించవచ్చు అని అవి అంచనా వేస్తున్నాయి.

అది కూడా యూపీలో ఎస్పీ-బీఎస్పీల పొత్తును జనాలు ఆమోదిస్తే మాత్రమే బీజేపీకి కొన్ని సీట్లు తగ్గుతాయి. ఒకవేళ ఆ పొత్తును చూసి జనాలు బీజేపీ మీద కాస్త జాలి పడితే.. కమలం పార్టీ మినిమం మెజారిటీ దగ్గరకు రావడం పెద్ద కథ ఏం కాదని జాతీయ మీడియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

సూటిగా చెప్పాలంటే.. రాహుల్ ఇప్పటి వరకూ ఉత్తరాదిన నమ్మకాన్ని కలిగించలేకపోతున్నాడు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ లలో కూడా ఎవరూ రాహుల్ ను చూసి ఓటు వేయలేదు. రేపు మోడీ వర్సెస్ రాహుల్ అన్నట్టుగా పోరాటం సాగితే.. ఈ రాష్ట్రాల ప్రజలు కూడా తిరిగి మోడీకే మద్దతు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయని క్షేత్ర స్థాయిలో అధ్యయనాలు చేసిన వాళ్లు కుండబద్ధలు కొడుతున్నారు.

ఇంకేముంది.. మోడీపై వ్యతిరేకత ప్రబల స్థాయిలో ఉందనుకుని.. కాంగ్రెస్ కూటమి వచ్చేస్తుందనే లెక్కతో అటు గెంతిన చంద్రబాబు మళ్లీ కమలం పార్టీకి కన్ను గీటుతున్నాడని సమాచారం. ఎన్డీయేకు ఎలాగూ కొన్ని సీట్లు తక్కువ వచ్చే అవకాశాలున్నాయని అంతా అంటున్నారు కాబట్టి.. అలాంటి పరిస్థితి వస్తే తను ఉన్నాననే విషయాన్ని మరవొద్దు అని చంద్రబాబు నాయుడు తనకు ఇప్పటికీ సన్నిహితులైన కొంతమంది కమలం పార్టీ వాళ్లకు వర్తమానం అందిస్తున్నాడట.

ఎన్డీయే నుంచి బయటకు వచ్చినా.. బాబుకు దోస్తానాలు అక్కడ చాలా మందే ఉన్నారు. కొంతమంది బాబాలకు ఏపీలో ఇబ్బడిముబ్బడిగా చంద్రబాబు నాయడు భూ కేటాయింపులు చేశాడు కూడా. అలాంటి వారితో వర్తమానాలు పంపుతున్నట్టుగా టాక్.ఇదే సమయంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీలో కలిసి పోటీ చేయడం లేదని కూడా బాబు చెబుతున్నాడట. ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదని… వారికి భరోసాను ఇస్తున్నాడట. 

ఇటీవలే రాహుల్ గాంధీని కలిసి కూడా బాబు ఇదే మాటే చెప్పాడట. ఏపీలో పొత్తు వద్దని.. ఎన్నికల తర్వాత మీకే మద్దతు అని బాబు రాహుల్ కు చెప్పాడట. ఎన్నికల తర్వాత మీకే మద్దతు అని కమలనాథులకు కూడా బాబు వర్తమానాలు అందుతున్నాయని టాక్. ఇలా కాంగ్రెస్, బీజేపీలను లైన్లో పెట్టి.. ఎన్నికల తర్వాత ఎటు దూకడానికి అయినా బాబు రెడీ అవుతున్నాడు. 

ఎలాగూ బాబు ఆడే ఇలాంటి డబుల్  గేమ్స్ ను కవర్ చేయడానికి ఆయన అనుకూల మీడియా వర్గాలు ఉండనే ఉన్నాయి కదా. బాబు ఏం చేసినా ‘దేశ ప్రయోజనాల కోసమే..’అని అవి నొక్కివక్కాణిస్తాయి కదా. ఇంకేముందీ.. బిందాస్!

తేలని అభ్యర్థుల ఎంపిక.. పవన్ కల్యాణ్ పనే హాయి!

NTR బయోపిక్ గురించి తెలియని విషయాలు

Show comments