చంద్రబాబు వంచనలు గుర్తున్నాయా?

మరికొన్ని గంటల్లో కీలకమైన పోలింగ్ మొదలుకానుంది. రాబోయే ఐదు సంవత్సరాల ఏపీ భవితవ్యాన్ని నిర్దేశించే ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ప్రచారానికి ఈరోజు ముగింపు అయినా ప్రలోభాల పర్వం కొనసాగుతూ ఉంది. ఈ ప్రలోభాలే ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయా? లేక ఐదేళ్ల పాలనపై ప్రజాతీర్పు రాబోతోందా? అనేది ఎన్నికల ఫలితాలు వస్తేకానీ చెప్పలేం.

అత్యంత కీలకమైన రోజున ఐదేళ్ల పాలనను విశ్లేషిస్తే.. మొత్తం మోసం, దగాతప్ప మరోటి కనపడదు. ఐదేళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాల గురించి ఆలోచించినా మోసమే కనిపిస్తూ ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా దోపిడీ మామూలే అనేది స్థిరపడిన జనాభిప్రాయం. ఆ సంగతిని పక్కనపెడితే.. చంద్రబాబు నాయుడు అత్యంత కపటంతో వ్యవహరించి.. రాష్ట్రానికి కూడా పంగనామాలు పెట్టిన వైనాన్ని ఇప్పుడు వివరించుకోవచ్చు. బహుశా ఇంతకు మించిన సందర్భం ఏమీ ఉండదు కూడా.

ఐదేళ్ల కిందట రాష్ట్రానికి ప్రత్యేకహోదా అత్యంత కీలకమైన ఎన్నికల అజెండాగా నిలిచింది. అయితే.. తీరా అధికారం చేతికి దక్కాకా మాత్రం చంద్రబాబు నాయుడు ఆ అంశంతో ఆటాడుకున్నారు. బీజేపీతో స్నేహం కావాలని అనుకున్న రోజులంతా ‘హోదా అవసరంలేదు.. హోదాతో ఏమీరాదు.. హోదా సంజీవని కాదు..’ అని అనిపించింది చంద్రబాబు నాయుడుకు. నాలుగున్నరేళ్ల పాటు అలా రాష్ట్రానికి మోసంచేసి.. బాబు తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్త మోసాన్ని మొదలుపెట్టారు.

బీజేపీ గ్రాఫ్ పడుతోందనే లెక్కలతో.. బాబుకు ఒక్కసారిగా హోదా గుర్తుకు వచ్చింది. ‘హోదా వద్దు.. హోదాకు మించిన ప్యాకేజీ దక్కింది’ అని చెప్పిన నోటితోనే.. ‘హోదా విషయంలో బీజేపీ మోసం చేసింది’ అని మొదలుపెట్టారాయన. మోసం చేసింది ఎవరో ప్రజలు అర్థం చేసుకోలేరు అనేది చంద్రబాబు నాయుడి లెక్కకావొచ్చు.

ఒకవేళ చంద్రబాబు నాయుడుకు మళ్లీ అధికారం దక్కితే.. మళ్లీ మోసమే చేసే అవకాశాలున్నాయని స్పష్టం అవుతోంది. అత్యంత కీలక సమయంలో.. అత్యంత కీలకమైన విషయంలో నిర్భీతిగా మోసంచేసిన వ్యక్తికి, మోసపూర్వకమైన మాటలు మాట్లాడిన వ్యక్తికి.. అలాచేసిన తర్వాత కూడా అధికారం మళ్లీ దక్కితే.. మళ్లీ మరే మోసం చేయడానికి కూడా వెనుకాడరు అని విశ్లేషకులు స్పష్టం చెబుతున్నారు. ఇక ఆలోచించుకోవాల్సింది ఏపీ ప్రజలే!

చివరికి పవన్ కల్యాణ్ కథ ఇదీ!

Show comments