వరదొచ్చింది.. ఎల్లో మీడియాకు పండగొచ్చింది!

రాష్ట్రానికి వరదలొచ్చాయి. ఇక్కడ వర్షాలు పడకపోయినా కష్టాలు మన రాష్ట్రానికి కొట్టుకుని వచ్చాయి. పంటలన్నీ నీటమునిగాయి. దాదాపు 32 మండలాల ప్రజలు ప్రత్యక్షంగా ముంపుబారిన పడ్డారు. ఇలాంటి టైమ్ లో ప్రజల కష్టాలు పట్టకుండా సీఎం జగన్ అమెరికా పర్యటనకు వెళ్లారంటూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి పర్యటన పూర్తిగా వ్యక్తిగతం, అది కూడా నెలరోజుల ముందే ఫిక్స్ అయింది. అయినా ముఖ్యమంత్రి లేకపోయినా, మంత్రులతో పాటు యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. మరోవైపు అమెరికా నుంచి సీఎం కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఎల్లో మీడియాకు మాత్రం ఇదిపట్టదు. వరదల టైమ్ లో జగన్ అమెరికాలో ఉన్నారనేదే వీళ్ల కాన్సెప్ట్.

వైసీపీ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు ముంపు ప్రాంతాల వాసులకు అండగా నిలబడ్డారు. బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, పేర్ని నాని, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రముఖంగా వరద ప్రాంతాల్లో పర్యటించారు, పునరావాస కేంద్రాలకు అధికారులను వెంటబెట్టుకుని వెళ్లి మరీ బాధితులకు అండగా నిలబడ్డారు. ఎల్లో మీడియా ప్రచారం, సోషల్ మీడియాలో టీడీపీ ప్రచారం మరో రకంగా ఉంది. వరద ప్రాంతాలను మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోనట్టు.. కేవలం టీడీపీ నేతలు మాత్రమే వరదల్లో ఆహారం అందిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వరదల సమయంలో ముఖ్యమంత్రి అమెరికాలో ఏం చేస్తున్నారంటూ ప్రతిపక్షనేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్ని పదేపదే ప్రసారం చేస్తున్నారు.

చేసిన పనికి ప్రచారం ఎంత అవసరమో వైసీపీ నేతలకు ఇప్పుడు తెలిసొస్తోంది. వైసీపీ నేతలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నా దానికి తగినంత ప్రచారం దక్కడంలేదు. మీడియాలో ఎక్కువమంది బాబుకు అనుకూలం కాబట్టి, సహాయక చర్యల కంటే బాబు విమర్శలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితుల్లో చంద్రబాబు సీఎంగా ఉంటే ఆ ప్రచారం మరోలా ఉండేది. ముందుగా ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే, ఆ తర్వాత అధికారులతో ఓ సమీక్ష, అది అయిన వెంటనే ప్రెస్ మీట్, ఆ తర్వాత కేంద్రానికి ముంపు లెక్కలపై తక్షణ సాయం కోసం ఓ లేఖ, కేంద్రం స్పందించి, తప్పకుండా సాయం చేస్తామన్నట్టు ఓ రిప్లై ఇదంతా చకచకా జరిగేవి.

అధికారుల్ని ఉరుకులు పరుగులు పెట్టించేవారు. అమరావతిలో అప్పటికప్పుడే ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటయ్యేది. బాబు నిద్రాహారాలు మాని అక్కడే ఉన్నట్టు కలరింగ్ ఇచ్చేవారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త రంగులతో ఫ్లెక్సీలు వెలిసేవి. ఇలా హుద్ హుద్, తిత్లీ సమయాల్లో చంద్రబాబు చేసిన ఓవర్ యాక్షన్ అందరికీ గుర్తే. ఇలాంటి ఓవరాక్షన్ చేయడం వైసీపీ మంత్రుల వల్ల కావట్లేదు. వాళ్లు హంగామా కంటే చేతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. సరిగ్గా ఈ గ్యాప్ ను చంద్రబాబు క్యాష్ చేసుకుంటున్నారు. తన అనుకూల మీడియా సహాయంతో రెచ్చిపోతున్నారు.

జగన్ అమెరికా పర్యటన అడ్డం పెట్టుకుని మరీ వరదలతో బురద రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి దిక్కుమాలిన విమర్శలను వైసీపీ నేతలు సమర్థంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంత్రులందరూ సహాయక చర్యలతో పాటే.. ప్రతిపక్షాల విమర్శలను కూడా తిప్పికొట్టే బాధ్యత మూకుమ్మడిగా తీసుకోవాలి. మరీ ముఖ్యంగా జగన్ రాష్ట్రంలో లేని సమయంలో మంత్రులంతా బాబు విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.

‘బాహుబలి’ రికార్డ్స్ ను ‘సాహో’ అధిగమిస్తుందా?

Show comments