బాబోయ్‌ బాలయ్య.. బెదిరిపోతున్న తమ్ముళ్ళు.!

అది సినిమా వేదిక కావొచ్చు, రాజకీయ వేదిక కావొచ్చు.. నందమూరి బాలకృష్ణ 'మైక్‌' అందుకున్నారంటే అంతే సంగతులు. 'మైక్‌' పనైపోవాల్సిందే. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ తరఫున, మహాకూటమి (ప్రజాకూటమి) తరఫున ప్రచారంలో బిజీగా వున్న బాలయ్యకు కొన్నిచోట్ల జనం నీరాజనం పడుతున్నారు. ఇంకొన్ని చోట్ల బాలయ్య 'షో'కి తెలుగు తమ్ముళ్ళే బెదిరిపోతున్నారు. బాలయ్య ప్రసంగాలు అలా వుంటున్నాయ్‌ మరి.!

తాను నటించిన సినిమాల్లోని డైలాగులు అలవోకగా వల్లెవేసేస్తుంటారు బాలయ్య. పెద్ద పెద్ద డైలాగుల్ని గుర్తు పెట్టుకోవడమంటే చిన్న విషయం కాదు. కానీ, బాలయ్యకు అది అలవాటైపోయిన వ్యవహారం. బాలయ్యకు ఎంత అలవాటైపోయినాసరే, అవి ఇతరులకూ నచ్చాలి కదా.! సమయం, సందర్భం అనవసరం. బాలయ్య తన ప్రావీణ్యాన్ని బలవంతంగా రుద్దేసేందుకు ప్రయత్నిస్తారు.

సినిమా వేదికల సంగతి పక్కన పెడితే, రాజకీయ వేదికలపై బోర్‌ కొట్టించేస్తాయి ఆ తరహా డైలాగులు. తాజాగా నేడు కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలో బాలయ్యతో పలుచోట్ల రోడ్‌ షోలు, కార్నర్‌ మీటింగులు ఏర్పాటు చేశారు. ఇంకేముంది, బాలయ్య చెలరేగిపోయారు. తన పాండిత్యాన్నంతా ప్రదర్శించేసరికి.. తెలుగు తమ్ముళ్ళే విసిగిపోయారు.

కొంతమంది బాలయ్య డైలాగులు పేల్చుతోంటే నవ్వు ఆపుకోలేక, పక్కకు వెళ్ళి మరీ నవ్వుకోవాల్సి వచ్చింది. అన్నట్టు, కొన్నిచోట్ల బాలయ్య ప్రసంగాలు వినేందుకు జనం మొగ్గు చూపలేదు.. దాంతో బాలయ్య షోలు వెలవెలబోయాయి. ఏ మతానికో, ఏ కులానికో పుట్టిన పార్టీ కాదు, హైద్రాబాద్‌ నడిబొడ్డున పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ.. అంటూ బాలయ్య పేల్చిన పంచ్‌ డైలాగ్‌ మాత్రం ఈరోజు చాలా గట్టిగా పేలింది.

అది మినహాయిస్తే, 'కమ్మరి.. కుమ్మరి..' అంటూ ఓ సినిమాలో చెప్పిన డైలాగ్‌, ఇంకొన్ని సినిమా డైలాగులు అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ని హెచ్చరించడం, చంద్రబాబుని ఆకాశానికెత్తేయడం.. ఇవన్నీ బాలయ్య ప్రసంగాల్లో మామూలేననుకోండి.. అది వేరే విషయం.

మొత్తమ్మీద, టీడీపీ శ్రేణుల్లో కొంతమందికి బాలయ్య ప్రసంగాలు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తోంటే, ఇంకొందరికి అవి చికాకు పుట్టిస్తున్నాయి. 'పార్టీ అభాసుపాలైపోతోంది మొర్రో..' అని మరికొందరు తెలుగు తమ్ముళ్ళు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు.

టీడీపీ శ్రేణుల్లోనే పరిస్థితి ఇంతలా వుంటే, ప్రజా కూటమిలో మిగతా పార్టీలు బాలయ్య 'కామెడీ'తో ఇంకెంత విసిపోతుండాలి.!  

మంత్రిగారికి ఓటమి తప్పదు.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments