అయోమయం! చేతులెత్తేసిన పవన్‌ కల్యాణ్‌!

-బాబుతో మళ్లీ బేరం?!
-అయోమయంలో అభిమానులు
-పొత్తు పెట్టుకుంటే అంతే సంగతులు!
-ప్రజారాజ్యం కన్నా పేలవం అవుతున్న జనసేన!

అంతా అయోమయం.. పవన్‌ కల్యాణ్‌ రాజకీయం ఇప్పుడు క్రాస్‌ రోడ్స్‌లో నిలుస్తోంది. అటువైపు చూస్తే రెండునెలల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది. ఇటు వైపు చూస్తే ఇప్పటికీ జనసేనకు ఒక రూపం రాలేదు. క్షేత్రస్థాయిలో బలపడటం సంగతలా ఉంచితే.. ఏపీలో కనీసం చెప్పుకోగదగిన స్థాయిలో కూడా జనసేనకు ఇన్‌చార్జిలు లేరు. కొన్ని నియోజకవర్గాలకు ఉన్నా.. వాళ్ల కథలేంటో స్థానికులకు బాగాతెలుసు. ఇంతలో.. చంద్రబాబు నాయుడి పొత్తు పిలుపు! పొత్తులేదు.. అని పవన్‌ అంటున్నా.. ఎందుకో ఇంకా పూర్తిగా నమ్మకం కలగడంలేదు. ఒకరకంగా చూస్తే.. పవన్‌ కల్యాణ్‌ చేతులు ఎత్తేసినట్టే అని, వచ్చే ఎన్నికల్లో పోటీచేసే నమ్మకాలు కూడా లేవనే మాట వినిపిస్తోంది. మొన్నటి వరకూ ముఖ్యమంత్రిని అవుతానని ప్రకటించుకున్న పవన్‌ కల్యాణ్‌.. గట్టిగా పోటీలో నిలిచే పరిస్థితి కూడా లేకపోతే! అది చేతులు ఎత్తేయడమే కదా!

పార్టీ పెట్టి ఐదు సంవత్సరాలు అయిపోయాయి. పెద్ద పెద్దమాటలు, పెద్ద పెద్ద ఆశయాలు, పెద్ద పెద్ద వాళ్ల పేర్లు.. ఇవన్నీ వినిపించాయి పవన్‌ కల్యాణ్‌ నుంచి. అయితే పవన్‌ రాజకీయంలో మాత్రం ఆ ధాటిలేదు. పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్టుగా సాగుతోంది వ్యవహారం. ఐదేళ్లు ఎలాగోలా గడిపేశాడు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు మళ్లీ సమాధానం ఇవ్వాలి! లాంటి నేపథ్యంలో పవన్‌ పలు ఆప్షన్లను పరిశీలించినట్టుగా తెలుస్తోంది.

అసలు పోటీ చేయకపోవడమే ఫస్ట్‌ ఆప్షన్‌?!
అసలు ఈసారి ఎన్నికల్లో పోటీనే చేయకపోవడం.. ఇదే పవన్‌ కల్యాణ్‌కు ఉన్న ఫస్ట్‌ ఆప్షన్‌ అనేమాట వినిపిస్తోంది. టార్గెట్‌ 2024 అంటూ పవన్‌ కల్యాణ్‌ ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవడానికే మొదట ప్రాధాన్యతను ఇచ్చాడని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు తలపడితే.. ఆ పోరులో ఎవరో ఒకరు ఓడతారు, ఓడేవాళ్ల ప్లేస్‌ను తను భర్తీ చేస్తానంటూ.. ఎన్నికల తర్వాత మళ్లీ కొత్త రాజకీయం మొదలుపెట్టాలి అనేది పవన్‌ మొదటి ఆలోచనగా తెలుస్తోంది. అయితే దీనంత పేలవమైన ఆలోచన మరోటిలేదు. ప్రాక్టికల్‌గా ఇది వర్కవుట్‌ అయ్యేదికాదు. ఇక రెండోఆప్షన్‌.. ఏవో కొన్ని అసెంబ్లీ స్థానాల మీద కాన్సన్‌ ట్రేట్‌చేసి.. అభ్యర్థులను పోటీలో నిలపడం. అయితే పవన్‌ రాజకీయ ప్రతిభ కనీసం ఆ నియోజకవర్గాల్లో అయినా జనసేనను విజేతగా నిలుపుతుందా? అనే అనుమానాలను ఆయనలోనే జనరేట్‌ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ఫండ్స్‌ కొరత కూడా పవన్‌ను భయపెట్టింది.

అసలు పోటీలో లేకపోవడం, ఏవో కొన్ని స్థానాల్లో సొంతంగా పోటీచేయడం.. ఈ రెండు ఆప్షన్ల తర్వాత పవన్‌ ముందుకు ఇప్పుడు మూడో ఆప్షన్‌ వచ్చింది. అదే చంద్రబాబుతో పొత్తు! అసలు పోటీ చేయకపోవడం, సొంతంగా పోటీచేసి చిత్తు అయిపోవడం కన్నా.. చంద్రబాబు ఇచ్చే ఫండ్స్‌తో, ఇచ్చే సీట్లతో పోటీలో పవన్‌ నిలవవచ్చు. కానీ అలా చేయడానికి పవన్‌కే భయమేస్తోంది. బాబుపై ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అందులోనూ తను బాబును ఇప్పటికే గట్టిగా విమర్శించాడు. ఇప్పుడు మళ్లీ బాబుతో చేతులు కలిపితే జనాలు అసహ్యించుకుంటారేమో అనేభయం. ఒకవేళ చంద్రబాబుతో పొత్తుకే గనుక పవన్‌ వెళ్తే.. అది ఆయన రాజకీయంగా పతనావస్థలో  కూరుకుపోవడమే!

మిత్రులు లేనిదే ఎన్నికలకు వెళ్లే చరిత్రలేని చంద్రబాబు నాయుడు పవన్‌ కల్యాణ్‌ తనకు దూరం అయ్యేసరికి భయపడ్డాడు. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌కు పాతికో పరకో సీట్లు ఇచ్చి.. పొత్తుకు సై అని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఈ కుటిల రాజకీయంలో చంద్రబాబు నాయుడుకూ పోయేది ఏమీలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక అవకాశవాది. తన అవకాశవాదాన్ని చంద్రబాబు నాయుడు ఎన్నడూ దాచుకోలేదు. తన అవసరం కోసం ఎవరితోనైనా చేతులు కలుపుతాడు.. తన అవసరం తీరాకా ఎవరినైనా తిడతాడు. అదీ చంద్రబాబు నాయుడు అంటే. అలాంటి చంద్రబాబుతో మళ్లీ చేతులు కలిపితే.. రాజకీయంగా పవన్‌ పతనం అయినట్టే!

కర్ణాటక తరహా రాజకీయం వర్కవుట్‌ కాదని అర్థమైందా!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను గమనించిన పవన్‌ కల్యాణ్‌ ఆ తరహా రాజకీయాన్ని ఇక్కడ అమలు చేయాలని కొన్నినెలల కిందట అనుకున్నాడు. జేడీఎస్‌ ఆదర్శంగా పవన్‌ కల్యాణ్‌ రాజకీయం ఏపీలో పుంజుకుంది. కానీ జేడీఎస్‌ జాక్‌ పాట్‌గా సీఎం పీఠాన్ని పొందడమే పవన్‌ చూశాడు కానీ.. దానివెనుక కష్టాన్ని చూడలేదు! దానివెనుక ఉన్న దశాబ్దాల పార్టీ నిర్మాణాన్ని పవన్‌ గమనించలేదు. జేడీఎస్‌ పార్టీ ఒక కుటుంబ పార్టీనే. అయితే ఆ కుటుంబీకులకు నిరంతరం రాజకీయమే వృత్తి. ఓడిపోయినప్పుడు ఇంట్లో వెళ్లి కూర్చోలేదు. నెలల తరబడి విరామాలు తీసుకోలేదు.

తమ కులాన్ని అడ్డుపెట్టుకునే అయినా.. రాజకీయాన్ని కొంతవరకూ వారు గ్రిప్‌లో పెట్టుకున్నారు. తమ కులపోళ్లు గట్టిగా ఉన్న జిల్లాల్లోనే అయినా.. వాళ్లు రాజకీయ ఆధిపత్యాన్ని కాపాడుకున్నారు. అలాగని ఆ జిల్లాలకే పరిమితం కాలేదు కూడా. తమకు బలం ఉన్నా లేకపోయినా.. కర్ణాటక వ్యాప్తంగా వాళ్లు తమ పార్టీ ఉనికిని కాపాడుకొంటూ వస్తున్నారు. అలాంటి రాజకీయంతో సొంతంగా సత్తా చాటలేకపోయినా.. బీజేపీని అడ్డంపెట్టుకునో, కాంగ్రెస్‌ మద్దతుతోనే.. జాక్‌పాట్‌గా సీఎం సీటును కొడుతున్నారు. వారి లక్‌ను కాదు.. మిగతా టైమ్‌లో వాళ్లు పడేకష్టాన్ని కూడా గమనించాలి. ఇలాంటి విషయాలను ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసినప్పుడే ఆలోచించి ఉంటే.. మెగా బ్రదర్స్‌ రాజకీయం ఇప్పుడు ఇలా ఉండేది కాదు! కష్టాలు వద్దు.. సుఖాలు మాత్రమే కావాలంటే కుదరదు కదా!

ప్రజారాజ్యం కన్నా పేలవంగా!
అన్నది పోస్ట్‌ పెయిడ్‌ పార్టీ.. తమ్ముడిది ప్రీపెయిడ్‌ పార్టీ.. గత ఎన్నికల ముందు గట్టిగా వినిపించిన విమర్శ. ఆ తీరులో మార్పు అని పవన్‌ కల్యాణ్‌ కొన్నినెలల నుంచి హడావుడి చేశాడు. తన పార్టీ ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తుందని పవన్‌ ప్రకటించుకున్నాడు. ప్రకటించుకుంటున్నాడు అయితే పోటీచేయడం అంటే మాటలు చెప్పినంత ఈజీకాదు. ఒకవేళ పవన్‌ కల్యాణ్‌ గత ఎన్నికలు అయిపోగానే.. కసరత్తు మొదలుపెట్టి ఉంటే, ప్రజాపోరాటాలు చేసి ఉంటే, క్షేత్రస్థాయిలో తన పార్టీ బలోపేతం అయ్యే చర్యలు చేపట్టి ఉంటే.. ఈ పాటికి జనసేనకు ఒక రూపం వచ్చేది. అయితే.. పవన్‌లో అంత చిత్తశుద్ధీ లేదు, నిజాయితీ లేదు, కసీ లేదు.

ఫలితంగా జనసేన పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మిగిలింది. అన్ని స్థానాల్లోనూ పోటీ అని మరోసారి పవన్‌ ప్రకటించాడు. కమ్యూనిస్టులకు కొన్ని సీట్లు ఇచ్చి మిగతా చోట్లంతా పోటీచేయడమే అని పవన్‌ చెబుతున్నాడు. ఈ మాటను పవన్‌ ఎంతవరకూ నిలబెట్టుకుంటాడు? అనేది ఒకప్రశ్న అయితే.. పోటీచేసినా విజయం కొశ్చన్‌ మార్క్‌ అవుతోంది. ప్రజారాజ్యం స్థాయిలో కూడా జనసేన ఓట్లను సీట్లను సాధించే అవకాశాలు ఏమాత్రం లేవనే విశ్లేషకులు అంటున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అనేకమంది సీనియర్‌ పొలిటిషియన్లు ఆ పార్టీలోకి వచ్చారు. కులం చూసి వచ్చారా.. మరోటి ఆశించి వచ్చారా.. అనే సంగతి పక్కనపెడితే.. ప్రజారాజ్యం పార్టీకి కనిపించిన ఊపులో పదోవంతు కూడా జనసేనకు కనిపించడం లేదు!

చిరంజీవి మెజారిటీ కాపుల-బలిజల ఓట్లు పొంది ఉండవచ్చు. పవన్‌కల్యాణ్‌ ఆ కులాల ఓట్లను మరింత ఎక్కువ స్థాయిలో పొందవచ్చు. అయితే చిరంజీవి మిగతా కులాల ఓట్లను కూడా గట్టిగా కొల్లగొట్టాడు.అయితే పార్టీని విలీనం చేసి.. అలాంటి వారి ఆగ్రహానికి గురయ్యాడు చిరు. పవన్‌ను చిరంజీవి తమ్ముడిగా చూస్తున్న వర్గాలు ఇప్పుడు ఇతడిని విశ్వసించే పరిస్థితి కనిపించడం లేదు.

జగన్‌తో పొత్తు  ఎందుకు కుదరలేదంటే!
తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకత ఉంది. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏదో వేవ్‌ వచ్చి గెలవలేదు. సమీకరణాల ఆధారంగా మాత్రమే నెగ్గాడు. అనవిగాని హామీలతో నెగ్గాడు. ఆ హామీలను అమలు చేయడంలో బాబు అట్టర్‌ఫ్లాప్‌ అయ్యాడు. ఇక రాజధాని పేరుతో చూపించిన సినిమా జనాలను ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇక రాష్ట్రంలో అవినీతి పతాకస్థాయికి వెళ్లింది. జన్మభూమి కమిటీల పేరుతో.. క్షేత్రస్థాయి నుంచినే పాలనను తెలుగుదేశం పార్టీ వ్యక్తుల చేతుల్లో పెట్టాడు బాబు. ఇది తెలుగుదేశం పార్టీ పుట్టిని ముంచేయడం ఖాయం. ఇలాంటి నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీతో కలిసి పోటీచేసి.. ఆ పార్టీతో పొత్తుకు వెళ్లేందుకు కూడా మొదట పవన్‌ వెనుకాడలేదు. జగన్‌ తనకు శత్రువు కాదు.. అని పవన్‌ ప్రకటించిన దశలో ఈ అంశంపై చర్చలు జరిగాయి.

అయితే పవన్‌ను జగన్‌ విశ్వాసంలోకి తీసుకోలేదని సమాచారం. దానికి పలు కారణాలున్నాయి. ఒకటి జనసేనకు క్షేత్రస్థాయిలో ఎలాంటి నిర్మాణం లేకపోవడం. పవన్‌ అడిగినట్టుగా ఇరవై, పాతిక సీట్లను ఇచ్చినా.. ఆ పార్టీ నెగ్గుకు వచ్చే అవకాశాలు ఏమాత్రం ఉండవు. తను ఆ స్థాయిలో కష్టపడుతుంటే.. తన పార్టీకి బూత్‌ స్థాయిలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో నిర్మాణం లేదనే సంగతి జగన్‌కు తెలిసిందే. అలాంటి పరిస్థితుల మధ్యన పవన్‌ పార్టీకి కేటాయించే సీట్లను అప్పనంగా తెలుగుదేశం చేతిలో పెట్టడమే తప్ప మరోటికాదని జగన్‌ భావించాడు.

ఇక పవన్‌ తీరులో కూడా స్టెబిలిటీ ఉండదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకే పవన్‌తో పొత్తు ప్రతిపాదనను నిర్దద్వంద్వంగా తిరస్కరించాడు. జగన్‌ పూర్తిగా జనాలను నమ్ముకున్నాడు. వాళ్లే తనను గెలిపిస్తాడని ఫిక్సయ్యాడు. కులం, మతం.. వంటి మరే సమీకరణాలనూ జగన్‌ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో పవన్‌ పొత్తు పప్పులు అక్కడ ఉడకలేదు!

బాబు ఆశలు ఫలిస్తాయా? పవన్‌ అటు వెళ్తాడా?
పవన్‌ కల్యాణ్‌ మీద తన ఆశలను అయితే బాహాటంగానే చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు. పవన్‌ తనతో కలిసి రావాలని అన్నాడు. ఇంత బహిరంగ పరుచుకున్నాకా.. చంద్రబాబు నాయుడు పవన్‌ను తనవైపు తిప్పుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తాడని స్పష్టం అవుతోంది. ప్రస్తుతానికి పవన్‌ లేదని అంటున్నా.. ఈ కథ ఎటైనా మలుపు తిరగవచ్చు. ఒకవేళ అదే జరిగితే.. రాజకీయాల్లో ఒకటీ ప్లస్‌ ఒకటి ఎప్పటికీ రెండుకాదు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 2014లో కాంగ్రెస్‌ పార్టీ ఇరవై ఐదుశాతం ఓట్లను సంపాదించుకుంది. తెలుగుదేశం పార్టీ పదిహేనుశాతం ఓట్లను పొందింది. తెరాసకు ముప్పైనాలుగు శాతం ఓట్లు వచ్చాయి. ఇక 2018లో కాంగ్రెస్‌, టీడీపీలు కలిసి పోటీచేశాయి. కాబట్టి.. పాతిక ప్లస్‌ పదిహేను కలిపితే నలభైశాతం అయ్యి.. తెరాస చిత్తుకింద ఓడిపోవాల్సింది. అయితే కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌, సీపీఐ కలిసి చివరకు సాధించిన ఓట్‌ పర్సెంటేజ్‌ ముప్పైరెండు! గతంలో కాంగ్రెస్‌ సొంతంగా సాధించినన్ని సీట్లు కూడా కూటమిగా సాధించలేకపోయారు. అదీ రాజకీయం!

చంద్రబాబుపై వ్యతిరేకత పొందింది.. పవన్‌ కల్యాణ్‌తో అనుకూలత వస్తుంది.. వేన్నీళ్లకు చన్నీళ్లు తోడు అవుతాయి అనేది రాజకీయం కాదు. అది కేవలం భ్రమ. కాబట్టి.. చంద్రబాబుతో కలిసి పవన్‌ కల్యాణ్‌ మూటగట్టుకునేది ఓటమి తప్ప మరోటికాదు. సొంతంగా పోటీచేస్తే.. పవన్‌ కల్యాణ్‌ గెలుస్తాడా, ఓడతాడా అనేది తర్వాతి సంగతి. కనీసం రాజకీయంలో నిలుస్తాడు. చేగువేరా, భగత్‌సింగ్‌, చంద్రశేఖర ఆజాద్‌ల పేర్లు చెప్పుకొంటూ.. చంద్రబాబు లాగా నిస్సిగ్గు రాజకీయం చేస్తే మాత్రం ఏమాత్రం ఆత్మాభిమానం, ఆత్మగౌరవం లేని ఒక అవకాశవాదిగా పవన్‌ కల్యాణ్‌ మిగిలిపోవడం ఖాయం. చంద్రబాబుపై విమర్శలు చేసిన పవన్‌ను ఒక రెబల్‌గా చూశారు జనాలు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబుతోనే చేతులు కలిపితే.. అదెంత చెత్తగా ఉంటుందనే విషయం వర్ణనాతీతం!

అన్నిచోట్లా పోటీ చేయడానికి తగిన ప్రిపరేషన్‌ లేదు, కొన్నిచోట్ల పోటీచేస్తానంటే కుదరదు. చంద్రబాబుతో చేతులు కలిపితే చెత్తగా ఉంటుంది. ఎన్నికలకు సరిగ్గా మూడు నాలుగు వ్యవధి మాత్రమే ఉన్న తరుణంలో పవన్‌.. ఆయన పార్టీ పరిస్థితి ఇది. అజ్ఞాతవాసి స్క్రిప్ట్‌ కన్నా.. అయోమయంగా ఉన్న ఈ కథ.. ఏమవుతుందో చూడాలిక!

యూఎస్‌లో కూడా నిధులు రాలలేదు!
రాజకీయాల్లో ఇలా నిధుల సమీకరణ చేయడం ఏమీ ద్రోహంకాదు. ఈ రోజుల్లో అన్నిపార్టీలూ ఆ పని చేస్తున్నాయి. పవన్‌ కల్యాణ్‌ కూడా అలాంటి ప్రయత్నమే చేశాడు. అందుకోసం యూఎస్‌ వరకూ వెళ్లొచ్చాడు పవన్‌ కల్యాణ్‌. అయితే.. అక్కడ వసూళ్లు పవన్‌ కల్యాణ్‌ నిధులు ఫెయిల్యూర్‌ సినిమా స్థాయిలో కూడా లేవని తెలుస్తోంది. ఒక్కోరు వందడాలర్లు, రెండు వందల డాలర్లలు ఇవ్వడానికి ముందుకు వచ్చారట! ఆ నంబర్లను చూసి పవన్‌ కల్యాణ్‌ కూడా ఖిన్నుడయ్యాడని సమాచారం. మరీ వంద రెండువందల డాలర్ల స్థాయి నంబర్ల కోసం యూఎస్‌ వరకూ వెళ్లడాన్ని తనకు తనే అవమానంగా భావించాడట పీకే.

ఆ మధ్య కమల్‌ హాసన్‌ పిలుపును ఇస్తే తమిళ ఫ్యాన్స్‌ ముప్పైకోట్ల రూపాయల వరకూ కూడబెట్టారు. ఈ రోజుల్లో రాజకీయాల్లో ముప్పై నలభై కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోతాయి? అందుకే కమల్‌ హాసన్‌ ఆ ముప్పైకోట్లను అభిమానులకు తిరిగి ఇచ్చేస్తానని ఏదో ప్రకటన చేశాడు. ఇక అమెరికాలో కలెక్షన్స్‌ డల్‌గా ఉండేసరికి.. పవన్‌ తెలుగునాట నుంచి ఏమైనా వస్తాయేమో చూశాడు. అందుకోసమే.. నాగబాబు, వరుణ్‌ తేజ్‌.. వంటి వాళ్ల చేత విరాళం అనే ప్రకటనలు చేయించినట్టుగా తెలుస్తోంది.

వాళ్లు ప్రకటించారని ప్రకటిస్తే.. అభిమానులు, మిగతావారి నుంచి ఏవైనా మొత్తాలు వస్తాయేమో అని ఆ ప్రయత్నం జరిగింది. అయితే.. ఆ లీకులు కూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. జనసేన కోసం ఇదిగో ఈ కోటి రూపాయలు అంటూ.. బహిరంగ ప్రకటన చేసినవాళ్లు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు! ఈ నిధుల సమీకరణ అంశం పవన్‌ కల్యాణ్‌ను బాగా నిరాశకు గురిచేసింది.

కాపుల పరిస్థితి ఏమిటి?
చంద్రబాబుపై పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తగానే బాగా ఉత్సాహపడింది కాపులే. చంద్రబాబుపై అప్పటికే వ్యతిరేకత ప్రబలి ఉండటం.. రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు నాయుడు కాపులను మోసం చేయడం వంటి పరిణామాలకు తోడు.. తమవాడు రాజకీయంగా నిలుస్తున్నాడనే ఆనందం! ఇవన్నీ కాపుల్లో కొంత శాతాన్ని పవన్‌ వైపు మొగ్గుచూపేలా చేశాయి.  పవన్‌ కల్యాణ్‌ రాజకీయంగా యాక్టివేట్‌ అయ్యాకా కాపులు ఉత్సాహభరితులు అయ్యారు. కమ్మవాళ్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో వాళ్లతో రాజకీయంగా ఢీ కొట్టడానికి కూడా కాపులు రెడీ అయ్యారు. జగన్‌ను సమర్థించిన కాపుల్లో కూడా కొందరు పవన్‌ వైపుకు తిరిగారు. దానికంతా కారణం చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ ఢీ అనడమే!

పవన్‌ కల్యాణ్‌ పార్టీ రాజకీయంగా కాపులకు ఒక ఐడెండిటినీ ఇస్తుంది, కాపులను రాజకీయంగా మరింత బలంగా చేస్తుందని వారు ఆశించారు. అలా కాపులను సగంవరకూ తీసుకెళ్లాడు పవన్‌ కల్యాణ్‌. తీరా ఎన్నికల సమయంలో జెండా పీకేస్తే.. తెలుగుదేశం పార్టీతో పొత్తు అంటే.. అది కాపుల ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీస్తుంది. కొన్నినెలల నుంచి కమ్మ వాళ్లతో ఢీకొట్టి.. ఇప్పుడు మళ్లీ కమ్మ వాళ్ల పార్టీతో వాళ్ల కింద పనిచేయాల్సి రావడం అంటే.. ఆత్మాభిమానం ఉన్నవాళ్లను అసహనానికి గురి చేయడానికి అంతకన్నా ఏం కావాలి?

కాబట్టి టీడీపీతో పొత్తు పవన్‌ కల్యాణ్‌కు అన్ని రకాలుగానూ ఇబ్బందికరమే. పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రమంతటా పోటీలో ఉండాలని కాపులు కోరుకుంటున్నారు. అధికారం అందుతుందా లేదా అనేది తర్వాతి సంగతి.. ఓపికగా ఉండాలని.. ఎప్పుడో ఒకసారి టైమ్‌ కలిసి రాకపోతుందా? అనేది కాపుల ప్రశ్న. అంత ఓపిక పవన్‌కు ఉందా? ఈ ఎన్నికల్లో పోటీచేసి పోరాడకపోయినా.. ఎన్నికలయ్యాకా.. మళ్లీ సినిమాలు అన్నా.. మళ్లీ కథ మొదటికి వచ్చినట్టే! 

జనసేన అన్ని స్థానాల్లో పోటీ పవన్ కళ్యాణ్ ధైర్యమేంటి?

అటు జనం.. ఇటు భయం, పవన్ ఒంటరిగా వెళ్లాలి.. ఇదే అభిమానుల కోరిక!

Show comments