అయినా.. టీడీపీ బుద్ధి మారలేదూ.!

'అయినా.. మనిషి మారలేదు.. ఆతని కాంక్ష తీరలేదు..' అంటూ ఓ పాత సినిమాలో మాంఛి పాటొకటి వుంటుంది. తెలుగుదేశం పార్టీ గురించి కూడా ఇప్పుడు ఇలాగే అనుకోవాలేమో.! తెలంగాణ పొలిమేరలదాకా తెలుగుదేశం పార్టీని తరిమి తరిమి కొట్టేశారు తెలంగాణ ఓటర్లు. గ్రేటర్‌ హైద్రాబాద్‌లో సెటిలర్లు సైతం తెలుగుదేశం పార్టీకి నున్నగా 'గుండు' కొట్టేశారు. అయినా, తెలుగుదేశం పార్టీ తీరు మారడంలేదు.

తెలంగాణలోని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీతో కుమ్మక్కయ్యిందంటూ టీడీపీ అధికార ప్రతినిథి లంకా దినకర్‌ తాజాగా సెలవిచ్చారంటే, 'టీడీపీ నేతల మానసిక స్థితి' ఎలా వుందన్నదానిపై అనుమానాలు కలగకుండా ఎలా వుంటాయ్‌.?

'చంద్రబాబు, తెలంగాణకొచ్చి గిఫ్ట్‌ ఇచ్చారు కదా.. మేం, ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళి ఆయనకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వకపోతే ఎలా.?' అని నిన్న కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యల్ని, టీడీపీ నేతలు తెలివిగా వైసీపీ - టీఆర్‌ఎస్‌ మైత్రికి ఇదే నిదర్శనమంటూ డిజైన్‌ చేస్తున్నాయి.

నిజానికి, తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ దోస్తీ కోసం ప్రయత్నించి విఫలమయ్యిందెవరు.? చంద్రబాబే.! ఆ విషయాన్ని ఆయనే స్వయంగా గతంలో చెప్పారు. అదే విషయాన్ని ఆయన తాజాగా కూడా సెలవిచ్చారు. 'కేసీఆర్‌, బీజేపీ వ్యతిరేక కూటమి కోసం సహకరించలేదు' అని ఈరోజు కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఒకవేళ టీఆర్‌ఎస్‌తో టీడీపీ పొత్తు తెలంగాణలో కుదిరి వుంటే, టీఆర్‌ఎస్‌ కూడా మునిగిపోయేదేనేమో.! బీజేపీతో నాలుగేళ్ళు అంటకాగి, కాంగ్రెస్‌ని తూలనాడింది తెలుగుదేశం పార్టీ. ఈ క్రమంలో వైసీపీకీ, కాంగ్రెస్‌కీ 'అక్రమ సంబంధం' అంటగట్టే ప్రయత్నం చేశారు చంద్రబాబు.

బీజేపీతో టీడీపీ విడిపోయాక వైసీపీ - బీజేపీలకు అక్రమ సంబంధం అంటగట్టేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేశారు, చేస్తూనే వున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో పొత్తు కుదరక, తెలంగాణ సమాజం నుంచి ఛీత్కారాలు ఎదుర్కొన్నాక.. ఇదిగో, ఇప్పుడు ఇలా టీఆర్‌ఎస్‌ - వైసీపీ స్నేహమంటూ తెలుగు తమ్ముళ్ళు కొత్త పల్లవి అందుకున్నారన్నమాట.

టీడీపీ మారదు.. టీడీపీ నేతలు మారరు.. యధా చంద్రబాబు.. తథా తెలుగు తమ్ముళ్ళు. మెదడు మోకాళ్ళలోకి వచ్చేసినప్పుడే ఏం మాట్లాడుతున్నారో తెలియని స్థితి వస్తుందని చాలా సినిమాల్లో కామెడీ డైలాగులు కన్పిస్తుంటాయి. అది నిజమేనని అనుకోవాలా.? తెలుగు తమ్ముళ్ళ తీరు అలాగే వుంది మరి.

Show comments