అయినా నిఖిల్‌ని ఆడేసుకుంటోన్న రౌడీస్‌.!

'ట్యాక్సీవాలా' సినిమా విడుదలకు ముందే లీక్‌ అయ్యింది. ఇది అందరికీ తెల్సిన విషయమే. లీక్‌ అయిన సినిమాని విడుదల చేయాల్సి రావడం ఎంతకష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'అత్తారింటికి దారేది' సినిమా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అవడంతో, చిత్ర నిర్మాత గట్టెక్కారనుకోండి.. అది వేరే విషయం.

ఇక, 'ట్యాక్సీవాలా' సినిమా కోసం నటీనటులు, దర్శక నిర్మాతలు పడ్డ కష్టం గురించి యంగ్‌ హీరో నిఖిల్‌, సోషల్‌ మీడియాలో స్పందించాడు. ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. పైరసీని ఎవరూ ఎంరేజ్‌ చేయొద్దని కోరాడు. థియేటర్లలోనే సినిమా చూడాలని చెబుతూ, 'ట్యాక్సీవాలా' టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు.

అయితే, విజయ్‌ దేవరకొండ అభిమానులు మాత్రం నిఖిల్‌ని సోషల్‌ మీడియాలో ఆడేసుకుంటున్నారు. కారణం, నిఖిల్‌ తాను చేసిన ట్వీట్‌లో విజయ్‌ దేవరకొండని ట్యాగ్‌ చేయకపోవడమేనట. నిర్మాత ఎస్‌కేఎన్‌, దర్శకుడు రాహుల్‌.. ఈ ఇద్దరూ నిఖిల్‌కి అత్యంత సన్నిహితులు.

నిఖిల్‌ మాటల్లో ఈ విషయం స్పష్టమయ్యింది. చివర్లో విజయ్‌కీ, హీరోయిన్‌ ప్రియాంకకీ తప్పదన్నట్టు 'ఆల్‌ ది బెస్ట్‌' చెప్పాడని, అంతే తప్ప ప్రత్యేకంగా హీరో విజయ్‌ దేవరకొండని మెన్షన్‌ చేయలేదనీ 'రౌడీస్‌' గుస్సా అవుతున్నారు. 'లోపల ఒరిజినల్‌ అలానే వుంచావ్‌..' అని రౌడీస్‌, నిఖిల్‌పై మండిపడుతున్నారు.

'నోటా' సినిమా రిలీజ్‌ తర్వాత, విజయ్‌ దేవరకొండ ఓ ట్వీటేశాడు. 'నవ్వేవాళ్ళు ఇప్పుడే నవ్వుకోండి..' అంటూ తన హేటర్స్‌కి 'వార్నింగ్‌' ఇచ్చింత పన్జేశాడు. దానిపై నిఖిల్‌ ఘాటుగా స్పందిస్తూ, సీరియస్‌ ట్వీట్‌ వేసేశాడు.

'సముద్రం, నీటి బొట్టు..' అంటూ నిఖిల్‌ వేసిన ఆ ట్వీట్‌, రౌడీస్‌కి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇప్పుడు 'ట్యాక్సీవాలా'కి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ మంచి మెసేజ్‌ ఇచ్చే ప్రయత్నం చేసినా, విజయ్‌ దేవరకొండ అభిమానులు మాత్రం ఊరుకోవడంలేదు.

అభిమానుల గోల ఇలా వుంటే, నిఖిల్‌ సపోర్ట్‌కి విజయ్‌ దేవరకొండ కృతజ్ఞతలు తెలిపాడు ట్విట్టర్‌లో. ఇదిలా వుంటే, తన 'ముద్ర' సినిమా కూడా పైరసీకి గురవుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశాడు నిఖిల్‌. 'అరవింద సమేత' సహా చాలా సినిమాలు పైరసీ బారిన పడ్డాయని నిఖిల్‌ చెప్పుకొచ్చాడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియోలో.

అన్నట్టు, సినిమా టిక్కెట్‌ ధరలు తగ్గించండి.. ఆ తర్వాత పైరసీ గురించి మాట్లాడండి.. అంటూ మొత్తంగా టాలీవుడ్‌కి నెటిజన్లు ఈ సందర్భంగా అల్టిమేటం జారీ చేస్తుండడం కొసమెరుపు.

మీటూ.. ప్రైవేట్ సెటిల్ మెంట్లు జరుగుతున్నాయా? ...చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్

Show comments