అవతార్ దర్శకుడికి దక్కని ఆస్కార్ నామినేషన్

జేమ్స్ కామరూన్.. బహుశా ఈ పేరు తెలియని సినీ అభిమాని ఉండడేమో. ప్రపంచవ్యాప్తంగా తనకంటూ కల్ట్ అభిమానుల్ని సొంతం చేసుకున్న దర్శకుడితడు. ఇతడి తాజా సృష్టి అవతార్-ది వే ఆఫ్ వాటర్.. ప్రస్తుతం థియేటర్లలో రికార్డులు సృష్టిస్తోంది. భారత్ లో భారీ విజయాన్ని దక్కించుకున్న హాలీవుడ్ సినిమాగా చరిత్ర సృష్టించింది.

ఇంతటి ఘనకీర్తిని సొంతం చేసుకున్న జేమ్స్ కామరూన్ కు ఆస్కార్ వస్తుందని అంతా భావించారు. కానీ ఆశ్చర్యంగా నామినేషన్లలో కామరూన్ కు చోటు దక్కలేదు.

బెస్ట్ డైరక్టర్స్ విభాగంలో జేమ్స్ కామెరూన్ కనీసం నామినేషన్ స్థాయి వరకు కూడా వెళ్లకపోవడం ఆశ్చర్యకరం. ఉత్తమ దర్శకుడి విభాగంలో మార్టిన్ మెక్ డొనాగ్ (చిత్రం-ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్), డానియల్ క్వాన్, డానియన్ స్కీనెర్ట్ (చిత్రం-ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్), స్టీవెన్ స్పీల్ బర్గ్ (చిత్రం-ది ఫేబల మేన్స్), టాడ్ ఫీల్డ్ (చిత్రం-థార్), రూబెన్ ఆస్ట్ లాండ్ (చిత్రం-ట్రయాంగుల్ ఆఫ్ శాడ్ నెస్) నామినేషన్లు దక్కించుకున్నారు. ఇక తుదిపోరు వీళ్ల మధ్యే.

ఉత్తమ దర్శకుడిగా కామరూన్ కు నామినేషన్ దక్కనప్పటికీ.. అతడు తీసిన అవతార్ - ది వే ఆఫ్ వాటర్ సినిమాకు మాత్రం పలు విభాగాల్లో నామినేషన్లు దక్కాయి. బెస్ట్ పిక్చర్ విభాగంతో పాటు.. బెస్ట్ సౌండ్ డిజైన్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో ఆస్కార్ కు నామినేట్ అయింది.

అవతార్-ది వే ఆఫ్ వాటర్ సినిమాకు ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్, ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్, థార్, ఎల్విస్ సినిమాల నుంచి గట్టిపోటీ ఎదురౌతోంది. మల్టీవెర్స్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమా ఈసారి ఎక్కువ ఆస్కార్స్ ఎగరేసుకుపోతుందనే అంచనాలున్నాయి.

Show comments