అశ్వనీదత్ వెనక్కు ఇవ్వాల్సిందేనా?

మహర్షి సినిమా విడుదల సమయంలో ముగ్గురు నిర్మాతల మధ్య కాస్త కిందా మీదా అయింది వ్యవహారం. సినిమాకు ఓవర్ బడ్జెట్ కావడం, అశ్వనీదత్ తన దేవదాస్ బకాయిలు తీర్చడం కోసం కొత్త మొత్తం లాభాల కింద ఇవ్వాల్సిందే అనడం. ఇలా చాలా..చాలా జరిగాయి. ఆఖరికి ఒప్పందం ఏమిటో అన్న సంగతి పక్కన పెడితే, అశ్వనీదత్ కు మూడు కోట్ల ఇచ్చారని బోగట్టా.
ఇక ఓవర్ ఫ్లోస్ తాము చూసుకుంటామని పివిపి, దిల్ రాజు అన్నట్లు వార్తలు వచ్చాయి.

అలాకాదు, ఈ మూడుకోట్లు అలా వుంచి, అన్నీ లెక్కలు పూర్తయ్యాక, లాభనష్టాలు చూసుకుంటామని అశ్వనీదత్ అన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇలా మొత్తానికి ఓవర్ సీస్, నైజాం, వైజాగ్, కృష్ణా కలిసి స్వంతానికి విడుదల చేసారు.

ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే విశాఖ, కృష్ణా రెండూ లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ అవుతాయి అనే పరిస్థితిలో వున్నాయి. ఓవర్ సీస్ రెండు కోట్లు లాస్ అని టాక్.  అందులో కొటి బయ్యర్ కు, కొటి నిర్మాతలకు లాస్ అన్నమాట.

నైజాం మాత్రం కాస్త లాభాలు వస్తాయని అంటున్నారు. కానీ అన్నీ బేరీజు వేసుకుంటే దిల్ రాజకు, పివిపి కి మాత్రం ఏమీ మిగలదు. అలాంటపుడు మరి అశ్వనీదత్ కు మూడు కోట్లు లాభం ఎలా? విశ్వసనీయ వర్గాల బోగట్టా ఏమిటంటే, అదే పరిస్థితి వస్తే, మూడు కోట్లలో తమవాటా వెనక్కు రాబట్టాలన్నది మిగిలిన ఇద్దరి ఆలోచనగా వున్నట్లు తెలుస్తోంది.

ఆ పరిస్థితి వస్తే మళ్లీ మరోసారి మహర్షి నిర్మాతల మధ్య తకరారు తప్పదేమో?

Show comments