అస్త్ర సన్యాసం చేసి యుద్ధమేంటి కేసీయారూ.?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ముహూర్తం చూసుకుని అసెంబ్లీని రద్దుచేశారు.. ముహూర్తం చూసుకునే, ముందస్తు ఎన్నికలకు నామినేషన్‌ కూడా దాఖలు చేశారు. ప్రతిసారీ ఎన్నికల నామినేషన్‌కి ముందు కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామికి దేవాలయంలో నామినేషన్‌ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, నామినేషన్‌ దాఖలు చేయడం కేసీఆర్‌ ఆనవాయితీ. ఈసారీ అదే ఆనవాయితీని పాటించారు కేసీఆర్‌. సరిగ్గా ముహూర్తం చూసుకుని, నామినేషన్‌ వేశారు.

అంతా బాగానే వుందిగానీ, దేవాలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించిన కేసీఆర్‌.. అక్కడి జనాన్ని చూసి, 'యుద్ధానికి వెళుతున్నాం.. ఆశీర్వదించండి..' అంటూ వ్యాఖ్యానించడమే ఆక్షేపణీయంగా తయారైంది. అవును మరి, ముఖ్యమంత్రి పదవిని ముందే వదిలేసుకోవడం ద్వారా అస్త్ర సన్యాసం చేసిన కేసీఆర్‌, యుద్ధానికి వెళుతున్నామని చెప్పడమేంటట.? కేసీఆర్‌ అంటేనే అంత. ఆయన ఏం చెప్పినా, ఏం చేసినా చెల్లిపోవాలంతే.!

ఇదిలా వుంటే, హరీష్‌రావుని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని సిద్దిపేట నియోజకవర్గ ప్రజల్ని కోరారు కేసీఆర్‌. మళ్ళీ గెలిచి, పెండింగ్‌ ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తామనీ, బంగారు తెలంగాణ అంటే.. రైతన్నలు అప్పుల్లేకుండా, బాధల్లేకుండా వ్యవసాయం చేసుకోగలగడమేనని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

మొత్తమ్మీద, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్‌ తరఫున అత్యంత కీలకమైన ఘట్టం నేడు చోటు చేసుకుందన్నమాట. ఇప్పటికే 100 మందికి పైగా అభ్యర్థు లిస్ట్‌ని ఖరారు చేసేసి, అభ్యర్థుల్ని ప్రచార రంగంలోకి దూకించిన కేసీఆర్‌.. ఇకపై, వరుస బహిరంగ సభలతో జనంలోకి మరింత ఉత్సాహంగా వెళ్ళబోతున్నారట.

ప్రత్యర్థులు ఇంకా అభ్యర్థుల ఎంపికలోనే కిందామీదా పడ్తుండడంతో, ప్రస్తుతానికి ప్రచారం పరంగా తమదే పై చేయి అన్న ధీమాతో వున్నారు కేసీఆర్‌.

వెనక్కి చూడకుండా పారిపో!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్  

Show comments