ఆరు గంటల్లో రూ.16 లక్షలు.. శభాష్‌ సోషల్‌ మీడియా!

మంచిమాటః   
అతడి వయసు 78 యేళ్లు. మహారాష్ట్ర పోలిస్‌ శాఖలో హవాల్దార్‌గా పనిచేశాడు. మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే కానిస్టేబుల్‌గా పనిచేసి రిటైర్డ్‌ అయ్యాడు. పెన్షన్‌ రూపంలో నెలకు మూడువేల రూపాయలు వస్తాయి. ఆ పెద్దాయనకు ఒక కొడుకు ఉండేవాడు. తనకు పెళ్లిచేశాడు. ఆ వ్యక్తికి మొదట ఒక కొడుకు.. రెండోసారి.. కవల పిల్లలు. ట్విన్స్‌కు జన్మనిస్తూ పెద్దాయన కోడలు మరణించింది. ఆ తర్వాత ఇరవై రోజులకే కొడుకు కూడా పోయాడు. కొడుకూ కోడలు అలా మరణించడంతో.. వారి ముగ్గురు పిల్లల పోషణ ఈ వృద్ధుల మీద పడింది.

అయితే విధి అంతటితో ఆగలేదు. కవల పిల్లల్లో ఒక పాపపేరు ఆరుషి. తనకు ఆరోగ్య సమస్య. ఆ సమస్యకు సంబంధించిన మెడికల్‌ టర్మ్స్‌ చాలా పొడవుగా ఉన్నాయి. చికిత్సకు, చికిత్స తర్వాత మందులకు మొత్తం 16 లక్షలు కావొచ్చని వైద్యులు చెప్పారు. మూడువేల రూపాయల పెన్షన్‌తో ముగ్గురు పిల్లలను పోషించే ఆ వ్యక్తికి అదేస్థాయి మొత్తమో అర్థం చేసుకోవడం ఏమాత్రం కష్టం కాదు.

మనవరాలిని బతికించుకోవడానికి ఆ పెద్దాయన డబ్బు కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. అయితే ఎవరూ ఆ స్థాయి మొత్తాన్ని దానంగా ఇవ్వలేదు. చాలా ప్రయత్నాల అనంతరం ఆ పెద్దాయనను ఎవరో హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే ఆనే చారిటీ సంస్థకు వద్దకు పంపారు.

సోషల్‌ మీడియాలో ఆ సంస్థ ఒక పేజ్‌ను కలిగి ఉంది. దాదాపు 9 లక్షల మంది ఫాలోయర్లున్నారు దానికి. ఆరుషి పరిస్థితి, ఆమె కుటుంబ పరిస్థితి గురించి ఆ సంస్థ తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టుచేసింది. విరాళాలు కోరింది.

అక్కడ మానవత్వం పరిమళించింది. ఎంత గొప్పగా అంటే.. కేవలం ఆరు గంటల్లోనే ఆరుషి చికిత్సకు అవసరమైన పదహారు లక్షల రూపాయల మొత్తం సమకూరింది. ఆ ఫేస్‌బుక్‌ పేజీ ఫాలోయర్లు విరాళాల రూపంలో.. ఆరుషి చికిత్సకు అవసరమైన సొమ్మును సమకూర్చారు.

ఆ పాపకు చికిత్స సాఫీగా జరిగింది. ఇప్పుడు ఆరుషి కోలుకుంటోంది. పాపకు పునర్జన్మను ఇచ్చిన ఆ నెటిజన్లు నిజంగా గ్రేట్‌. వాళ్లను ఎంతగా అభినందించినా తక్కువే!

-ఎల్‌.విజయలక్ష్మి

కూటమి గెలిచినా బాబు కనుసన్నల్లోనే పాలన!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments