సినిమా రివ్యూ: అర్జున్‌ సురవరం

సమీక్ష: అర్జున్‌ సురవరం
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, మూవీ డైనమిక్స్‌
తారాగణం: నిఖిల్‌ సిద్ధార్థ్‌, లావణ్య త్రిపాఠి, తరుణ్‌ అరోరా, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, సత్య, నాగినీడు, రాజారవీంద్ర తదితరులు
కూర్పు: నవీన్‌ నూలి
సంగీతం: సామ్‌ సి.ఎస్‌.
ఛాయాగ్రహణం: సూర్య
నిర్మాత: రాజ్‌కుమార్‌ ఆకెళ్ల
కథ, కథనం, దర్శకత్వం: టి. సంతోష్‌
విడుదల తేదీ: నవంబర్‌ 29, 2019

నిత్యం మన చుట్టూ మనం చూడని ఎన్నో స్కామ్స్‌ జరుగుతూ వుంటాయి. మీడియా కూడా వాటిని అంతగా ఫోకస్‌ చేయదు. అయితే అవి నోటీస్‌ చేసేంత పెద్ద రేంజ్‌లో జరిగితే...? తమిళ దర్శకుల్లో ఎక్కువ మంది ఇలాంటి ఆలోచనలనే సినిమాలుగా మలుస్తుంటారు. టి. సంతోష్‌ దర్శకుడిగా తన తొలి ప్రయత్నంగా తమిళంలో తీసిన 'కణితన్‌' కూడా ఒక ఆసక్తికరమైన అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఫేక్‌ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదించే వాళ్లుంటారని పదే పదే వింటుంటాం. అలాంటి 'ఫేక్‌ సర్టిఫికెట్స్‌ స్కామ్‌'ని పెద్ద రేంజ్‌లో చేస్తూ వుండే పెద్ద నెట్‌వర్క్‌ ఉన్నట్టయితే? మన పేరుతోనే మరొకరు ఇంకెక్కడో మన సర్టిఫికెట్లు వాడుకుని లోన్స్‌ తెచ్చుకుంటే? వినడానికే ఎక్సయిటింగ్‌గా వుంది కదూ? 'అర్జున్‌ సురవరం' బేసిక్‌ ఐడియా ఇదే.

సదరు ఫేక్‌ సర్టిఫికెట్‌ నెట్‌వర్క్‌, దాని వల్ల సామాన్యులపై వేసే ఎఫెక్ట్‌... ఇలాంటి సంచలనాత్మక అంశాలతో మొదలయ్యే 'అర్జున్‌ సురవరం' ఒక థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఆదిలోనే ప్రామిస్‌ చేస్తుంది. కానీ ఒక్కసారి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి అర్జున్‌ సురవరం (నిఖిల్‌) 'యాక్షన్‌'లోకి దిగిన తర్వాత సెన్సేషనల్‌గా స్టార్ట్‌ అయిన సినిమా కాస్తా 'సాధారణ' చిత్రంలా మారిపోతుంది. అంత పెద్ద నెట్‌వర్క్‌ గురించి హీరో కూపీ లాగుతూ వుంటే కలగాల్సిన ఆసక్తిని రేకెత్తించలేకపోతుంది. 'ధృవ'లో అరవిందస్వామిలా కనిపించకుండానే తన పవర్‌ చూపించాల్సిన విలన్‌ కాస్తా సగటు తెలుగు సినిమా విలన్‌లా అన్నీ బయట పడిపోయి చేసేస్తూ వుంటే అంత పెద్ద స్కామ్‌ కూడా అల్లాటప్పా అమీర్‌పేట కన్సల్టన్సీ వ్యవహారంలా అనిపిస్తుంది.

'ధృవ' అయినా, విశాల్‌ నటించిన 'అభిమన్యు' అయినా ఇలాంటి ఒక కనిపించని కుంభకోణం గురించే చూపెట్టాయి. సైలెంట్‌గా చాపకింద నీరులా విస్తరిస్తోన్న తమ సామ్రాజ్యాన్ని ఒక సామాన్యుడు ఒకసారి కుదిపితే సదరు 'మెగా విలన్‌' ఏ విధంగా దానిని డీల్‌ చేస్తాడు? ఎంత తెలివిగా హ్యాండిల్‌ చేస్తాడు? అలాంటి కనిపించని విలన్‌తో హీరో ఆడే 'క్యాట్‌ అండ్‌ మౌస్‌ గేమ్‌' ఎంతగా థ్రిల్‌ చేయగలదు అనేవి ఆ చిత్రాలని గుంపులోంచి వేరు చేసి నిలబెట్టాయి. సంతోష్‌ ఎంచుకున్న ఈ కాన్సెప్ట్‌ కూడా అంత పొటెన్షియల్‌ వున్న సబ్జెక్టే. కాకపోతే కోట్ల రూపాయల కుంభకోణం నడుపుతోన్న తురా సర్కార్‌ (తరుణ్‌ అరోరా) ఒక సగటు విలేకరిని వెతుక్కుంటూ ఒక న్యూస్‌ ఛానల్‌ ఆఫీస్‌కి రౌడీలని, తుపాకులను వేసుకుపోయి హల్‌చల్‌ చేస్తుంటేనే ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలనిపించదు.

అలాగే సదరు అదృశ్య విలన్‌ గురించిన సమాచారం సేకరించడం కోసం అర్జున్‌ సురవరం చేసే ఇన్వెస్టిగేషన్‌ కూడా అంతగా ఎంగేజ్‌ చేయదు. చాలా 'బేసిక్‌' సీన్స్‌తో, ఈ బడ్జెట్‌ సినిమాకి ఈమాత్రం చాలన్నట్టుగా సాగే ఆసక్తిరహిత కథనంతో అర్జున్‌ సురవరం ఏ దశలోను 'సగటు' స్థాయిని దాటి పైకి వెళ్లలేకపోయాడు. ముందే చెప్పుకున్నట్టు ఈ కథలో చాలా విషయం వుంది. అయితే దానిని ఆసక్తికరంగా మలచడంలోనే దర్శకుడి అనుభవరాహిత్యం బయటపడిపోయింది. బడా స్కామ్స్‌, ఒక మెగా విలన్‌ని ఎదుర్కొనే కామనర్‌ ఎప్పుడూ కమర్షియల్‌గా వర్కవుట్‌ అయ్యే థీమ్‌. కాకపోతే ఆ కామనర్‌కి ఎదురయిన ఛాలెంజ్‌, ఆ విలన్‌ తాలూకు చేధించసాధ్యం కాని లెవల్‌ ఈ థీమ్‌ని సక్సెస్‌ఫుల్‌గా మార్చే టూల్స్‌. కానీ ఏ దశలోను దర్శకుడు తన తెలివితో ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్టు అనిపించదు. 'ఆ మాన్షన్‌ దాటి వెళ్లకూడదు' అంటూ విలన్‌ ఫోన్‌లో తన వాళ్లకి ఆజ్ఞ ఇస్తే అతనెలా తప్పించుకోగలడు అనే ఉత్కంఠ రేకెత్తాలి. అంత పెద్ద సమస్యలో హీరోయిన్‌ వచ్చి పవర్‌ ఆఫ్‌ చేయడం సొల్యూషన్‌ అన్నట్టుగా చూపించడం హాస్యాస్పదమనిపిస్తుంది. ఆ తర్వాత ఎలాగో హీరో వచ్చి తన కండ బలం వాడేసి అక్కడ్నుంచి బయటపడిపోతాడు.

విలన్‌ పాత్రని ఇంకో పది మెట్లు కిందకి తోసేస్తూ... చివర్లో కార్‌ ఛేజ్‌ అతనే స్వయంగా చేసినట్టు చూపిస్తారు. అతడి కార్‌ని వివిధ మీడియా సంస్థలకి సంబంధించిన కార్లు వచ్చి ఢీకొనడం కొసమెరుపు. చాలా థ్రిల్లింగ్‌ విషయాన్ని ఎంతో సిల్లీగా డీల్‌ చేస్తున్నారనేదే 'అర్జున్‌ సురవరం'లో ఆద్యంతం ఇబ్బంది పెడుతూ వుంటుంది. ఏ దశలో అయినా సమస్య తాలూకు సీరియస్‌నెస్‌కి తగ్గట్టుగా సినిమాటిక్‌ సొల్యూషన్‌ కాకుండా సహజసిద్ధమైన రీతిన స్పందన, ప్రతిస్పందనలు వున్నట్టయితే ఈ చిత్రం ఖచ్చితంగా ప్రామిసింగ్‌ ప్రెమిస్‌కి జస్టిస్‌ చేసి వుండేది.

హీరోగా నిఖిల్‌ బెస్ట్‌ ఎఫర్ట్స్‌ పెట్టాడు. తన అభినయంతో అర్జున్‌ సురవరం పాత్రకి అవసరమైన సిన్సియారిటీని, రిలేటబులిటీని తీసుకురాగలిగాడు. తరుణ్‌ అరోరా కార్పొరేట్‌ విలన్‌ పాత్రకి కావాల్సిన ఆహార్యంతో వున్నాడు కానీ నటన పరంగా మెప్పించలేదు. లావణ్య త్రిపాఠి పాత్రని చాలా సన్నివేశాలలో బలవంతంగా ఇరికించినట్టుగా అనిపిస్తుంది. సాంకేతికంగా ఈ చిత్రంలో మెప్పించేది ప్రొడక్షన్‌ డిజైన్‌. అటుపై సినిమాటోగ్రఫీ ఒక లెవల్‌ వరకు ఓకే అనిపిస్తుంది. డైరెక్టర్‌ విజన్‌పైనే ఇలాంటి ఐడియాస్‌ ఎంత పే చేస్తాయనేది ఆధారపడుతుంది. సంతోష్‌ ఎంచుకున్న ఐడియా బాగుంది కానీ దానికి రాసుకున్న స్క్రీన్‌ప్లేనే నిరుత్సాహపరుస్తుంది.

బాటమ్‌ లైన్‌: అర్జున్‌ కలవరం!

- గణేష్‌ రావూరి

Show comments