అరకు.. అధికార పార్టీకి ఇకపై 'వణుకు'.!

మావోయిస్టుల ప్రాబల్యం వున్న ప్రాంతాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేని పరిస్థితి. అక్కడి రాజకీయ నాయకులు.. మరీ ముఖ్యంగా ప్రజా ప్రతినిథులకు ప్రతిరోజూ గండమే. నియోజకవర్గంలో పర్యటించాల్సి వస్తే, మారుమూల ప్రాంతాలకు వెళ్ళడానికి చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది. అలా వెళ్ళడమంటే, ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవడమే. తెలుగునాట ఎర్రదండు తొలుత బలం పుంజుకున్నది ఉత్తరాంధ్ర ప్రాంతమే. ఆ ఉత్తరాంధ్రలో గత కొంతకాలంగా ఎర్రదండు ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది.

కానీ, ఒక్కసారిగా ఓ ఎమ్మెల్యేతోపాటు మాజీ ఎమ్మెల్యేని కూడా మావోయిస్టులు హతమార్చడంతో ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే కాదు.. తెలంగాణ సైతం ఉలిక్కిపడాల్సి వచ్చింది. 'మావోయిస్టుల్ని ఏరివేశాం..' అని ప్రభుత్వాలు ప్రకటించుకుంటున్న ప్రతిసారీ, తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు మారణహోమానికి తెగబడ్తూనే వున్నారు. 'దెబ్బకి దెబ్బ.. ప్రాణానికి ప్రాణం..' అన్నట్టే ఇటు భద్రతా బలగాలకీ, అటు మావోయిస్టులకీ మధ్య యుద్ధం నడుస్తోంది.. పచ్చని అడవులు.. రక్తంతో తడిసిపోతున్నాయి.

మిగతా విషయాల్ని పక్కనపెడితే, విశాఖ జిల్లాలో.. అందునా ప్రకృతి అందాలకు, పర్యాటక రంగానికీ పెట్టింది పేరైన అరకులో మావోయిస్టులు పంజా విసరడంతో ఒక్కసారిగా అధికార తెలుగుదేశం పార్టీ ఉలిక్కిపడింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. మాజీ ఎమ్మెల్యే సివేరి సోముని కూడా మావోయిస్టులు అంతమొందించారు.

2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అరకు ప్రాంతం పట్టంకట్టింది. ఎంపీ కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.. తాజాగా మృతి చెందిన కిడారి ఈశ్వరరావు వైఎస్సార్సీపీ నుంచే గెలిచారు. అయితే, 2014 ఎన్నికల తర్వాత కొత్తపల్లి గీత వైఎస్సార్సీపీకి గుడ్‌ బై చెప్పి, టీడీపీకి దగ్గరయ్యారు. ఆ తర్వాత బీజేపీతోనూ చెట్టాపట్టాలేసుకు తిరిగారు. ఇటీవలే ఆమె కొత్త పార్టీని ప్రకటించారనుకోండి.. అది వేరే సంగతి. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా పార్టీ ఫిరాయించేశారు. ఆ బాటలోనే కిడారి సర్వేశ్వరరావు కూడా టీడీపీలో చేరిపోయారు.

'బాక్సైట్‌ తవ్వకాల'కు సంబంధించి పాపమంతా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిదేనంటూ చంద్రబాబు పదే పదే చెబుతూ వస్తున్నారు. పలు బహిరంగ సభల్లో బాక్సైట్‌ గురించి ప్రస్తావిస్తూ, చంద్రబాబు వైఎస్సార్‌ని దోషిగా చూపే ప్రయత్నం చేస్తూ వచ్చిన విషయం విదితమే. బాక్సైట్‌ తవ్వకాల్ని తామే నిషేధించామని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటోంటే, తెరవెనుకాల వ్యవహారం మాత్రం ఇంకోలా వుంది. ఆ తెరవెనుకాల బాగోతమే ఇప్పుడు ఓ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ప్రాణాలు తీసేసిందన్నది మెజార్టీ అభిప్రాయం.

మావోయిస్టుల ఘాతుకానికి పోలీసులు గట్టి సమాధానం చెప్పడం అన్నది ఎలాగూ జరిగేదే. కానీ, 2019 ఎన్నికల్లో ఈ అరకు ప్రాంతం నుంచి లోక్‌సభకు కావొచ్చు, ఆయా నియోజకవర్గాల్లో అసెంబ్లీకి కావొచ్చు.. పోటీ చేయబోయే అభ్యర్థుల పరిస్థితి ఏంటి.? ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తీవ్ర కలకలం సృష్టిస్తోన్న అంశం.

Show comments