చార్జీల పెంపు.. ఈసారి ఆంధ్రప్రదేశ్ వంతు

ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆర్టీసీ చార్జీలు పెరగబోతున్నాయి. ఈ మేరకు జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సుల్లో  కిలోమీటరుకు 10 పైసలు, మిగతా బస్సుల్లో కిలోమీటరుకు 20పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 6700 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకోవాలంటే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదన్నారు ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని.

"ఆర్టీసీకి ఊపిరి ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. సామాన్యుడు ప్రయాణించే పల్లెవెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటరుకు 10 పైసలే పెంచాం. మిగతా సర్వీసులపై మాత్రం 20 పైసలు పెంచాం. డీజిల్ రేట్లతో పాటు జీతభత్యాలు కూడా పెరిగాయి. వీటితో పాటు ఆల్రెడీ పేరుకుపోయిన అప్పులు 6700 కోట్లు ఉన్నాయి. ప్రతి ఏటా మరో 1200 కోట్ల రూపాయల అప్పు పెరుగుతోంది. కాబట్టి ఆర్టీసీని బతికించాలంటే చార్జీలు పెంచాలని నిర్ణయించాం."

తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెంచారని తాము పెంచలేదన్నారు పేర్ని నాని. అలా చూసుకుంటే తెలంగాణ ఆర్టీసీ కంటే చాలా ముందే ఏపీ ఆర్టీసీలో చాలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. చివరికి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కూడా ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయమే అని తెలిపారు.

"తెలంగాణలో పెంచారని మేం పెంచలేదు. మనం తీసుకున్న నిర్ణయాల్ని వేరే ప్రభుత్వాలు ఫాలో అవ్వాలి తప్పితే, వేరే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయని మనం తొందరపడడం లేదు. ఆర్టీసీలో పదవీ విరమణను 60ఏళ్లకు ఎప్పుడో పెంచాం. తెలంగాణలో మొన్న తీసుకున్నారు. తెలంగాణ ఆర్టీసీతో పోలిస్తే, మన రాష్ట్రంలో ప్రతి విషయంలో ఓ అడుగు ముందే ఉన్నాం."

పెంచిన చార్జీల్ని ఎప్పట్నుంచి అమలు చేయాలో ఇంకా నిర్ణయించలేదు. చార్జీల పెంపు అమలు తేదీని రేపు లేదా ఎల్లుండి ఆర్టీసీ ఎండీ ప్రకటిస్తారు. 

Show comments