ఏప్రిల్ సినిమాలు.. సిసలైన వేసవి సందడి

దసరా మూవీ నుంచి వేసవి సినిమాల సందడి షురూ అయింది. ఈ నెలలో అది పీక్ స్టేజ్ కు చేరబోతోంది. ప్రతి వారం ఓ క్రేజీ మూవీ థియేటర్లలోకి రాబోతోంది. రిలీజ్ తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందనే విషయం పక్కనపెడితే.. విడుదలకు ముందు మాత్రం మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి ఈ సినిమాలన్నీ.

ఏప్రిల్ నెలలో ముందుగా రావణాసుర సినిమా థియేటర్లలోకి రాబోతోంది. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వాల్తేరు వీరయ్య, ధమాకా సినిమాలు హిట్టవ్వడంతో.. ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. పైగా తాజాగా రిలీజైన ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సుశాంత్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు. సుధీర్ వర్మ దర్శకుడు.

రావణాసురతో పాటు అదే వారంలో మీటర్, ఆగస్ట్ 16, 1947 అనే సినిమాలు వస్తున్నాయి. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సినిమా మీటర్. ఈ హీరో సినిమాలపై పెద్దగా అంచనాల్లేవ్ కానీ, మైత్రీ మూవీ మేకర్స్ నుంచి వస్తున్న మూవీ కావడంతో మీటర్ పై అందరి చూపు పడింది. ఇక ఆగస్ట్ 16, 1947 అనే డబ్బింగ్ సినిమా కూడా ఓ సెక్షన్ ను ఆకర్షిస్తోంది. ఎందుకంటే, కథపై నమ్మకంతో ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దీన్ని నిర్మించాడు కాబట్టి.

ఇక రెండో వారంలో శాకుంతలం సినిమా వస్తోంది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత శకుంతలగా నటించగా, దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో కనిపించనున్నాడు. గుణశేఖర్ డైరక్షన్ లో వస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి దిల్ రాజు బ్యాకింగ్ ఉంది. ఇతిహాసం కావడం, పైగా ఇందులో సమంత నటించడంతో సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. ఈ సినిమాతో పాటు అదే తేదీకి లారెన్స్ నటించిన రుద్రుడు సినిమా ఉంది.

ఇక మూడో వారంలో.. సాయితేజ్ నటించిన విరూపాక్ష థియేటర్లలోకి వస్తోంది. సుకుమార్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించగా, కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ప్రస్తుతానికి ఈ స్లాట్ లో సాయిధరమ్ తేజ్ కు పోటీ లేదు. అహింస లేదా బెదురులంక సినిమాల్లో ఏదో ఒకటి ఈ స్లాట్ లో పోటీగా నిలిచే అవకాశం ఉంది.

ఇక ఏప్రిల్ చివరి వారంలో పొన్నియన్ సెల్వన్-2, ఏజెంట్ సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. మణిరత్నం డైరక్ట్ చేస్తున్న పీఎస్2పై తెలుగు ఆడియన్స్ లో పెద్దగా అంచనాల్లేవ్. అఖిల్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఏజెంట్ పై మాత్రం భారీ అంచనాలున్నాయి. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు డైరక్టర్.

ఇక ఈ రెండు సినిమాలతో పాటు వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా కూడా ఆ తేదీకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ మూవీ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. ఈ నెలలో థియేటర్లలోకి వస్తున్న వీటిలో ఎన్ని సినిమాలు క్లిక్ అవుతాయో చూడాలి. 

Show comments