ఏపీలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ గెలిస్తే వార్త కాదు

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నికలు ముగిశాయి. అధికార తెలుగుదేశం ఎలాగైనా అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని విశ్వయత్నం చేస్తే, ప్రజాదరణ పొందడం ద్వారా అధికారంలోకి రావాలని ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ సర్వశక్తులు ఒడ్డింది. ప్రజాస్వామ్యంలో ఎన్నిక అన్నది ఒక కీలకమైన అంశం. ఐదేళ్ల పాలనపై ప్రజలు తీర్పు ఇచ్చే అవకాశం. ఏపీలో జరిగిన పోలింగ్‌ తీరుతెన్నులు బట్టి, ఆయా గ్రూప్‌లు చేసిన సర్వేలలో వస్తున్న వివరాలను బట్టి ఏపీలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కి పట్టంకట్టవచ్చన్న అభిప్రాయం అధికంగా ఉంది. అందుకు అనేక నిదర్శనాలు కూడా కనిపించాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎర్రాటిక్‌ బిహేవియర్‌ చూశాక, ఆయన అధికారాన్ని కోల్పోతున్నారన్న అనుమానం వస్తుంది. అలాగే స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి తలుపు వేసుకోవడం చిత్రంగా ఉంటుంది.

ముప్పై ఐదేళ్లుగా రాజకీయాలలో ఉన్న ఆయన, అందులోను స్పీకర్‌గా ఒక గౌరవప్రదమైన పదవిలో ఉన్న ఆయన వాటన్నిటిని విస్మరించి వ్యవహరించిన తీరు కూడా ఆయన పరాజయ బాటలో ఉన్నారేమోనన్న అభిప్రాయం కలిగిస్తుంది. పోలింగ్‌కు ముందు జరిగే ప్రచారం అంతా ఒకఎత్తు అయితే, పోలింగ్‌నాడు జరిగేది ఒకఎత్తుగా ఉంటుంది. రెండుపక్షాలు ఈసారి పోటాపోటీగానే వ్యవహరించాయని చెప్పాలి. ఢీ అంటే ఢీ అన్నాయనే అనుకోవాలి. సాధారణంగా పోల్‌ మేనేజ్‌మెంట్‌లో చంద్రబాబు ఆరితేరారని, తిమ్మిని బమ్మిని చేస్తారని, ఏదైనా చేసి గెలిచే ప్రయత్నం చేస్తారని చాలామంది నమ్మకం. కిందటి ఎన్నికలలో అదికొంత పనిచేసిందని భావిస్తారు.

అయితే ఈసారి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కూడా బూత్‌లెవల్‌ వరకు విస్తరించి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అందువల్లే కొన్నిచోట్ల హింసాత్మక ఘటనలు జరగడం, రెండువైపులా ఒకరిద్దరు మరణించడం వంటివి జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలింగ్‌కు ముందురోజు సీఈఓ వద్దకు వెళ్లి ఎన్నికల సంఘాన్ని దూషించడం, ఆ తర్వాత ఆ కార్యాలయం ఎదుట నిరసనగా కూర్చోవడం వంటి విన్యాసాలు కూడా ఆయన పార్టీ బలహీనపడిందనడానికి ఆస్కారం కలిగింది. ముఖ్యంగా ఆయన కుమారుడు లోకేష్‌ పోటీచేస్తున్న మంగళగిరిలో ఇద్దరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌లను ఎన్నికల సంఘం బదిలీచేయడం ఆయన ఊహించలేకపోయారు, తట్టుకోలేకపోయారు.

అధికారంలో ఉన్నవారికి పోలీసులను వాడుకుని మళ్లీ అధికారం నిలబెట్టుకునేయత్నాలు చేస్తున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ. నంద్యాల ఉప ఎన్నికలో అయితే ఆయా పథకాల లబ్ధిదారుల ఖాతాలలో డబ్బువేయడం, చివరికి తమకు కావల్సిన పోలీసు అధికారులను నియమించుకుని వారితో ఓట్లు కూడా వేయించుకోవడం వంటి అకృత్యాలు కూడా చేశారు. ఉపఎన్నిక కనుక అక్కడ సాధ్యమైంది. కాని సాధారణ ఎన్నికలలో అంత తేలికకాదు. అందులోను ఎన్నికల సంఘం కఠినంగా నిబంధనలు అమలు చేస్తే ప్రభుత్వంలో ఉన్నవారి పప్పులు ఉడకవు. ఇప్పుడు ఏపీలో అదే జరిగినట్లు కనిపిస్తుంది.

పోలింగ్‌ రోజున కూడా చంద్రబాబు నాయుడు చివరి ప్రయత్నం చేశారు. అందులో బాగంగా ఈవీఎంలు ముప్పైశాతం పనిచేయడం లేదని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆరోపించడం తగనిపని. అయినా ఆయన అలా చేశారంటే ఎంత ఆందోళన చెందుతున్నది అర్థం అవుతుంది. అంతేకాక కొన్నిచోట్ల ఘర్షణలు జరిగితే అదంతా వైసీపీ వారిపని అనివెంటనే ప్రకటనలు ఇవ్వడం ఇదంతా చూస్తుంటే ఆయన ఎక్కువగా కంగారు పడుతున్నట్లు అనిపిస్తుంది. ప్రధానంగా  ప్లాన్‌ చేసుకుని వేలకోట్ల ప్రభుత్వ ధనాన్ని ఖర్చుచేసినా, ప్రజలలో ఎందుకు మార్పు వచ్చిందన్నది ఆయనకు అంతు పట్టడంలేదు.

అందువల్లనే హుందాతనం కోల్పోయి, స్థాయిమరచి మాట్లాడుతున్నారు. అదే సమయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్‌ ఓటు వేసినప్పుడు విజయంపై వ్యక్తంచేసిన విశ్వాసం తప్ప, మరోమాట మాట్లాడలేదు. తద్వారా ఆయన హుందా నిలబెట్టుకున్నారు. ఏతావాతా చూస్తే తెలుగుదేశం పార్టీ ఈసారి అధికారం కోల్పోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది. రాయలసీమ నాలుగు జిల్లాలలో 35 సీట్లు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో కనీసం పదిహేను సీట్లను వెఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ గెలుచుకునే అవకాశం ఉన్నట్లు అంచనాలు వస్తున్నాయి.

అంటే ప్రకాశంజిల్లా వచ్చేసరికి ఏభై సీట్లు వస్తాయన్నమాట. ఆ తర్వాత గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాలలో నలభై సీట్లు వరకు రావచ్చని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అంచనాగా ఉంది. ఈ నాలుగు జిల్లాలలో ముప్పైసీట్లు వచ్చినా, వైసీపీకి అధికారం వచ్చినట్లే. ఉన్నంతలో విశాఖపట్నం జిల్లా తప్ప మిగిలిన ఏ జిల్లాలోను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ బలహీనంగా ఉన్నట్లు ఎవరూ చెప్పలేకపోతున్నారు. విశాఖలో సైతం ఆరేడు స్థానాలు రావచ్చని కొందరి అభిప్రాయం. గతసారి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ 67 సీట్లు సాధించుకుంది. వాటిని నిలబెట్టుకుని మరో పాతిక సీట్లు తెచ్చుకుంటే అధికారం వచ్చేస్తుంది.

టీడీపీకి కూడా అదే ధీరి వర్తించవచ్చు. కాని గతసారి బీజేపీ మద్ధతు, జనసేన సపోర్టు, రుణమాఫీలు, కాపు రిజర్వేషన్‌ వంటి హామీలు టీడీపీకి బాగా ఉపయోగపడ్డాయి. ఈసారి ఇవేవిలేకపోవడం, బీజేపీ, జనసేనలు వేర్వేరుగా పోటీచేయడం వల్ల పదిశాతం వరకు ఓట్లశాతం తగ్గిందని జాతీయ సర్వేలు చెబుతున్నాయి. అందువల్లే 20 పైగా లోక్‌సభ సీట్లు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు వస్తాయని ఆ సర్వేలు అంచనా వేశాయి. అంటే దానర్థం అసెంబ్లీలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు 110 నుంచి 120 వరకు సీట్లు వస్తాయన్నమాట. ఇదే విషయాన్ని ఆయా సర్వేలు తేల్చాయి. అయితే ప్రజాభిప్రాయాన్ని జనం డబ్బుతోనే మార్చడానికి చంద్రబాబు తీవ్ర ప్రయత్నం చేశారు.

గత మూడునెలల్లో ముప్పైఐదువేల కోట్ల బిల్లులు పెండింగులో పెట్టి, సుమారుగా ఏభై వేలకోట్ల రూపాయలను ఓట్ల కొనుగోలు స్కీములకు వెచ్చించారట. అయితే జనం వీటిని సీరియస్‌గా తీసుకోలేదన్నది ఎక్కువమంది నమ్మకం. నిజంగానే ఆ డబ్బు పనిచేస్తే టీడీపీ గెలిచే అవకాశం ఉంటుంది. కాని దానిని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్‌ కాని, షర్మిల, విజయమ్మలు బాగా ప్రచారం చేసి అదంతా మోసం అని చెప్పగలిగారు. అందువల్ల ప్రజలలో ప్రభుత్వం మార్పుపై మొగ్గుచూపినట్లు అనిపిస్తుంది. ఇదికాకుండా సామాజికవర్గాల సమీకరణ కూడా బాగా మారందన్నది ఒక విశ్లేషణ.

కమ్మ సామాజికవర్గానికి వ్యతిరేకంగా మిగిలిన సామాజికవర్గాలలో సమీకరణ జరిగిందని కొందరు చెబుతున్నారు. అది వాస్తవమే అయితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు ఇది సునామీ అయి భారీ మెజార్టీతో గెలవవచ్చు. మొత్తంమీద చూస్తే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ గెలిస్తే వార్తగా అనుకోనవసరం లేదు. అందుకు భిన్నంగా జరిగితేనే ఆశ్చర్యపోవాలి. జనాభిప్రాయమా? లేక ధనాభిప్రాయమా అన్నది ఈ ఎన్నికలు తేల్చనున్నాయి.

-కొమ్మినేని శ్రీనివాసరావు

వార్ వన్ సైడే.. నా? ఎవరి లెక్కలు వారివి!

Show comments