ఏపీలో బీజేపీకి ఆత్రం మరీ ఎక్కువైపోయిందా.?

వున్నపళంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికారం దక్కితే ఎంత బావుంటుందోనన్న ఆలోచనతో భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలున్నట్టున్నారు. 'అధికారం అంత తేలికకాదు.. కనీసం, వచ్చే ఎన్నికల నాటికి ప్రతిపక్షం హోదా కూడా దక్కించుకోలేం. కాస్తో కూస్తో ఓటు బ్యాంకు పెంచుకోగలం.. కొన్ని సీట్లు గెలవగలమేమో ఇప్పుడు బాగా కష్టపడితే..' అని బీజేపీకి చెందిన సీనియర్‌ నేత ఒకరు కుండబద్దలుగొట్టేస్తోంటే, ఇతర పార్టీల్లోంచి బీజేపీలోకి వచ్చిన నేతలు మాత్రం, 'ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం దిశగానే అడుగులు వేస్తున్నాం.. సాధిస్తాం కూడా..' అంటూ తెగ ఓవరాక్షన్‌ చేసేస్తున్నారు.

ఏ రాజకీయ పార్టీ అయినా అధికారమే లక్ష్యంగా పనిచేస్తుంది.. ఇందులో ఇంకోమాటకు తావులేదు. బీజేపీ కూడా, ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని లక్ష్యంగా చెప్పుకోవడంలో తప్పేమీలేదు. కానీ, ఈ క్రమంలో బీజేపీ వేస్తున్న ఎత్తుగడలే హాస్యాస్పదంగా మారుతున్నాయి. టీడీపీ నుంచి పలువురు ముఖ్యనేతల్ని ఆల్రెడీ లాగేసుకున్న బీజేపీ, వైసీపీకి కూడా గాలమేస్తోందట కామెడీగా. 'అతి త్వరలో వైసీపీకి చెందిన కొందరు ముఖ్యనేతలు బీజేపీలోకి రాబోతున్నారు..' అంటూ టీవీ చర్చా కార్యక్రమాల్లో ఒకరిద్దరు బీజేపీ నేతలు అత్యుత్సాహంతో వ్యాఖ్యలు చేస్తోంటే నవ్వురాక మానదు ఎవరికైనా.

వైసీపీ అధికారంలోకి వచ్చి ఇంకా మూడునెలలు కూడా పూర్తికాలేదు. పార్టీలో అసంతృప్తి అనేది ప్రస్తుతానికి ఎక్కడా కన్పించడంలేదు. బోల్డన్ని నామినేటెడ్‌ పోస్టులున్నాయి.. అందరికీ సమన్యాయం చేసేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. ఇలాంటి పరిస్థితుల్లో అవినీతి అనో, ఇంకోటనో.. ఆంధ్రప్రదేశ్‌లో గలాటా సృష్టించడం ద్వారా తాము యాక్టివ్‌గా వున్నామనే సంకేతాల్ని పంపాలనుకుంటోంది బీజేపీ. అక్కడివరకూ బీజేపీని తప్పు పట్టడానికి వీల్లేదు. కానీ, వైసీపీ నేతలకు గాలమేయడమేంటి.? వేస్తున్నట్లు ప్రకటించుకోవడమేంటి.? అదేమరి కామెడీ అంటే.

అన్నట్టు, వైసీపీని విమర్శించే క్రమంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీకి కాస్తో కూస్తో మేలుచేసేలా కన్పిస్తోంది. 'జగన్‌ పాలనకంటే చంద్రబాబు పాలనే నయం.. అనేటట్లు పరిస్థితి మారుతోంది..' అంటూ సాక్షాత్తూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణే కామెడీ చేయడం గమనార్హమిక్కడ. అధికారం మీద 'ఆత్రం'తో తామేం మాట్లాడుతున్నామో కూడా తెలియడం లేదన్నమాట బీజేపీ నేతలకి. ఇలాగైతే, ఏపీలో బీజేపీ బలపడటం సంగతి తర్వాత.. ఇటీవలి ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యంకునీ నిలబెట్టుకోవడం కష్టమే.

ప్రాంతీయ భాషల సినిమాలు అదుర్స్!

Show comments