అపరిచితుడు హిందీ రీమేక్.. మెలిక పెట్టిన శంకర్

పుకార్లు నిజమయ్యాయి. కొన్ని రోజులుగా వార్తల్లో నలుగుతున్న అపరిచితుడు రీమేక్ నిజమైంది. రణ్వీర్ సింగ్ హీరోగా హిందీలో ఈ సినిమా రీమేక్ కానుంది. 16 ఏళ్ల కిందట ఈ సినిమాను డైరక్ట్ చేసిన శంకర్, ఈ రీమేక్ కు కూడా దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ విషయాన్ని కొద్దిసేపటి కిందట శంకర్ అధికారికంగా ప్రకటించాడు.

అయితే అప్పటి అపరిచితుడ్ని ఇప్పుడు యథాతథంగా చూపిస్తే వర్కవుట్ అవుతుందా? మరీ ముఖ్యంగా బాలీవుడ్ జనాలకు ఎక్కుతుందా? సరిగ్గా ఇక్కడే శంకర్ తన మార్క్ చూపిస్తున్నాడు. ఇది పూర్తిస్థాయి రీమేక్ కాదంటున్నాడు. అప్పటి అపరిచితుడు సినిమా నుంచి లైన్ ను మాత్రమే తీసుకొని, ఇప్పటి జనరేషన్ కు తగ్గట్టు మార్పుచేర్పులు, గ్రాఫిక్స్ యాడ్ చేస్తాడట.

కాబట్టి ఈ సినిమా అపరిచితుడికి రీమేక్ అయినప్పటికీ, యాజ్ ఇటీజ్ అపరిచితుడిగా ఉండదంటున్నాడు ఈ దర్శకుడు. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమా శాటిలైట్, డిజిటల్, నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ను కళ్లుచెదిరే మొత్తానికి దక్కించుకున్న పెన్ స్టుడియోస్, ఈ అపరిచితుడు రీమేక్ ను తెరకెక్కించబోతోంది.

కొన్నాళ్ల కిందట శంకర్-రామ్ చరణ్ సినిమా ప్రకటన వచ్చింది. కట్ చేస్తే ఇప్పుడు రణ్వీర్ సింగ్ తో అపరిచితుడు రీమేక్ ప్రకటన వచ్చింది. ఈ రెండు సినిమాల కంటే ముందు శంకర్ చేతిలో ఇండియన్-2 సినిమా ఉంది. 

అది పూర్తయిన తర్వాత ఏ సినిమా ముందుగా సెట్స్ పైకి వస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ సంగతి పక్కనపెడితే.. అపరిచితుడు రీమేక్ కు రణ్వీర్ సింగ్ ఎంపిక సూపర్ అంటున్నారు బాలీవుడ్ జనాలు.

Show comments