ఏపీ ప్రజల రాజధాని హైదరాబాదే...!

ఏపీలో రోజుకో కొత్త రచ్చ జరుగుతోంది. ఏదో ఒక విషయంలో అధికార వైకాపా, ప్రతిపక్ష టీడీపీ మధ్య వార్‌ నడుస్తూనే ఉంది. జగన్‌ పరిపాలన ఎలా ఉందో మీడియా ద్వారా తెలియడంలేదుగాని రెండు పార్టీల మధ్య గొడవలు మాత్రం బాగా ఫోకస్‌ అవుతున్నాయి. తాజా వివాదం రాజధాని అమరావతి మీద జరుగుతోంది. అమరావతిని ప్రకాశంజిల్లా దొనకొండకు మారుస్తారనే ఊహాగానాలు జోరుగా హల్‌చల్‌ చేస్తున్నాయి. అమరాతి విషయం 'అదిగోపులి అంటే ఇదిగోతోక' అన్నట్లుగా అయ్యింది. మంత్రి బొత్స సత్యనారాయణ ఏదో ప్రకటన చేశాడు. ఇక అంతే అది కార్చిచ్చులా వ్యాపించింది. ఎవరికి తోచినట్లు వాళ్లు కథలు అల్లుకున్నారు. రాజధాని దొనకొండలో నిర్మిస్తారనే ప్రచారం ఊపందుకోవడంతో అక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చాయని మీడియాలో పుంఖానుపుంఖాలుగా వార్తలొచ్చాయి. జగన్‌ అధికారంలోకి రాగానే అమరావతిలో పనులన్నీ నిలిపేయడంతో అప్పుడే రియల్‌ ఎస్టేట్‌ ఢమాల్‌ అంది. రాజధాని తరలింపు ప్రచారంతో చావు దెబ్బపడింది.

'ఆలూలేదు చూలూలేదు కొడుకు పేరు సోమలింగం' అన్నట్లుగా రాజధాని మారుస్తారని పుకారు లేవగానే దొనకొండలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తమ మాయాజాలం ప్రదర్శించారు. అమాంతం భూముల ధరలు లక్షలకు పెరిగిపోయాయి. అసలు రాజధానిని దొనకొండకు మారుస్తామని అధికారికంగా ఇప్పటివరకు ఎవరైనా అన్నారా? అని ప్రశ్నించుకుంటే సమాధానం లేదు. మంత్రులు, నాయకులు ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడితే ఇలాంటి అనర్ధాలు, అరాచకాలే కలుగుతాయి. ఏపీ పాలకులకు రాజధాని అనేది మొదటినుంచి ఓ ఆటలా తయారైంది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో ఐదేళ్లపాటు అద్భుతమైన పంచరంగుల చిత్రం చూపించారు. రాష్ట్ర విభజనకు తను కూడా (విభజన చేస్తే అభ్యంతరం లేదని కేంద్రానికి లేఖలు ఇచ్చారు కదా) కారకుడే కాబట్టి, హైదరాబాదును కోల్పోయి బాధపడుతున్న ప్రజలను ఊరడించడానికి, రాజధాని నిర్మాతగా తన పేరు చరిత్రలో నిలిచిపోవడం కోసం 'అద్భుత అమరావతి నిర్మాణం' అంటూ ఊదరగొట్టారు.

ప్రపంచంలోని ఐదు టాప్‌ రాజధానుల్లో ఇదొకటి అన్నారు. దేశదేశాలు తిరిగారు. రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. ఏవేవో ఒప్పందాలు చేసుకున్నారు. పైసా ఖర్చులేకుండా 33 వేల ఎకరాలు సేకరించానన్నారు. పాపం ఆంధ్రా జనం అమరావతి ముందు హైదరాబాద్‌ దిగదుడుపే అనుకొని మురిసిపోయారు. చివరకు ఆయన దిగిపోయేనాటికి ఏవో నాలుగైదు నిర్మాణలు చేసి రాజధాని నగరమనే కలర్‌ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో అమరావతి గురించి విపరీతమైన ప్రచారం జరగ్గా, జగన్‌ అధికారంలోకి రాగానే అది చప్పున చల్లారిపోయింది. ప్రపంచ బ్యాంకు, మరో అంతర్జాతీయ ఆర్థిక సంస్థ రాజధాని నిర్మాణం నుంచి తప్పుకున్నాయి. రుణాలు బందైపోయాయి. ప్రభుత్వం నిర్మాణాలన్నీ ఆపేసింది. అమరావతి నిర్మాణం పెద్ద కుంభకోణమని,  విచారణ జరుపుతామని, చంద్రబాబును జైలుకు పంపుతామని వైకాపా నేతలు రంకెలు వేశారు.

ఈ క్రమంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై, వరదలపై, అన్నా క్యాంటీన్లపై... ఇలా అనేక రాజకీయ రచ్చలు జరిగి, అమరావతి రచ్చ మొదలైంది. అమరావతిని ఉన్నచోట కొనసాగించినా, దోనకొండకో, తిరుపతి కొండకో మార్చినా ఏపీ ప్రజలకు ఇంకా కొన్నేళ్ల వరకు రాజధాని నగరం సాకారం కాదనేది వాస్తవం. అది ఎన్నేళ్లో చెప్పలేం. విభజన చట్టం ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతోంది. 2024కు ఈ గడువూ అయిపోతుంది. అయినప్పటికీ ఆ తరువాత కూడా ఏపీ ప్రజల రాజధాని (పరిపాలనపరంగా కాదు) హైదరాబాదే. విభజన తరువాత ఆంధ్రుల్లో ప్రభుత్వ ఉద్యోగులు మినహా ఇతర వర్గాలవారు ఎవరూ ఆంధ్రాలో స్థిరపడటానికి వెళ్లలేదు. సెక్రటేరియట్‌ ఉద్యోగులు కూడా తాత్కాలికంగానే వెళ్లారు తప్ప శాశ్వతంగా కాదు.

రిటైర్మెంటు తరువాత హైదరాబాదుకే చేరుకుంటారు. చాలామంది కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి. పిల్లల చదవులు ఇక్కడే కొనసాగుతున్నాయి. ఆంధ్రా నుంచి ఉద్యోగాల కోసం సిటీకే వస్తున్నారు. ఇక్కడే ఇళ్లు కట్టుకుంటున్నారు లేదా కొనుక్కుంటున్నారు. ఇక్కడే రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. పెట్టుబడులు పెడుతున్నారు. ఏపీ రాజధానిలో రియల్‌ ఎస్టేట్‌ ఢమాలంటే హైదరాబాదులో ఉచ్ఛస్థితిలో ఉంది. నివాసానికిగాని, ఉపాధికిగాని, వ్యాపారాలకుగాని ఏపీ ప్రజల గమ్యం హైదరాబాదే అవుతోంది. సొంత రాష్ట్రం అనుకొని ఏపీకి వెళితే ఏముంది అక్కడ? అనే ప్రశ్న వేస్తున్నారు చాలామంది. ఏపీ ప్రజలకు హైదరాబాదే పెద్ద భరోసా. 

జగన్నాటకంలో మంత్రులకు సీన్‌ సితారే?

Show comments